ఎవరి లెక్క వారిదే | telangana leaders waiting for general election result | Sakshi
Sakshi News home page

ఎవరి లెక్క వారిదే

Published Sat, May 3 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

telangana leaders waiting for general election result

సాక్షి, సంగారెడ్డి:  సార్వత్రిక సంగ్రామం ముగిసింది. ఇక ఫలితాల వెల్లడికి ‘కాసింత’ సమయం మిగిలి ఉంది. ‘ఐదేళ్ల పదవి’ కాంక్షతో మండుటెండలను లెక్కజేయకుండా ఎడాపెడా తిరిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులు, పోలింగ్ ముగిసిన వెంటనే యథాలాపంగా తమ ఏసీ గృహాలకు చేరి సేదతీరుతున్నారు. కానీ, గదులు ఎంత చల్లగా ఉన్నా, వారికి చెమటలు పడుతూనే ఉన్నాయి. కంటినిండా నిద్ర కూడా పట్టడం లేదు. గొంతులో ముద్ద  దిగడం లేదు. ఓటర్లు ఎలాంటి తీర్పునిచ్చారోనని అభ్యర్థులందరూ లోలోపల మదన పడుతున్నారు. పోలింగ్ సరళిని విశ్లేషిస్తూ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు.

ఈ నెల 16న వెల్లడి కానున్న ఫలితాల్లో తమ భవితవ్యం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. బయటకు మాత్రం మేమే గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. బుధవారం పోలింగ్ ముగిసిన వెంటనే గణాంకాలు తెప్పించుకున్న అభ్యర్థులు మండలాలు, గ్రామాల వారీగా తమకు వచ్చే ఓట్లను విశ్లేషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిపై స్పందించాలని ‘సాక్షి’ ఆయా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తున్న అభ్యర్థులను పలకరించింది. ఈ ఎన్నికల తర్వాత తమ భవితవ్యంపై అభ్యర్థులు ఏమనుకుంటున్నారు...విజయావకాశాలపై వారెలా స్పందించారు.
 
 25 వేల మెజార్టీతో గెలుస్తా  చింత ప్రభాకర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి
 ఓటర్లు నిండు మనస్సుతో ఆశీర్వదించి ఓటేసినందువల్ల దాదాపు 25 వేల ఓట్ల మోజార్టీతో కచ్చితంగా విజయం సాధిస్తా. సదాశివపేట, సంగారెడ్డి పట్టణాలతో పాటు సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి మండలాల ఓటర్లు టీఆర్‌ఎస్ పార్టీనే ఆశీర్వదించి ఓట్లు వేశారు. అందువల్ల నాకే మోజార్టీ వస్తుందని భావిస్తున్నా.  

 నా కష్టాన్ని, అభివృద్ధిని ప్రజలు గుర్తించారు  కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి
 నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పడిన కష్టాన్ని ఇక్కడి ప్రజలు గుర్తించారు. అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరించి ఓటు వేశారు.  నాకు 85 వేలకు పైగా ఓట్లు రానున్నాయి. 15 వేల నుంచి 20 వేల మెజారిటీతో మళ్లీ గెలవబోతున్నాను.

 విజయం నాదే  టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి     
 పోలింగ్ రోజే మా విజయం ఖాయమైంది. భారీ మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాను. మెజార్టీ ఎంత అని తెలుసుకోడానికే ఎదురుచూస్తున్నాను. ప్రజలు టీడీపీని తిరస్కరించడంతో ఆ పార్టీ కేడర్ మా విజయానికి సహకరించింది.  

 వెయిట్ అండ్ సీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి  
 ఫలితం కోసం ఈ నెల 16 వరకు వేచి చూడండి. గెలిచేదెవరో, ఓడేదెవరో మీకే తెలుస్తుంది. ప్రజాతీర్పును శిరసా వహిస్తా. ఎలాంటి ఫలితానైన్నా స్వీకరిస్తా. ఫలితాలపై ఎలాంటి టెన్షన్ లేదు. మేము అనుకుంటున్నది చెప్పాక ఫలితాలు మరోలా వస్తే ప్రజల ముందు అపహస్యం పాలవుతాం. అందుకే కొన్ని రోజులు వేచి చూద్దాం.  

 ఊహించని మెజార్టీ ఖాయం:   టీఆర్‌ఎస్ అభ్యర్థి పి.బాబూమోహన్
 ఈ సారి నా గెలుపు ఖాయం. నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలో ఓటర్లు నన్ను ఆదరించారు. పోలింగ్ సరళిని చూస్తే అదే రోజు నా విజయం ఖాయమైందని అర్థం చేసుకున్నా. ఎవరూ ఊహించని మెజారిటీతో గెలుస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటాననే నన్ను ఆదరించారు. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రజలు విశ్వసిస్తున్నారు.

 అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు   కాంగ్రెస్ అభ్యర్థి గీతారెడ్డి
 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి గట్టి పోటీ ఎదురైనా, ప్రజలు మాత్రం అభివృద్ధికే ఓటు వేశారు. పోలింగ్ సరళి సంతృప్తిని కలిగించింది. మంచి మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మూలంగానే తెలంగాణ వచ్చిందని ప్రజలు గట్టిగా నమ్మి ఓట్లు వేశారు.  

 
 తెలంగాణ తెచ్చామని ప్రజలు నమ్మారు  కె.మాణిక్‌రావు, టీఆర్‌ఎస్ అభ్యర్థి    
 తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారు. సుమారు 10 వేలకు పైగా మెజార్టీతో నా గెలుపు ఖాయం. కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మడం లేదు. పోలింగ్ రోజు ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా కనిపించింది. తప్పకుండా గెలిచి తీరుతా.

 నా సేవలే నన్ను గెలిపిస్తాయి  కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి సునీతారెడ్డి
 గత 15 ఏళ్ళుగా  నియోజకవర్గ ప్రజలకు నేను చేసిన సేవలే నన్ను గెలిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా విజయానికి సహకరించింది.  ప్రజలందరికీ అందుబాటులో ఉండి సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాను. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం కూడా కలిసి వచ్చింది. అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చారు. నా గెలుపు ఖాయం.

 
 గెలుపుఖాయం.. మెజార్టీ చెప్పలేను  టీఆర్‌ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి
 నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నాకే మెజారిటీ రానుంది. మెదక్ పార్లమెంటు నుంచి కేసీఆర్ పోటీ చేయడం, తెలంగాణ వాదం బలంగా ఉండడం, అన్ని వర్గాల అభ్యున్నతికి అనువుగా మా మేనిఫెస్టో ఉండడం నాకు కలిసి వచ్చింది. గతంలో నేను రెండుసార్లు ఓడిపోవడం వల్ల ప్రజల్లో సానుభూతి ఉంది. ఈ సారి గెలుపు ఖాయం..కానీ మెజార్టీ ఎంతో ఇప్పుడే చెప్పలేను.
 
 5 వేలకు పైగా మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డి
 టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డిపై ఐదువేల నుంచి పది వేల ఓట్లతో మెజార్టీతో విజయం సాధిస్తా.  గ్రామాల వారీగా పోలింగ్ వివరాలను తెలుసుకున్నా.  విజయంపై నాకు ఎలాంటి అనుమానాలు లేవు.

 15 వేల మేజార్టీతో గెలుస్తా  టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి
 ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డిపై 15 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గ్రామాలలో ప్రజలు  టీఆర్‌ఎస్ పార్టీపై నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ప్రజలంతా నమ్మారు. అందుకే టీఆర్‌ఎస్ వైపే మొగ్గుచూపారు.

 వారిపై వ్యతిరేకతే నా విజయానికి దారి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు  
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతతో పాటు నరేంద్రమోడి ప్రభంజనం పనిచేస్తే నేను గెలుస్తా. సమీప ప్రత్యర్థిపై కనీసం వెయ్యి ఓట్ల మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉంది. నియోజకవర్గంలో బీజేపీకి ఆపూర్వ ఆదరణ లభించింది. దుబ్బాకను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆశిస్తున్నాను.
 
 గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్  అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి
 గజ్వేల్ నియోజకవర్గంలో మా పార్టీ పటిష్టంగా ఉంది. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీదే అన్న విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కేసీఆర్ మాట తప్పడం కూడా పోలింగ్‌పై ప్రభావం చూపింది. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో స్థానికత అంశం తెరపైకి వచ్చింది. సిద్దిపేట పెత్తనాన్ని గజ్వేల్ ప్రజలు కోరుకోవడంలేదు. అందువల్ల నాకు విజయాకాశాలున్నాయి.
 
 ప్రజలు అక్కున చేర్చుకున్నారు టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి
 2009 ఎన్నికల్లో ఓడిపోయినా నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నాను. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకున్నాను. అందువల్ల ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు  అక్కున చేర్చుకున్నారు. టీఆర్‌ఎస్ నాపై ఎన్నో రకాల కుట్రలు చేసింది. అయినా ప్రజలు నాకే మద్దతు తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పునాదులు ఉండటం నాకున్న బలం.
 
 2009 ఫలితం పునరావృతం కాంగ్రెస్ అభ్యర్థి పి.కిష్టారెడ్డి
 ఖేడ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ఓటర్లు ఆదరించారు. నాకు అఖండ విజయం ఖాయం. 2009 ఎన్నికల్లో వచ్చిన 27 వేల మెజార్టీనే మళ్లీ పునరావృతం కాబోతోంది. గత ఐదేళ్ళుగా చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపించబోతున్నాయి. గతంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రజలకు చేశాను. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేశాను.

 వైఎస్సార్ అభిమానులంతా ఆశీర్వదించారు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అప్పారావు షెట్కార్
 దివంగత సీఎం వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా నాకే ఓటు వేశారు. యువత, మహిళలు, దళితులు, గిరిజనులు ఇలా అందరూ నాకే మద్దతు తెలిపారు. తప్పకుండా నేనే గెలిచి తీరుతానని నమ్ముతున్నా. నాకు ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా.

 10 వేల మెజార్టీ తథ్యం  టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి
 తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం సాధించినందుకు టీఆర్‌ఎస్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టారు. గిరిజనులు, యువత, మహిళలు, మైనారిటీలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేశారు. తక్కువలో తక్కువగా వేసుకున్నా కనీసం 10 వేల మెజారిటీతో నా గెలుపు ఖాయంగా ఉంది.
 
 భారీ మెజార్టీపై సంపూర్ణ విశ్వాసం  టీఆర్‌ఎస్ అభ్యర్థి హరీష్‌రావు
 గత ఉప ఎన్నికలతో పోలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. దీంతో నా మెజార్టీ కూడా పెరుగుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉంది. సిద్దిపేటలో నా విజయం నామినేషన్ వేసిన రోజే ఖాయమైంది. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నా. నియోజకవర్గ ప్రజలు మరోసారి సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారని గట్టిగా నమ్ముతున్నా.  
 
 విజయానికి దగ్గరగా... కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్ గౌడ్

 కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిందని ఓటర్లు నమ్మారు. గత ఉప ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కూడా నాకు ఓట్లు తెచ్చిపెట్టింది. దీంతో విజయానికి దగ్గరగా ఉన్నా. సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా.
 
 తెలంగాణవాదమే నా బలం టీఆర్‌ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి
 కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నియోజకవర్గ ప్రజలు విశ్వసించారు. తెలంగాణ సాధించిన టీఆర్‌ఎస్ పార్టీకీ ప్రజలు కృతజ్ఞతపూర్వకంగా ఓటు వేశారు. 15వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం ఉంది. నా గెలుపుకోసం సీమాంధ్రవారు కూడా పనిచేశారు. వారందరికీ కృతజ్ఞతలు.
 
 అన్ని వర్గాల ఓటు నాకే  కాంగ్రెస్ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్
 పటాన్‌చెరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు కొన్ని గ్రామాల్లోనే ఆధికత్య ఉంది. అమీన్‌పూర్‌లో టీడీపీ బలంగా ఉన్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ కొన్ని గ్రామాల్లో బలంగా ఉంది. కొన్ని గ్రామాల్లో బలహీనంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి అన్ని గ్రామాల్లో ఓట్లు భారీ పడ్డాయనుకుంటున్న. 10వేలకు పైగా ఓట్ల మెజార్టీ వస్తుందని భావిస్తున్నా.

 క్లీన్ ఇమేజే గెలిపిస్తోంది  టీడీపీ అభ్యర్థి సపాన్‌దేవ్
 సర్పంచ్‌గా, మండల పరిషత్ అధ్యక్షుడిగా, పటాన్‌చెరు కార్పొరేటర్‌గా నాకున్న క్లీన్ ఇమేజ్ కారణంగా ప్రజలు నాకు మద్దతుగా నిలిచారు. టీడీపీ ఇచ్చిన లేఖతోనే తెలంగాణ వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు. అందువల్లే తెలంగాణ వారే కాకుండా తెలంగాణేతరులు కూడా టీడీపీకే ఓటు వేశారు. పార్టీ కార్యకర్తలతో పాటు బీజేపీ నేతలు నా గెలుపునకు బాగా సహకరించారు. నా విజయం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement