అంచనాలు తారుమారు
సాక్షి, రాజమండ్రి :
రాజమండ్రి నగరపాలక సంస్థపై తెలుగుదేశం పార్టీ అంచనాలు బూమరాంగ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడోసారి మేయర్ పీఠం దక్కించుకుందామనుకున్న ఆ పార్టీ నేతలను ఇప్పుడు ఓటమి భయం వెంటాడుతోంది.
ఒక పక్క అంతర్గత కుమ్ములాటలు, మరో పక్క పేదల పక్కా ఇళ్ల పంపిణీని అడ్డుకున్న ఆ పార్టీ నేతల పాపం కట్టకట్టుకుని తమకు ముప్పు తెస్తున్నాయని పార్టీ అభ్యర్థులే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. బాజా భజంత్రీలతో స్థానికేతర జనాలతో డివిజన్‌లలో టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తూ పైకి బింకం ప్రదర్శిస్తున్నా, స్థానికులలో వ్యక్తం అవుతున్న వ్యతిరేకత పార్టీ వర్గాలను అంతర్గతంగా గుబులుకు గురిచేస్తోంది.
ఎసరు పెడుతున్న అసంతుష్టులు
పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కార్పొరేషన్ ఎన్నికల్లో అవలంబించిన కొత్త వ్యూహం బెడిసి కొడుతోంది. సీనియర్లు, పార్టీని నమ్ముకుని కొనసాగుతున్న వారిని కాదని కొత్తవారికి కార్పొరేటర్ టికెట్లు కేటాయించిన తీరు పలువార్డుల్లో క్యాడర్‌ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.
దీంతో పన్నెండుకు పైగా డివిజన్లలో స్థానిక తమ్ముళ్లు ఇండిపెండెంట్లకు కొమ్ముకాస్తూ, సొంత అభ్యర్థులకు ఎసరు పెడుతున్నారని తెలుస్తోంది. తొలిరోజుల్లో తమ పార్టీకి బూమ్ ఉందని జూమ్ చేసి చూపించిన టీడీపీ నేతలు, తాజా పరిస్థితులు చూసి బెంబేలెత్తుతున్నారు. భంగపడ్డ ఆశావహుల తీరుకు అసంతృప్తిగా ఉన్న అభ్యర్థులు ప్రచారజోరు కూడా తగ్గించారని సమాచారం.
పేదల ఇళ్లకు అడ్డుపడిన పాపం వెంటాడుతోంది..
ఎప్పుడు తమకు పక్కా ఇళ్లు అందుతాయా అని నగరంలో నిరుపేదలు ఎనిమిదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు రెండు నెలల క్రితం అధికారులు 2500 ఇళ్ల పంపిణీని చేపట్టారు.అయితే వీటి పంపకాాలను బుచ్చయ్యచౌదరి నాయకత్వంలో టీడీపీ నేతలు అడ్డుకోవడంతో లబ్ధిదారులు తిరగబడ్డారు. అంతేకాకుండా తరిమికొట్టారు. దీంతో ఆగ్రహించిన బుచ్చయ్య ఈ ప్రభుత్వం ఉండగా ఇళ్లను పంచనివ్వబోమని సభ పెట్టి మరీ సవాల్ చేశారు.
నాటి ఈ సంఘటన ప్రభావం నేడు పేదల వాడల్లో ప్రతిఫలిస్తోంది. తమ నోటికాడ కూడు లాక్కున్న నేతకు ఓటడిగే హక్కు ఎక్కడిదని వివిధ డివిజన్లలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎదురుగాలి నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మురళీమోహన్ సైతం డివిజన్లలో పర్యటనకు అనాసక్తత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.