- ఎన్నికల ఖర్చు రూ.200 కోట్లు
- పోటాపోటీగా ‘ఓటుకు నోటు’
- వెనుకాడని ప్రధాన పార్టీల అభ్యర్థులు
- ఒక్కో సెగ్మెంట్‌లో రూ.10 కోట్లకు పైనే పంపిణీ
- జనగామ సెగ్మెంట్‌లో అత్యధికం
- కాగితాల్లో మాత్రం కాకిలెక్కలు
హన్మకొండ, న్యూస్‌లైన్ : ఈసారి జరిగిన ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డుకెక్కాయి. జిల్లాలో సుమారు రూ.200 కోట్లు ఖర్చరుునట్లు రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముద్ర వేసుకోవాలనే తపనతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీగా తారుులాలు సమర్పించినట్లు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రూ. 28 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ. 70 లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ... ప్రధాన పార్టీలకు చెందిన ఒక్కో అభ్యర్థి సగటున రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లు వెదజల్లారు. ఇక అధినేతలు, ప్రధాన నాయకులు పోటీ పడిన సెగ్మెంట్లలో ప్రలోభ పర్వం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా సాగగా... ధన, మద్య ప్రవాహం ఏరులై పారింది.
జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 153 మంది అభ్యర్థులు పోటీ చేయగా... వారిలో 36 మంది ప్రధాన పార్టీలు, మరొక్కరు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. రెండు పార్లమెంట్ స్థానాల్లో ప్రధానంగా ఎనిమిది మంది తలపడ్డారు. వీరందరూ ఎన్నికల ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. పది మంది సభ్యులుగా ఉన్న సంఘానికి ఒక పార్టీ అభ్యర్థి రూ. ఐదు వేలు ఇస్తే... మరో పార్టీ అభ్యర్థి ఏకంగా రూ.పది వేలు ఇచ్చారు. ఇలా ఒకరి కంటే ఒకరు రెండింతల డబ్బును వారి చేతిలో పెట్టారు. జిల్లాలోని 43 వేల మహిళా సంఘాలు, 14 వేల యువజన సంఘాలు, గ్రామగ్రామాన ఉన్న కుల సంఘాలు, వాడవాడలా ఉన్న కాలనీ అభివృద్ధి కమిటీలకు ఈసారి అన్ని పార్టీల నుంచి ప్రలోభాలు దక్కాయి.
సంఘాల వారిగానే కాకుండా ప్రత్యక్షంగా కూడా ఒక్కొక్కరికి ఎన్నికల్లో లాభం చేకూరింది. ఇలా కాగితాల్లోకెక్కని ఖర్చు కోట్లకు చేరింది. నిన్నటివరకు ఆయా సెగ్మెంట్లలో తమ పార్టీ తరఫున నోట్లను పంచిన పార్టీల నేతలు... ఇప్పుడు జిల్లా కేంద్రంలో అంచనాలు వేసుకుంటున్నారు. ఏ ప్రాంతంలో ఎంత పంపిణీ చేశాం... నోట్లకు ఓట్లు ఎన్ని రాలాయి... అనే లెక్కల్లో మునిగిపోయూరు. కాగా, అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా... అధికారులకు మాత్రం లక్షల్లో ఖర్చు చూపించారు. ఒక్కో అసెంబ్లీ అభ్యర్థి ఖర్చు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలు... ఎంపీ అభ్యర్థి రూ. 60 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు కాకిలెక్కలు చూపించారు. అధికారులు కెమెరా కళ్లతో నిఘా పెట్టినా... పట్టుబడలేదు. చివరిరోజు మాత్రం పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్‌తోపాటు పలు ప్రాంతాల్లో రూ. 70 లక్షలు పట్టుకున్నారు.
కోటీశ్వరులు పోటీ చేసిన జనగామ సెగ్మెంట్‌లో తాయిలాలు జోరుగా సాగా యి. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు నోట్ల వరద పారిం చారు. ఓ అభ్యర్థి రూ.15 కోట్లు ఇక్కడ వెదజల్లినట్లు ప్రచారం సాగుతోంది. మిగిలిన ఇద్దరు అభ్యర్థులు రూ.పది కోట్ల చొప్పున ఖర్చు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నారుు. మొత్తం రూ.30 కోట్ల వరకు ప్రలోభ జాతర సాగినట్లు అంచనా.
పాలకుర్తిలో ఓ పార్టీలో ప్రధాన పదవిలో కొనసాగుతున్న అభ్యర్థి రూ.15 కోట్ల నుంచి రూ. 20 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నారుు. మిగిలిన ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు సైతం నోట్ల కట్టలను వెదజల్లినట్లు నియోజకవర్గ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, స్టేషన్ ఘన్‌పూర్, డోర్నకల్ సెగ్మెంట్లలో ఒక్కో అభ్యర్థి రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా.
వరంగల్ తూర్పులో ఓ పార్టీ అభ్యర్థి తరఫున వ్యాపారులే డబ్బులు పంపిణీ చేశారు. ఆర్వోబీ నిర్మాణంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న పలువురు వ్యాపారులు తలా కొంత వేసుకుని కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది.
వరంగల్ పశ్చిమ, మానుకోట, వర్ధన్నపేట, ములుగు నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి రూ. 2 నుంచి రూ. 4 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా.
పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్లు వెదజల్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నారుు. వరంగల్ ఎంపీ స్థానంలో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నోట్ల కట్టలను వెద్దజల్లినట్లు ఆయూ శ్రేణులు ముచ్చటించుకుంటున్నారుు. మానుకోటలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్క ఓటుకు రూ. 300 నుంచి రూ. 500 వరకు ఇచ్చినట్లు తెలిసింది.