- 16 మధ్యాహ్నం 2 గంటల్లోగా ఫలితాలు
- ఓట్ల లెక్కింపు కోసం 12+12 టేబుళ్లు
- అనుమతించిన ఎన్నికల సంఘం
- కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు
- 14 నాటికే ఏర్పాట్లు పూర్తి
- జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్
సాక్షి, సిటీబ్యూరో: హోరాహోరీ ప్రచార హోరు.. పోటాపోటీ పబ్లిసిటీలతో సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉంది. ప్రజాతీర్పు ఎలా ఉందో తెలుసుకునేందుకు అటు రాజకీయ పార్టీలతో పాటు ఇటు సిటీజనులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో తుదిఘట్టమైన కౌంటింగ్ ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో ఇందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు.
కౌంటింగ్ జరిగేంత వరకు ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో పాటు.. కౌంటింగ్ రోజున ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కౌంటింగ్‌లో ఆలస్యం జరగకుండా ఉండేందుకు 7+7 కౌంటింగ్ టేబుళ్ల స్థానే, 12+12 టేబుళ్ల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ అనుమతించిందని చెప్పారు.
ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లకు అనుగుణంగా కొన్నింటికి 14+14 టేబుళ్లు, మరికొన్నింటికి 15+15 టేబుళ్ల వంతున ఏర్పాటు చేసేందుకు అనుమతించే అవకాశం కూడా ఉందన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు.. ఎన్ని గంటల్లోగా ఫలితం వెలువడవచ్చు.. ఏ నియోజకవర్గ ఫలితం తొలుత వెలువడేందుకు అవకాశం ఉంది.. తదితర అంశాలపై కమిషనర్ ‘సాక్షికి వెల్లడించిన అంశాలివీ...
పటిష్ట భద్రతా ఏర్పాట్లు
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సోమేశ్‌కుమార్ చెప్పారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలకు పటిష్టమైన భద్రత కల్పించామన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజకీయపార్టీల పోలింగ్ ఏజెంట్ల కోసం అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద తగిన బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు తావు లేకుండా ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌లతో పాటు కేంద్రం నుంచి వచ్చిన మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. ఎన్నికల సంఘం తొలుత ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 7 టేబుళ్లు.. పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు 7 టేబుళ్ల వంతున ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 7+7 టేబుళ్లకే అనుమతించిందన్నారు.
ఇలాగైతే ఎక్కువ సమయం పట్టే అవకాశాన్ని తెలియజేస్తూ తాను టేబుళ్ల సంఖ్యను పెంచాల్సిందిగా కోరగా, 12+12 టేబుళ్ల ఏర్పాటుకు అనుమతించిందన్నారు. ఒకట్రెండు నియోజకవర్గాలకు 15+15 టేబుళ్లు అవసరం కావచ్చని.. అందుకు కూడా ఎన్నికల సంఘం అనుమతించగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తొలి ఫలితం చార్మినార్‌దే..?
ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్ల సంఖ్యను బట్టి ఫలితాల సమయం ఆధారపడుతుందన్నారు. తక్కువ పోలింగ్ స్టేషన్లున్న నియోజకవర్గ ఫలితం త్వరితంగా వెలువడుతుందని, ఎక్కువ పోలింగ్ స్టేషన్లున్న నియోజకవర్గ ఫలితానికి ఆ మేరకు సమయం పడుతుందన్నారు. ఈ లెక్కన చార్మినార్, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితం తొలుత వెలువడే అవకాశం ఉంది. చార్మినార్‌లో 179, సనత్‌నగర్‌లో 189 పోలింగ్ కేంద్రాలున్నాయి.
జూబ్లీహిల్స్, కార్వాన్ నియోజకవర్గాల ఫలితానికి ఎక్కువ సమయం పట్టే వీలుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 271 పోలింగ్ కేంద్రాలుండగా, కార్వాన్‌లో 254 పోలింగ్ కేంద్రాలున్నాయి. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి దాదాపు ఆరేడు గంటల్లోగా ఫలితాలొస్తాయన్నారు. ఈ లెక్కన మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా ఫలితాలు వెలువడగలవని అంచనా.
కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కమిషనర్
మాసబ్‌ట్యాంక్‌లోని పాలిటెక్నిక్ కళాశాల, నిజాం కాలేజీ, ఎల్‌బీ స్టేడియంలలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌రూంలను జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ ఆదివారం తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి గందరగోళం.. ఇబ్బందులకు తావు లేకుండా కౌంటింగ్ సూపర్‌వైజర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు.
మైక్రో అబ్జర్వర్లకు కూడా సోమవారం శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 14వ తేదీ నాటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి.. ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తామని చెప్పారు. కౌంటింగ్ పారదర్శకంగా ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అన్ని స్ట్రాంగ్‌రూమ్‌లను తాను తనిఖీ చేశానని, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సైతం ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ కమిషనర్ సహకారం తీసుకుంటున్నామన్నారు
కౌంటింగ్.. కసరత్తు
Published Sun, May 11 2014 1:26 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement