District Electoral Officer
-
13న ఓటర్ల ముసాయిదా
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూలు సిటీబ్యూరో, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను ఈనెల 13న వెలువరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. వీటికి సంబంధించి వెలువడే అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకు స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో, పోలింగ్ కేంద్రాల భవనాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. -
రేపే కౌంటింగ్
- ఉదయం 8 .30 నుంచి ఓట్ల లెక్కింపు - కంట్రోల్ రూమ్ ద్వారా కౌంటింగ్ వీక్షణం - మధ్యాహ్నం 3 గంట ల కల్లా ఫలితాలు - కేంద్రంలోకి వాహనాలకు అనుమతి నిల్ - జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల ప్రక్రియలో తుది ఘట్టం.. కౌంటింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు తెరవేసే కీలకమైన కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలి పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లయిన ముఖేశ్‌కుమార్ మీనా, ఇ. శ్రీధర్‌లతో కలసి బుధవారం ఆయన జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సం బంధించిన ఓట్ల లెక్కింపు 18 హాళ్లలో జరుగుతుందన్నారు. సనత్‌నగర్, సికింద్రాబాద్, కం టోన్మెంట్ నియోజకవర్గాల అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు వేర్వేరు హాళ్లలో జరుగుతాయన్నారు. మిగతా నియోజకవర్గాలవి రెండు నియోజకవర్గాల లెక్కింపు ఒకే హాల్లో జరుగుతాయన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఫలితం కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, సికింద్రాబాద్ పార్లమెంట్ ఫలితం యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రాల్లో వెల్లడిస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తి ఫలితాలు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్ల కనుగుణంగా 12 నుంచి 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏర్పాటు చేస్తున్న టేబుళ్లు.. లెక్కింపు జరిగే రౌండ్ల ఆధారంగా జిల్లా పరిధిలో చార్మినార్ అసెంబ్లీ ఫలితం తొలుత.. యాకుత్‌పురా అసెంబ్లీ ఫలితం చివర వెలువడే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి చార్మినార్ ఫలితం వెలువడేం దుకు దాదాపు నాలుగున్నర గంటల సమయం పట్టవచ్చనే అంచ నా ఉందన్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెలువడగలవని అంచనా వేస్తున్నామన్నారు. వివాదాల్లేకుండా సూపర్ చెక్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసే టేబుళ్లు కాక మరో రెండు టేబుళ్లు అదనంగా ఏర్పాటు చేసి.. అక్కడ ఈవీఎంలను ర్యాండమ్‌గా చెక్ చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు హెల్పర్ ఉంటారన్నారు. ఓట్ల లెక్కిం పులో ఎలాంటి వివాదానికి తావులేకుండా మైక్రో అబ్జర్వర్లు, అబ్జర్వర్లు సూపర్ చెక్ చేస్తారన్నారు. ఏైదె నా ఈవీఎంలో సమస్యలు తలెత్తితే దాన్ని మాత్రం పక్కనపెట్టి కౌంటింగ్‌కు ఆటంకం లేకుండా మిగతా ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారన్నారు. వెయ్యిమంది కౌంటింగ్ సూపర్వైజ ర్లు.. మరో వెయ్యిమంది అసిస్టెంట్లు, కేంద్రం నుంచి వచ్చిన 500 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొంటారన్నారు. కంట్రోల్‌రూమ్ ద్వారా.. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ఫలితాలు ఒకేచోటు నుంచి తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్రూ మ్ పనిచేస్తుందన్నారు. వెబ్‌క్యామ్‌ల ద్వారా ఆయా కౌంటింగ్ కేం ద్రాల్లోని దృశ్యాలను కంట్రోల్‌రూమ్ నుంచి వీక్షించవచ్చన్నారు. సమస్యలు తలెత్తితే.. ఈవీఎంలలో ఏదైనా సమస్యల తలెత్తితే సదరు ఈవీఎంలలోని ఓట్లను ‘ప్రింటర్ కమ్ ఆగ్జిలరీ డిస్ప్లే యూనిట్ (పాడు)’ నుంచి తెలుసుకోవచ్చునన్నారు. అవసరమైతే రౌండ్ల వారీ ఓట్ల వివరాల ప్రింట్‌ను పొందవచ్చునని చెప్పారు. ఏదైనా ఈవీఎంలో సమస్యలు తలెత్తినప్పుడు.. సదరు ఈవీఎంలోని ఓట్ల లెక్కింపుపైనే ఎవరు విజేతలో తెలిసే (ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్ల తేడా స్వల్పంగా మాత్రమే ఉన్నప్పుడు) పరిస్థితి ఉంటే.. ఎన్నికల సంఘానికి విషయాన్ని తెలియజేసి.. దాని ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఒక ఈవీఎంలోని ఓట్లు గెలుపోటములను నిర్దేశించే పరిస్థితి లేనప్పుడు ఎలాంటి సమస్య ఉండబోదని చెప్పారు. ఈవీఎంలలో సాంకేతితక సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఇద్దరు ఈసీఐఎల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారన్నారు. రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లున్నాయని చెప్పారు. పరిమిత సంఖ్యలో అధికారుల వాహనాలు తప్ప కౌంటింగ్ కేంద్రాల్లోకి ఇతరుల వాహనాలు అనుమతించరని స్పష్టం చేశారు. మీడియాకు రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు తెలిపేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం 6.30 గంటలకు స్ట్రాంగ్‌రూమ్‌లు తెరుస్తారని.. రాజకీయపార్టీల ఏజెంట్లు 6 గంటలకల్లా అక్కడకు చేరుకోవాలని సూచించారు. ప్రతి రౌండ్లో వచ్చిన ఓట్ల వివరాలను సదరు టేబుల్ వద్ద ప్రదర్శిండంతోపాటు మైకు ద్వారా తెలియజేస్తారన్నారు. హాలు ఆవరణలో కూడా బోర్డుపై వివరాలు వెల్లడిస్తారన్నారు. నిర్వహణ వ్యయం ఇలా.. ఎన్నికల నిర్వహణకోసం ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ద్వారా రూ. 17 కోట్లు మంజూరు కాగా, మరో రూ. 6 కోట్ల కావాల్సిందిగా కోరామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అందరికీ రిటర్నింగ్ అధికారుల ద్వారా వేతనాలందజేస్తామని తెలిపారు. ఈనెల 28 వరకు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతలను ప్రకటించాక ఎన్నికల సంఘం కోడ్‌ను ఎత్తివేస్తుందని ముఖేశ్‌కుమార్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
కౌంటింగ్.. కసరత్తు
- 16 మధ్యాహ్నం 2 గంటల్లోగా ఫలితాలు - ఓట్ల లెక్కింపు కోసం 12+12 టేబుళ్లు - అనుమతించిన ఎన్నికల సంఘం - కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు - 14 నాటికే ఏర్పాట్లు పూర్తి - జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో: హోరాహోరీ ప్రచార హోరు.. పోటాపోటీ పబ్లిసిటీలతో సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉంది. ప్రజాతీర్పు ఎలా ఉందో తెలుసుకునేందుకు అటు రాజకీయ పార్టీలతో పాటు ఇటు సిటీజనులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో తుదిఘట్టమైన కౌంటింగ్ ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో ఇందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. కౌంటింగ్ జరిగేంత వరకు ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో పాటు.. కౌంటింగ్ రోజున ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కౌంటింగ్‌లో ఆలస్యం జరగకుండా ఉండేందుకు 7+7 కౌంటింగ్ టేబుళ్ల స్థానే, 12+12 టేబుళ్ల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ అనుమతించిందని చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లకు అనుగుణంగా కొన్నింటికి 14+14 టేబుళ్లు, మరికొన్నింటికి 15+15 టేబుళ్ల వంతున ఏర్పాటు చేసేందుకు అనుమతించే అవకాశం కూడా ఉందన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు.. ఎన్ని గంటల్లోగా ఫలితం వెలువడవచ్చు.. ఏ నియోజకవర్గ ఫలితం తొలుత వెలువడేందుకు అవకాశం ఉంది.. తదితర అంశాలపై కమిషనర్ ‘సాక్షికి వెల్లడించిన అంశాలివీ... పటిష్ట భద్రతా ఏర్పాట్లు హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సోమేశ్‌కుమార్ చెప్పారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలకు పటిష్టమైన భద్రత కల్పించామన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజకీయపార్టీల పోలింగ్ ఏజెంట్ల కోసం అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద తగిన బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు తావు లేకుండా ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు కేంద్రం నుంచి వచ్చిన మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. ఎన్నికల సంఘం తొలుత ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 7 టేబుళ్లు.. పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు 7 టేబుళ్ల వంతున ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 7+7 టేబుళ్లకే అనుమతించిందన్నారు. ఇలాగైతే ఎక్కువ సమయం పట్టే అవకాశాన్ని తెలియజేస్తూ తాను టేబుళ్ల సంఖ్యను పెంచాల్సిందిగా కోరగా, 12+12 టేబుళ్ల ఏర్పాటుకు అనుమతించిందన్నారు. ఒకట్రెండు నియోజకవర్గాలకు 15+15 టేబుళ్లు అవసరం కావచ్చని.. అందుకు కూడా ఎన్నికల సంఘం అనుమతించగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తొలి ఫలితం చార్మినార్దే..? ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్ల సంఖ్యను బట్టి ఫలితాల సమయం ఆధారపడుతుందన్నారు. తక్కువ పోలింగ్ స్టేషన్లున్న నియోజకవర్గ ఫలితం త్వరితంగా వెలువడుతుందని, ఎక్కువ పోలింగ్ స్టేషన్లున్న నియోజకవర్గ ఫలితానికి ఆ మేరకు సమయం పడుతుందన్నారు. ఈ లెక్కన చార్మినార్, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితం తొలుత వెలువడే అవకాశం ఉంది. చార్మినార్‌లో 179, సనత్‌నగర్‌లో 189 పోలింగ్ కేంద్రాలున్నాయి. జూబ్లీహిల్స్, కార్వాన్ నియోజకవర్గాల ఫలితానికి ఎక్కువ సమయం పట్టే వీలుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 271 పోలింగ్ కేంద్రాలుండగా, కార్వాన్లో 254 పోలింగ్ కేంద్రాలున్నాయి. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి దాదాపు ఆరేడు గంటల్లోగా ఫలితాలొస్తాయన్నారు. ఈ లెక్కన మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా ఫలితాలు వెలువడగలవని అంచనా. కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కమిషనర్ మాసబ్‌ట్యాంక్‌లోని పాలిటెక్నిక్ కళాశాల, నిజాం కాలేజీ, ఎల్బీ స్టేడియంలలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌రూంలను జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ ఆదివారం తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి గందరగోళం.. ఇబ్బందులకు తావు లేకుండా కౌంటింగ్ సూపర్వైజర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. మైక్రో అబ్జర్వర్లకు కూడా సోమవారం శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 14వ తేదీ నాటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి.. ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తామని చెప్పారు. కౌంటింగ్ పారదర్శకంగా ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని స్ట్రాంగ్‌రూమ్‌లను తాను తనిఖీ చేశానని, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సైతం ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ కమిషనర్ సహకారం తీసుకుంటున్నామన్నారు -
రేపటి నుంచి సార్వత్రిక నామినేషన్లు
-
రేపటి నుంచి సార్వత్రిక నామినేషన్లు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి శశిధర్ తెలిపారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను జాగ్రత్తగా పూరించి దాఖలు చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సభా భవనంలో రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప లోక్‌సభ స్థానానికి కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని కలెక్టరేట్లోనే నామినేషన్లు వేయాలన్నారు. ఒకవేళ ఆర్వో అందుబాటులో లేకపోతే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అయిన డీఆర్వో వద్ద నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్కడి ఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. రాజంపేట లోక్‌సభకు నామినేషన్లు వేయాలనుకునే అభ్యర్థులు చిత్తూరుకు వెళ్లి ఆర్వో అయిన అక్కడి జాయింట్ కలెక్టర్ వద్ద నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాలైన 13, 14, 18 తేదీలలో నామినేషన్లు స్వీకరించబోరని స్పష్టం చేశారు. ఈనెల 21వ తేదీన స్క్రూటినీ, 23న ఉపసంహరణ ఉంటాయన్నారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని, గుర్తింపు లేని రాజకీయ పార్టీ అభ్యర్థికి పదిమంది బలపరచాల్సి ఉంటందని పేర్కొన్నారు. ఆర్వో గదిలోకి అభ్యర్థితోసహా ఐదు మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఆర్వో గదికి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాల ప్రవేశానికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఒక్కో వాహనంలో ఐదు మందికి మించకూడదన్నారు. నామినేషన్లు ముగిసే వరకు కలెక్టరేట్‌లోకి ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లను మాత్రమే దాఖలుచేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే నామినేషన్లు వేసేందుకు అర్హత ఉంటుందని చెప్పారు. లోక్‌సభకు నామినేషన్ ఫీజు కింద రూ. 25 వేలు, అసెంబ్లీకి రూ. 10 వేలు చెల్లించాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు 50 శాతం మినహాయిం ఉంటుందన్నారు. నామినేషన్ల సందర్బంగా సమర్పించే ఫారం-26 (అఫిడవిట్లో) ఖాళీలు వదలరాదన్నారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పించే వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది నిజమని రుజువైతే చర్యలు తప్పవన్నారు. అఫిడవిట్లను ఆర్వో కార్యాలయ నోటీసు బోర్డులో ప్రకటిస్తామని సీఈఓ వెబ్సైట్లో ఉంచుతామని, మీడియాకు ఉచితంగా అందజేస్తామని వివరించారు. అఫిడవిట్లలో ఖాళీలు వదిలితే అభ్యర్థికి నోటీసు జారీ చేస్తామని, ఆ అభ్యర్థి మళ్లీ నామినేషన్ దాఖలుచేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ వేసేందుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంకు అకౌంటును తప్పనిసరిగా ప్రారంభించాలన్నారు. దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, కాకపోతే ఓటున్న నియోజకవర్గం నుంచి సర్టిఫైడ్ కాపీని సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థికి ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ఉంటే వాటిని కూడా పొందుపరచాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల వద్ద 50 వేల రూపాయల కంటేఎక్కువ ఉంటే సీజ్ చేస్తామన్నారు. ముగ్గురు వ్యయ పరిశీలకులు శుక్రవారం జిల్లాకు చేరుకోనున్నారని, వ్యయ నివేదికలను అభ్యర్థులు సక్రమంగా సమర్పించాలన్నారు. ప్రతి అభ్యర్థికి తాము షాడో రిజిష్టర్లను నిర్వహిస్తామన్నారు. ఓటరు స్లిప్పులు పంపిణీకి చర్యలు తీసుకుంటామని, పోలింగ్ రోజున ఓటరు కుడి చూపుడు వేలుకు ఇంకు గుర్తు వేస్తారని తెలిపారు. స్లిప్పులు లేకపోయినా ఈసీ సూచించిన 24 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపెట్టినా ఓటు వేయడానికి అనుమతిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 560 ర్యాంప్స్, టాయిలెట్స్, తాగునీరు, షామియానా వంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నామినేషన్ల సమయంలో తమ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల వలే డిక్లరేషన్ సరిపోదని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఒకరు మాత్రమే జనరల్ ఏజెంటుగా ఉంటారని, ప్రభుత్వ గన్‌మెన్ సౌకర్యం ఉన్న వారిని జనరల్ ఏజెంటుగా అనుమతించబోమన్నారు. -
ఓటుందో.. లేదో... చూసుకోండి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉందో, లేదో ముందుగా పరిశీలించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందన్‌రావు సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని 9వ వార్డులో కేకేఆర్ గౌతమ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని 9/1వ నంబరు బూత్‌లో కలెక్టర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జాయింట్ కలెక్టర్ జె.మురళీ లేడీస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన 11వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో, లేదో పరిశీలించుకోవాలని, లేకుంటే ఎన్నికల సంఘానికి మెసేజ్ ద్వారా పంపినా మీ ఓటు ఉందో, లేదో తెలిసిపోతుందని తెలిపారు. ఒక వేళ ఓటు లేకుంటే సంబంధిత ఫారాలతో ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరచినా, సంబంధిత బీఎల్వోకు అందజేసినా ఓటు పొందవచ్చునన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందా అని కలెక్టర్‌ను ప్రశ్నించగా... 1వ తేదీ మధ్యాహ్నం నాటికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంటుగా ఆ వార్డుకు సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండాలా లేదా అని ప్రశ్నించగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థి ఎవర్ని సూచిస్తే వారిని ఏజెంటుగా నియమించుకోవచ్చని చెప్పారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, అయితే నందిగామ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితాలో లోటుపాట్ల వల్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ఈ సంఘటనపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.