రేపే కౌంటింగ్ | Tomorrow general election votes counting | Sakshi
Sakshi News home page

రేపే కౌంటింగ్

Published Thu, May 15 2014 4:20 AM | Last Updated on Tue, Sep 18 2018 8:23 PM

రేపే కౌంటింగ్ - Sakshi

రేపే కౌంటింగ్

- ఉదయం 8 .30 నుంచి ఓట్ల లెక్కింపు
- కంట్రోల్ రూమ్ ద్వారా కౌంటింగ్ వీక్షణం
- మధ్యాహ్నం 3 గంట ల కల్లా ఫలితాలు
- కేంద్రంలోకి వాహనాలకు అనుమతి నిల్
- జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్
 
సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల ప్రక్రియలో తుది ఘట్టం.. కౌంటింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు తెరవేసే కీలకమైన కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలి పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లయిన ముఖేశ్‌కుమార్ మీనా, ఇ. శ్రీధర్‌లతో కలసి బుధవారం ఆయన జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సం బంధించిన ఓట్ల లెక్కింపు 18 హాళ్లలో జరుగుతుందన్నారు. సనత్‌నగర్, సికింద్రాబాద్, కం టోన్మెంట్ నియోజకవర్గాల అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు వేర్వేరు హాళ్లలో జరుగుతాయన్నారు. మిగతా నియోజకవర్గాలవి రెండు నియోజకవర్గాల లెక్కింపు ఒకే హాల్‌లో జరుగుతాయన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఫలితం కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, సికింద్రాబాద్ పార్లమెంట్ ఫలితం యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రాల్లో వెల్లడిస్తారన్నారు.

మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తి ఫలితాలు
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్ల కనుగుణంగా 12 నుంచి 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏర్పాటు చేస్తున్న టేబుళ్లు.. లెక్కింపు జరిగే రౌండ్ల ఆధారంగా జిల్లా పరిధిలో చార్మినార్ అసెంబ్లీ ఫలితం తొలుత.. యాకుత్‌పురా అసెంబ్లీ ఫలితం చివర వెలువడే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి చార్మినార్ ఫలితం వెలువడేం దుకు దాదాపు నాలుగున్నర గంటల సమయం పట్టవచ్చనే అంచ నా ఉందన్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెలువడగలవని అంచనా వేస్తున్నామన్నారు.

వివాదాల్లేకుండా సూపర్ చెక్
ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసే టేబుళ్లు కాక మరో రెండు టేబుళ్లు అదనంగా ఏర్పాటు చేసి.. అక్కడ  ఈవీఎంలను ర్యాండమ్‌గా చెక్ చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌లతో పాటు హెల్పర్ ఉంటారన్నారు. ఓట్ల లెక్కిం పులో ఎలాంటి వివాదానికి తావులేకుండా మైక్రో అబ్జర్వర్లు, అబ్జర్వర్లు సూపర్ చెక్ చేస్తారన్నారు. ఏైదె నా ఈవీఎంలో సమస్యలు తలెత్తితే దాన్ని మాత్రం పక్కనపెట్టి కౌంటింగ్‌కు ఆటంకం లేకుండా మిగతా ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారన్నారు. వెయ్యిమంది కౌంటింగ్ సూపర్‌వైజ ర్లు.. మరో వెయ్యిమంది అసిస్టెంట్లు,  కేంద్రం నుంచి వచ్చిన 500 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొంటారన్నారు.

కంట్రోల్‌రూమ్ ద్వారా..
హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ఫలితాలు ఒకేచోటు నుంచి తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌రూ మ్ పనిచేస్తుందన్నారు. వెబ్‌క్యామ్‌ల ద్వారా ఆయా కౌంటింగ్ కేం ద్రాల్లోని దృశ్యాలను కంట్రోల్‌రూమ్ నుంచి వీక్షించవచ్చన్నారు.
 
సమస్యలు తలెత్తితే..
ఈవీఎంలలో ఏదైనా సమస్యల తలెత్తితే సదరు ఈవీఎంలలోని ఓట్లను ‘ప్రింటర్ కమ్ ఆగ్జిలరీ డిస్‌ప్లే యూనిట్ (పాడు)’ నుంచి తెలుసుకోవచ్చునన్నారు. అవసరమైతే రౌండ్ల వారీ ఓట్ల వివరాల ప్రింట్‌ను పొందవచ్చునని చెప్పారు. ఏదైనా  ఈవీఎంలో సమస్యలు తలెత్తినప్పుడు.. సదరు ఈవీఎంలోని ఓట్ల లెక్కింపుపైనే ఎవరు విజేతలో తెలిసే (ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్ల తేడా స్వల్పంగా మాత్రమే ఉన్నప్పుడు) పరిస్థితి ఉంటే.. ఎన్నికల సంఘానికి విషయాన్ని తెలియజేసి.. దాని ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఒక ఈవీఎంలోని ఓట్లు గెలుపోటములను నిర్దేశించే పరిస్థితి లేనప్పుడు ఎలాంటి సమస్య ఉండబోదని చెప్పారు. ఈవీఎంలలో సాంకేతితక సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఇద్దరు ఈసీఐఎల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారన్నారు.

రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు
స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లున్నాయని చెప్పారు. పరిమిత సంఖ్యలో అధికారుల వాహనాలు తప్ప కౌంటింగ్ కేంద్రాల్లోకి ఇతరుల వాహనాలు అనుమతించరని స్పష్టం చేశారు. మీడియాకు రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు తెలిపేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం 6.30 గంటలకు స్ట్రాంగ్‌రూమ్‌లు తెరుస్తారని.. రాజకీయపార్టీల ఏజెంట్లు 6 గంటలకల్లా అక్కడకు చేరుకోవాలని సూచించారు. ప్రతి రౌండ్‌లో వచ్చిన ఓట్ల వివరాలను సదరు టేబుల్ వద్ద ప్రదర్శిండంతోపాటు మైకు ద్వారా తెలియజేస్తారన్నారు. హాలు ఆవరణలో కూడా బోర్డుపై వివరాలు వెల్లడిస్తారన్నారు.

నిర్వహణ వ్యయం ఇలా..
ఎన్నికల నిర్వహణకోసం ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ద్వారా రూ. 17 కోట్లు మంజూరు కాగా, మరో రూ. 6 కోట్ల కావాల్సిందిగా కోరామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అందరికీ రిటర్నింగ్ అధికారుల ద్వారా వేతనాలందజేస్తామని తెలిపారు. ఈనెల 28 వరకు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతలను ప్రకటించాక ఎన్నికల సంఘం కోడ్‌ను ఎత్తివేస్తుందని ముఖేశ్‌కుమార్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement