ఢీ అంటే ఢీ!
* టీడీపీలో కేశవ్, పరిటాల సునీత మధ్య ఆధిపత్య పోరు తీవ్రం
* ఒకరిని ఓడించేందుకు మరొకరు ఎత్తుకు పైఎత్తు
* వలస పక్షులతో బలం పెంచుకుంటున్న కేశవ్...
* మండిపడుతున్న సునీత
సాక్షి, అనంతపురం : జిల్లాలో తెలుగుదేశం పార్టీలో పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ వర్గాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. పరిటాలకు బద్ధ శత్రువులైన వారందరిని కేశవ్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని పరిటాల వర్గం మండిపడుతోంది. ఇవన్నీ పట్టనట్లు కేశవ్ తన పని తాను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. పరిటాల వర్గాన్ని దెబ్బకొడుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో తాము ఎవరికి మద్దతు తెలపాలో తెలియక కార్యకర్తలు తికమక పడుతున్నారు. సోమవారం కేశవ్ తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సైతం పార్టీ శ్రేణులు ఎవరూ కనిపించకపోవడం ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. బహిరంగంగా సునీతకు మద్దతు తెలిపేందుకు కొందరు భయపడుతుండగా, మరికొంత మంది కేశవ్‌కు మద్దతు తెలిపేందుకు ఆందోళన చెందుతున్నారు.
పార్టీ నియోజకవర్గ వ్యవహారాల్లో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల తీరు పట్ల ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ వలస పక్షులను కేశవ్ ముందుండి పార్టీలోకి తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బలహీనంగా ఉన్న టీడీపీని బలోపేతం చేయాలనే ఉద్దేశమని చెబుతూనే.. తన స్వార్థం కోసం కేశవ్ కాంగ్రెస్ నేతలందర్నీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొంటున్నారు. జిల్లాలో పరిటాల వర్గ ఆధిపత్యాన్ని పూర్తిగా తగ్గించేసి వారి కార్యకలాపాలను అణచివేసేందుకు కేశవ్ వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
పరిటాల రవీంద్ర హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీ సోదరులను పార్టీలోకి తీసుకురావడంలో కేశవ్ కీలక పాత్ర వహించారని పరిటాల వర్గం భావిస్తోంది. తనకు అనుకూలమైన సీఎం రమేష్‌ను జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమించుకుని ఆయన ద్వారా పనులను చక్కబెట్టుకుంటున్నట్లు ఆ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ మంత్రి పదవులు రావని కేశవ్, సునీత ఒకరినొకరు ఓడించుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇటీవల ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించిన జేసీ దివాకర్‌రెడ్డికి ఏమాత్రం సహకరించవద్దని పరిటాల సునీత ఆమె వర్గీయులకు సూచించినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కేశవ్.. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో సునీతను ఓడిస్తే తనకెదురుండదని పథకం రూపొందించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే జేసీ సోదరులు, ఎమ్మెల్సీ తిప్పేస్వామి, అంబికా లక్ష్మినారాయణను పార్టీలోకి తీసుకొచ్చి కేశవ్ తన ఆధిపత్యాన్ని పెంచుకున్నారని చెబుతున్నారు. ఇది వరకు జిల్లాలో పరిటాల రవీంద్ర వర్గీయులు ఎక్కువగా ఉండేవారు. ఎమ్మెల్యేలు కూడా పరిటాల పట్ల విధేయతగా ఉండేవారు. ప్రస్తుతం టీడీపీలో జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, కేశవ్ తదితరులు మూడు గ్రూపులుగా విడిపోయారు.
ప్రస్తుతం కేశవ్ వర్గం జిల్లాలో బలపడిందనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి శైలజానాథ్, గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాలను సైతం పార్టీలోకి తీసుకువస్తే జిల్లా టీడీపీలో తనకెదురుండదని కేశవ్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు వద్ద సునీత మాటకు విలువలేకుండా చేయడంలో కేశవ్ విజయం సాధించారని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.