సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈ ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు తెలంగాణ జపమే చేస్తున్నాయి. తెలంగాణ పునర్‌నిర్మాణం అంశమే అన్ని పార్టీలకు ప్రధాన ఏజెండాగా మారింది. ఈ తరుణంలో తెలంగాణకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేసిన చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తే ఆ పార్టీ అభ్యర్థులకు లాభి స్తుందా? అనే అం శంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఒకరిద్దరు అభ్యర్థులకున్న సొంత ఇమేజీతో పడే ఓట్లు కూడా చంద్రబాబు రాకతో పోయే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా అంతర్గతంగా ఇదే ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత చంద్రబాబు మొదటిసారిగా బుధవారం జిల్లాకు వస్తున్నారు. రాష్ట్ర విభజనకు ఇప్పుడే తొందరెందుకంటూ పలు రాష్ట్రాల రాజకీయ పార్టీల అధినేతలను కలిసిన చం ద్రబాబు తొలిసారి పర్యటనపై జిల్లావాసులు ఎలా స్పందిస్తారనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
నాడు కోడిగుడ్లు
రైతుల కోసం పోరుబాట పేరుతో చంద్రబాబు 2011 డిసెంబర్‌లో జిల్లాలో పర్యటించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదిపిన చంద్రబాబుపై అప్పట్లో తెలంగాణవాదుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఉట్నూర్ ఎక్స్‌రోడ్ వద్ద ఆయన కాన్వాయ్‌పై ఏకంగా కోడిగుడ్లతో దాడి జరిగిన విషయం విధితమే. ఈ ఘటన ఇప్పుడు ఆ పార్టీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈసారి కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైతే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తుడిచి పెట్టుకుపోయిన పార్టీ..
తెలంగాణపై చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆ పార్టీ జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. రాథోడ్ రమేష్ మినహా ఆ పార్టీలో బలమైన నేతలు ఒక్కరు కూడా జిల్లాలో లేరు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో దూసుకెళుతుంటే టీడీపీ అభ్యర్థులు మాత్రం పోటీ ఇవ్వలేక పోతున్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు బుధవారం జిల్లాలో పర్యటిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ జిల్లాలో ఆరు స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపింది. ఇందులో ఒకరిద్దరు మినహా మిగిలిన చోట్లలో అభ్యర్థుల పరిస్థితి పూర్తిగా దయనీయంగా తయారైంది. ఏదో ఒకచోట మినహా మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మూడో, నాల్గో స్థానాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. విజయవకాశాలైతే కనుచూపు మేరల్లో కనిపించక పోవడంతో ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకత్వం ఒక రకంగా ఆశలు వదులుకుంటోంది. అభ్యర్థులకు పార్టీ నుంచి అందే ‘సహాయ, సహకారాలను’ కూడా ఒకటీ రెండు నియోజకవర్గాలకే పరిమితం చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గుర్రుగా ఉన్న బీసీలు
జిల్లాలో పది ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఇందులో మూడు ఎస్టీలకు, రెండు ఎస్సీలకు రిజర్వు అయ్యా యి. మిగిలిన ఐదు జనరల్ స్థానాల్లో ఏ ఒక్క సీటు కూడా చంద్రబాబు బీసీలకు కేటాయించలేదు. సిర్పూర్ టిక్కెట్‌ను బీసీ సామాజిక వర్గానికి బుచ్చిలింగం ఆశించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న ఆయనుకు చంద్రబాబు ఈ ఎన్నికల్లో హ్యాండిచ్చారు. ఇలా జిల్లాలో ఒక్క సీటును కూడా బీసీలకు ఇవ్వకపోవడం పట్ల బీసీ సామాజికవర్గం ప్రజలు టీడీపీపై గుర్రుగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణకు బీసీని సీఎం చేస్తానని ప్రకటించిన చంద్రబాబు జిల్లాలో ఒక్క బీసీకి ఎందుకు సీటు ఇవ్వలేదని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
లాభిస్తుందా? దెబ్బతీస్తుందా?
Published Wed, Apr 23 2014 1:47 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement