
దూసుకెళ్తా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలోని మొత్తం 57 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే... అత్యధికంగా 41 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కారు జోరులో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరైంది. కేవలం 14 స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ ఒక సీటుకే పరిమితమైంది. పుర ఫలితాల్లో గల్లంతైన టీడీపీ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది.
కాంగ్రెస్ ముఖ్య నేతలందరికీ ఈ ఫలితాలతో చుక్కెదురైంది. సార్వత్రిక ఎన్నికల ముందు వెలువడిన ఈ ఫలితాలు ఆ పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు గట్టి షాక్ తగిలింది. మంత్రి సొంత నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో అయిదు చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులే జెడ్పీటీసీలుగా గెలుపొందారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 31 మండలాల్లో కేవలం నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది. మానకొండూరు సెగ్మెంట్‌లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. హుస్నాబాద్ సెగ్మెంట్‌లో ఎల్కతుర్తి మండలం మినహా అన్ని సీట్లు టీఆర్‌ఎస్ తమ ఖాతాలో వేసుకుంది. కేవలం ఆ పార్టీ తరఫున మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాల సెగ్మెంట్‌లో తన సత్తాను చాటుకున్నారు. మున్సిపాలిటీని కైవశం చేసుకోవటంతో పాటు ఆ నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవటం గమనార్హం. ఎంపీటీసీ స్థానాల్లోనూ ఇంచుమించుగా అదే తీరు ఫలితాలు వెలువడ్డాయి.
జిల్లాలోని 817 ఎంపీటీసీ స్థానాల్లో 346 చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 281 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకుంది. మిగతా వాటిలో 53 బీజేపీ, 35 స్థానాల్లో టీడీపీ, అయిదు చోట్ల సీపీఐ, 96 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన వైఎస్సార్‌సీపీ ఒక సీటును కైవశం చేసుకుంది. ఆ పార్టీ తరఫున రామగుండం మండలం బ్రాహ్మణపల్లి ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన ములుగుంట్ల పద్మ విజయం సాధించారు.
టీఆర్‌ఎస్ గెలిచిన స్థానాలు
కరీంనగర్, హుజూరాబాద్, కమలాపూర్, వీణవంక, జమ్మికుంట, భీమదేవరపల్లి, హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, బెజ్జంకి, శంకరపట్నం, చొప్పదండి, గంగాధర, తిమ్మాపూర్, మానకొండూరు, రామడుగు, మంథని, కమాన్‌పూర్, మహాదేవ్‌పూర్, మహాముత్తారం, మల్హర్, మెట్‌పల్లి, మల్లాపూర్, ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి, కొడిమ్యాల, కథలాపూర్, రామగుండం, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, వెల్గటూర్, సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, ఇల్లంతకుంట జెడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుచుకున్నారు.
కాంగ్రెస్ గెలిచిన సీట్లు
కాటారం, ముత్తారం, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, సారంగాపూర్, రాయికల్, మల్యాల, మేడిపల్లి, ఎలిగేడు, పెద్దపల్లి, సుల్తానాబాద్, ముస్తాబాద్, ఎల్కతుర్తి.
చెరో చోట
ధర్మారంలో బీజేపీ అభ్యర్థి నారా బ్రహ్మయ్య విజయం సాధించగా.. ఓదెల మండలంలో టీడీపీ అభ్యర్థి గంట అక్షిత జెడ్పీటీసీ సభ్యురాలుగా గెలుపొందారు.