సాక్షి, ఒంగోలు: జిల్లావ్యాప్తంగా మలివిడత ప్రాదేశిక పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. కనిగిరి, ఒంగోలు, దర్శి, కందుకూరు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల పరిధిలోని 28 మండలాల్లో ఎన్నికలు జరగ్గా.. స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా పూర్తయింది. 28 జెడ్పీటీసీ స్థానాలకు గాను వంద మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 374 ఎంపీటీసీ స్థానాల్లో వివిధ రాజకీయ పార్టీల తరఫున 968 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
మొత్తం 9,42,722 మంది ఓటర్లుండగా, సగటున 84.46 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడత ఎన్నికల పోలింగ్ శాతంతో పోల్చితే.. మలిదశలో గణనీయంగా పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవగా, అప్పటికే అన్నిచోట్లా ఓటర్లు బారులుదీరి వేచి ఉండటం కనిపించింది.
ఉదయం వేళ వాతావరణం చల్లగా ఉండటంతో వృద్ధులు, మహిళలు, చంటిబిడ్డల్ని ఎత్తుకుని మరీ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేసి వెళ్లారు.
మధ్యాహ్నం 12 గంటల్లోపు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. ఓటింగ్ పర్సంటేజీ అనూహ్యంగా పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకే 68 శాతం పోలింగ్ నమోదైంది. మహిళా ఓటింగ్ ఈసారి గణనీయంగా పెరగడాన్ని బట్టి పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్లా కచ్చితంగా అనూహ్య మెజార్టీతో గెలుపొందుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పలుచోట్ల ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఓటేసేందుకు కట్టడిచేసే అగ్రవర్ణాల ప్రయత్నాలు ఫలించలేదు. ప్రధానంగా ఈ మలివిడత ఎన్నికల్లో టీడీపీ అనుకూల వర్గాల పెత్తనం, దౌర్జన్యాలు పెరిగిపోవడంపై జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులొచ్చాయి.
కొండపి నియోజకవర్గం నేతివారిపాలెంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీకి ఓటేయాలని ఓటర్లను ప్రోద్బలం చేస్తున్న ఒక వీఆర్‌ఏను పోలీసులు అరెస్టు చేశారు. అతను పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయడమే కాకుండా.. ప్రశ్నించిన సీఐ కాలర్ పట్టుకుని దాడిచేయడానికి ప్రయత్నించడంతో స్థానిక ప్రభుత్వ సిబ్బంది అడ్డుకోవడం గమనార్హం.
చెదురుమదురు ఘటనలు:
దర్శి నియోజకవర్గం, తాళ్లూరు మండలంలోని శివరామపురంలో వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై టీడీపీ కార్యకర్తలు దాడిచేసి గాయపరిచారు. వృద్ధుల ఓట్లను బహిరంగంగా చూపించి వేయాలని షరతు విధించిన టీడీపీ కార్యకర్తల ఆగడాలు అడ్డుకోబోయిన వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై దాడికి తెగబడ్డారు. ఈక్రమంలో ఉద్రిక్తత పోలీసులు చెదరగొట్టారు. అదే మండలంలోని మాదవరంలో కూడా జనాలు గుంపులుగా ఉండి.. కేంద్రం వద్దనే ప్రచారం చేస్తుండగా పోలీసులు చెదరగొట్టారు.
కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలంలోని పెదపవనిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై స్థానికంగా విధుల్లో ఉన్న సీఐ ఒకరు లాఠీచార్జి చేశారు. అదే మండలంలోని మొగిలిచర్లలో కూడా వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు ుకుంది. అంగిరేకులపాడులో ఇరు పార్టీల నేతలను ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వలేటివారిపాలెం మండలంలోని ఉప్పలపాడులో బహిరంగ ఓటుపై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
టంగుటూరు మండలంలోని మల్లవరంపాడు పోలింగ్ కేంద్రం వద్ద స్వతంత్ర అభ్యర్థికి ‘హస్తం’ గుర్తు కేటాయించడంతో ఓటర్లు ఆందోళన చేయగా.. అక్కడ మూడు గంటలపాటు పోలింగ్ ఆలస్యమైంది. ఉదయం ఏడుగంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ .. 10 .30 గంటల తర్వాత మొదలైంది. అదే మండలంలోని కందులూరు గ్రామంలో అరుంధతి పోలింగ్ కేంద్రంలో టీడీపీ అభ్యర్థి బహిరంగంగానే ఓటర్లకు 20 విలువైన అల్పాహార కూపన్‌లను పంపిణీ చేయడంపై స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులు నోరుమెదపకపోవడం గమనార్హం.
దర్శి నియోజకవర్గం, కురిచేడు మండలంలోని పాత ఎన్‌ఎస్‌పీ కాలనీ పోలింగ్‌బూత్‌ను నాలుగు కిలోమీటర్ల దూరాన ఏర్పాటు చేయడంపై నిరసనగా ఓటర్లు మధ్యాహ్నం వరకు ఓటింగ్‌కు హాజరు కాలేదు. అనంతరం ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఓటర్లు కలిసి బతిమిలాడటంతో పోలింగ్ ప్రక్రియ యధావిధిగా ప్రారంభమైంది.
ఒంగోలు నియోజకవర్గం, కొత్తపట్నం -2 ఎంపీటీసీ పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేయగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒంగోలు రూరల్ మండలంలోని కరువదిలో ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న వైఎస్సార్‌సీపీ నేత వాకా బసివిరెడ్డి పట్ల స్థానిక పోలీసులు దురుసుగా ప్రవర్తించి.. తాలూకా పోలీసుస్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. పార్టీవర్గాల ఆందోళనతో పోలీసులు వెనక్కుతగ్గారు.
కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలంలోని శీలంవారిపల్లెలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించగా, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఎస్పీ పీ ప్రమోద్‌కుమార్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సకాలంలో పోలీసులొచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పామూరు మండలం, దాదిరెడ్డిపల్లెలో కూడా టీడీపీ దౌర్జన్యకారుల ఆగడాలపై వైఎస్సార్ సీపీ నేతలు స్థానిక ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ప్రశాంత నిర్వహణలో భాగంగా పోలీసులు అన్నిచోట్లా భారీ బందోబస్తు నిర్వహించారు. అన్నిచోట్లా కలెక్టర్ విజయ్‌కుమార్, ఎస్పీ పి. ప్రమోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ తదితర ఉన్నతాధికారులు పర్యటించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.
‘ పరిషత్’ పోరు
Published Sat, Apr 12 2014 3:00 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement