సాక్షి, ఒంగోలు: సార్వత్రిక సమరం మొదలైంది. లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులెవరనే చర్చ జరుగుతోంది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న క్రమంలో రాజకీయ పార్టీల తరఫున సీట్ల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. సెమీఫైనల్స్‌గా భావించిన మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలు ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకునేందుకు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఫలితాల వాయిదా వ్యవహారం పార్టీ నేతలకు కంటిమీద కునుకు పట్టనివ్వడం లేదు. మున్సిపల్, మండల స్థాయి నేతల జాతకాలు ఏవిధంగా ఉన్నాయి..? ఆ ఫలితాలు సాధారణ ఎన్నికలపై ఏమేరకు ప్రభావం చూపనున్నాయనేది పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే నియోజకవర్గాలు, మండలాల వారీగా ఫలితాల్ని విశ్లేషించుకున్న నేతల్లో కొంత స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆరుచోట్ల మున్సిపల్ ఎన్నికలు జరగ్గా.. అన్నిచోట్లా చైర్మన్ పదవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని అంచనాలు చెబుతున్నాయి.
జిల్లాలో 56 మండలాల్లో జరిగిన 56 జెడ్పీటీసీ, 790 ఎంపీటీసీ స్థానాల్లోనూ మెజార్టీ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కే నని, కచ్చితంగా జెడ్పీచైర్మన్ పదవి ఆపార్టీకి దక్కే అవకాశాలున్నట్లు పరిశీలకులు ఘంటాపథంగా విశ్లేషిస్తున్నారు.
ఎన్నికల బరిలో, అనుకూల ఫలితాల సాధనలో పూర్తిగా వెనుకబడిన కాంగ్రెస్ పార్టీని పక్కనబెడితే.. ఇవే అంశాలు టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు. అన్నిచోట్లా పార్టీ ఆస్థాన సామాజికవర్గ ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ..
తమకూ కొన్నిచోట్ల గెలుపు అనుకూల ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, సాధారణ ఫలితాలపై ప్రభావం చూపేంత స్థాయి లో తాము స్థానిక ఎన్నికల్లో పోరాడలేకపోయామని పార్టీ అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు.
టీడీపీ నేతల అంతర్మథనం..
స్థానిక ఎన్నికల ఫలితాల విశ్లేషణలో టీడీపీ నేతలకు కళ్లుతిరిగే వాస్తవాలు అవగతమయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు ఎటూ వైఎస్సార్ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్, టీడీపీలు తేల్చేసుకున్నాయి. నిన్నటిదాకా తమతోపాటు బీసీలు, కాపు సామాజికవర్గం అండగా ఉందని భ్రమించిన నేతలు ..తాజా ఫలితాల అంచనాలపై ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇన్నాళ్లూ పార్టీలో కష్టపడి పనిచేసిన బీసీ, కాపు నేతలను ఆదరించకుండా.. వారితో పెట్టుకున్న వివాదాలు గ్రామాల్లో తీవ్రప్రభావం చూపాయని కీలక నేతలకు తెలిసొచ్చింది. 12 నియోజకవర్గాల్లోని యాదవ సామాజికవర్గ ఓటుబ్యాంకు మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా సైలంట్ ఓటింగ్ చేసిందని గ్రహించారు. దీంతో, కొన్నిచోట్ల ఆవర్గ ముఖ్యులను కలిసి టీడీపీకి అనుకూలంగా ఎందుకు పనిచేయలేదంటూ.. ప్రశ్నించినట్లు సమాచారం.
అద్దంకి, మార్కాపురం, చీరాల, కనిగిరి మున్సిపాలిటీల్లో మైనార్టీలంతా టీడీపీకి గట్టి షాక్‌నివ్వనున్నట్లు ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా చర్చించుకుంటున్నాయి. గతంలో బీజేపీని వ్యతిరేకించిన చంద్రబాబు.. అధికారం కోసం అదే పార్టీతో చెలిమి చేయడం క్షేత్రస్థాయిలో మైనార్టీలను దూరం చేసిందని అంగీకరిస్తున్నారు.
కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయం నచ్చని ఓటర్లు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సరైన గుణపాఠం చెప్పారని గ్రామాల్లో ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ అనుభవం ఉన్న పెద్దలు చెబుతున్నారు.
ఇవే అంశాలు ఈనెలలో జరగనున్న సాధారణ ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపనున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
‘అమ్మఒడి.. డ్వాక్రా రుణాల రద్దు’పై మహిళల ఆసక్తి..
మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మహిళా ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. పోలింగ్ సరళి ప్రకారం.. మహిళా ఓటింగ్ పెరగడంలో పనిచేసిన ప్రాధాన్యాంశాలేమై ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల అజెండాలో పేర్కొన్న మహిళా సంక్షేమాభివృద్ధి పథకాలపై గ్రామాల్లో ఆదరణ లభిస్తోన్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల పునరుద్ధరణతో పాటు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ప్రకటించిన అమ్మఒడి పథకంపై మహిళలు ఆసక్తిచూపుతున్నారు. అదేవిధంగా ‘డ్వాక్రారుణాల రద్దు’ పై కూడా గ్రామాల్లో వేలాది మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ అంశాల్ని మదిలో ఉంచుకునే మహిళలు పోలింగ్ బూత్‌ల వద్ద పోటెత్తారని.. పెరిగిన మహిళా ఓటింగ్ వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండ నుందని, రైతులు, రైతు కూలీలు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులంతా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నారని రాజకీయవర్గాల విశ్లేషణ.
విజేతలెవరు..?
Published Mon, Apr 14 2014 2:33 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement