సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు | y.v subbareddy victory on magunta srinivasulu reddy | Sakshi
Sakshi News home page

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు

Published Sat, May 17 2014 2:48 AM | Last Updated on Mon, Oct 8 2018 5:23 PM

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు - Sakshi

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు

 సాక్షి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. ఆ పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన  వై.వి. సుబ్బారెడ్డి   తన సమీప  ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిపై 15,095 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా 12 నియోజకవర్గాల్లో ఆరుచోట్ల పార్టీజెండా రెపరెపలాడింది. బాపట్ల ఎంపీగా టీడీపీ అభ్యర్థి శ్రీరాం మాల్యాద్రి 32,301 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్‌రెడ్డి, యర్రగొండపాలెం నుంచి పాలపర్తి డేవిడ్‌రాజ్, మార్కాపురం నుంచి జంకె వెంకటరెడ్డి, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు నుంచి ఆదిమూలపు సురేష్, కందుకూరు నుంచి పోతుల రామారావు వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించారు. టీడీపీ ఐదు స్థానాల్లో మాత్రమే గెలుపొంది రెండో స్థానానికి చేరగా, చీరాలలో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ విజేతగా నిలిచారు.

మున్సిపల్, జిల్లాపరిషత్ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.

 పశ్చిమాన ప్రకాశించిన  వైఎస్సార్ సీపీ...
 ఒంగోలు సమీపంలో ఉన్న మూడు ఇంజినీరింగ్ కళాశాలల్లో 12 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ సరిగ్గా మధ్యాహ్నం 2.30 గంటలకల్లా ముగిసింది.

తొలుత పోస్టల్‌బ్యాలెట్ పత్రాలను లెక్కించారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్లు లెక్కించారు.  జిల్లాలో పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టంకట్టాయి.  యర్రగొండపాలెం, మార్కాపురం, కందుకూరు, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీ వచ్చింది.

యర్రగొండపాలెంలో మొత్తం 16 రౌండ్లు లెక్కింపు ముగిసే సమయానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్‌రాజు తన సమీప టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావుపై 19,150 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డికి సైతం భారీ ఓట్ల మెజార్టీ రావడం విశేషం.

గిద్దలూరులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి 18 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి 12,893 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఇక్కడ ఆయన తొలిరౌండ్ నుంచి సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అన్నా రాంబాబుపై ఆధిపత్యం కనబరిచారు.

మార్కాపురంలో జంకె వెంకటరెడ్డి ..టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై 9,802 మెజార్టీతో విజయం సాధించారు.

అద్దంకి నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్‌కు 4072 ఓట్ల ఆధిక్యతనిచ్చి.. అక్కడ టీడీపీ అభ్యర్థి కరణం వెంకటేష్, అతని తండ్రి బలరాంకృష్ణమూర్తి హవాకు ఓటర్లు చెక్‌పెట్టారు.

సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్...టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్‌పై 1,276 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

కందుకూరు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు 16 రౌండ్లలో కొనసాగగా.. టీడీపీ అభ్యర్థి దివి శివరాంపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల రామారావు 3,820 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కందుకూరు కౌంటింగ్ మొదటి 11 రౌండ్ల వరకు టీడీపీ ఆధిక్యతలో ఉన్నప్పటికీ.. 12వ రౌండ్ నుంచి ఓట్ల మెజార్టీ పోతుల రామారావు వైపు మొగ్గు చూపడం రసవత్తరమైన పోరుగా నిలిచింది.

 గెలిచి ఓడిన టీడీపీ..
 ఆది నుంచి జిల్లాలో 12 నియోజకవర్గాలకు 11కి మించకుండా తామే కైవసం చేసుకుంటున్నామని విపరీత ప్రచారం చేసుకున్న టీడీపీ నేతలకు.. కౌంటింగ్ ఫలితాల సరళితో గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది.  5 స్థానాల్లో మాత్రమే బలం చాటుకుని ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది.  ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు మెజార్టీ బొటాబొటీగానే దక్కడం గమనార్హం.

దర్శి నియోజకవర్గం కౌంటింగ్ ప్రారంభం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డికి ఓట్ల వెల్లువ సాగగా ఏడో రౌండ్ నుంచి టీడీపీ ఆధిక్యతలోకొచ్చింది. 18 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 1,374 మెజార్టీని తెచ్చుకుని ఆ పార్టీ అభ్యర్థి శిద్దా రాఘవరావు విజయం సాధించారు.

కొండపిలో టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయస్వామి ఐదు వేల మెజార్టీతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకరరావుపై గెలుపొందారు.

పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు 19 రౌండ్‌లు ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్‌పై 10,335 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌కు మాత్రం 14,580 ఓట్ల ఆధిక్యత రావడం.. వరుసగా నాలుగుసార్లు గెలుపొందుతూ వ చ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటమిని చవిచూపింది.

చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగానే ‘ఆటో’ గుర్తుపై 10,335 ఓట్ల మెజార్టీతో మరోమారు గెలుపొందారు.

జిల్లా ప్రధాన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ విజయ్‌కుమార్, జేసీ యాకూబ్‌నాయక్, ఎస్పీ పి. ప్రమోద్‌కుమార్ ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం ఓట్ల లెక్కింపు ప్రశాంతంగానూ, వేగవంతంగానూ ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement