కారుకు కే‘డర్’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ తెచ్చిన ఘనత తమదేనంటున్న టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో కేడర్ కష్టాలు తప్పడం లేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఆ పార్టీకి తెలంగాణవాదుల్లో ఆదరణ ఉన్నప్పటికీ, అనుచరగణం అంతగా లేకపోవడంతో పల్లెపల్లెకు కారును తీసుకువెళ్లడం క్లిష్టతరంగా మా రింది. రెండు, మూడు నియోజకవర్గాలు మినహా జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా వ్యవహరించిన నాయకులు ఇన్నాళ్లు కేడర్‌ను పెంచుకునే ప్రయత్నాలపై దృష్టి సారించలేదు. పైగా కొన్ని స్థానాల్లో ఇన్‌చార్జీలకు కాకుండా, కొత్త వారికి టిక్కెట్లు దక్కడంతో ఆయా చోట్ల ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా తయారైంది. ముఖ్యనాయకులు కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో వారి అనుచరులు కొందరు పార్టీని వీడారు. ఇన్నాళ్లు ఉద్యమంపైనే దృష్టి పెట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
పలు నియోజకవర్గాల్లో..
ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న కోవ లక్ష్మి కేడర్ నిర్మాణం కోసం పెద్దగా దృష్టి సారించలేదు. పైగా ఉన్న నాయకులను ఇప్పు డు కలుపుకుని పోవడంలో కొంత వైఫల్యం కనిపిస్తోంది. దీంతో ఆమెతో కలిసి పనిచేయలేమని స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఇటీవల అక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా రాములునాయక్ వ్యవహరించారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆయన బోథ్‌కు వచ్చి వెళుతూ ఉండేవారు. ఇప్పడు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా రాథోడ్ బాపురావు బరిలో ఉన్నారు. రాములు నాయక్‌కు టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు కొంత మంది కాంగ్రెస్ వైపు వెళ్లారు. ముథోల్‌లో టీడీపీ నుంచి వచ్చిన వేణుగోపాలాచారి కూడా ఆశించిన మేరకు కేడర్‌ను పెంచుకోలేక పోయారు.
చాలా ఏళ్లుగా నిర్మల్ నుంచి ప్రాతినిథ్యం వహించిన వేణుగోపాలాచారి, కొంత కాలంగా ముథోల్‌కు వచ్చారు. బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీగా వినోద్ వ్యవహరించే వారు. వినోద్ రాకతో పలు మండలాల్లో నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ, తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవడంతో ఆయన అనుచరులు చాలావరకు కాంగ్రెస్‌ను వీడారు. మంచిర్యాలలో నివాసముండే దుర్గం చిన్నయ్య కూడా బెల్లంపల్లిలో పార్టీ కేడర్‌ను పెంచుకునే దిశగా పెద్దగా దృష్టి సారించలేదు. రేఖాశ్యాంనాయక్ ముందుగా ఆసిఫాబాద్ నియోజకవర్గ బాధ్యతల్లో ఉండేవారు.
కొంత కాలంగా ఖానాపూర్‌లో కేడర్ నిర్మాణం కోసం దృష్టి సారించినప్పటికీ, తీరా ఎన్నికల సమయానికి మండల నాయకులతో విభేదాలు ఆమెకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇటీవల కడెం మండల పార్టీ నాయకులతో విభేదాలు నెలకొనడంతో ఆ మండలంలోకి కొంత మంది కార్యకర్తలు రేఖ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఖానాపూర్‌లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొనడంతోపాటు, పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.
మంచిర్యాలలో అరవిందరెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్ కేడర్ కొంత అరవిందరెడ్డితో కాంగ్రెస్‌లోకి వచ్చింది. కాంగ్రెస్‌లో ఉన్న దివాకర్‌రావు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో ఆయన వెంట కొంత కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ సాధించిన ఘనత ముందు కేడర్ లేమి పెద్ద విషయమేమీ కాదని, ప్రజలు తమనే ఆదరిస్తారని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధినేత కేసీఆర్ పర్యటనతో తమ పార్టీ శ్రేణుల్లో ఊపు వస్తుందని భరోసాలో అభ్యర్థులున్నారు.
నేడు కేసీఆర్ సుడిగాలి పర్యటన
టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు తొమ్మిది నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ మేరకు సుడిగాలి పర్యటన షెడ్యుల్ ఇటీవలే ఖరారైన సంగతి విధితమే.
హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకుని చెన్నూర్ మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు. మొదటి సభ మధ్యాహ్నం భైంసాలో మొదలై చివరి సభ సాయంత్రం మంచిర్యాలలో ముగుస్తుంది. కేసీఆర్ సభ కోసం టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ జన సమీకరణ చేస్తున్నారు. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.