
మన తలరాత మారాలంటే అధికారంలోకి రావాలి
టీఆర్‌ఎస్ నేత కేసీఆర్ పిలుపు
పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, బాబూమోహన్, రాజేశ్వరరెడ్డి
సాక్షీ, హైదరాబాద్: తెలంగాణ ప్రజల త ల రాత మారాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రజలకు మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం రావాలని చెప్పారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ మంత్రి బాబూమోహన్, నల్లగొండకు చెందిన విద్యాసంస్థల అధినేత రాజేశ్వరరెడ్డి, వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ తదితరులు కేసీఆర్ సమక్షంలో బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గతంలో అనేక మార్లు కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లు వేశారు. మన బతుకులు మారలేదు. ఇప్పుడు కూడా వారికి ఓట్లు వేస్తే జరిగేది అంతే. అందుకే కొత్త రాష్ట్రానికి కొత్త నాయకత్వం కావాలి. అప్పుడే అభివృద్ది సాధ్యం’ అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో పేదలకు ఇళ్లను నిర్మిస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. కనురెప్ప మూసినట్టుగా కూడా కరెంట్ కట్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ‘ నా గుండె నిండా తెలంగాణ నిండి ఉంది.. ఉద్యమంలో చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చాం.. తెలంగాణ రాష్ర్టం సార్థకత కావాలంటే వంద శాతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందే’ అని చెప్పారు. అలాగే రాజకీయ అవినీతిని రూపుమాపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా సమావేశంలో జమ్మి మాసపత్రికను కేసీఆర్ ఆవిష్కరించారు. అలాగే నరేందర్‌కు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వన్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు.