
ఉరవకొండలో విశ్వకు నీరా‘జనం’
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే హోదాలో తొలిసారి పట్టణానికి విచ్చేసిన వై.విశ్వేశ్వరరెడ్డికి శనివారం స్థానిక ప్రజలు నీరాజనం పలికారు. ఆయన రాక కోసం పార్టీ కార్యాలయం వద్ద మధ్యాహ్నం నుంచే భారీ సంఖ్యలో జనం వేచివున్నారు. బైపాస్ రోడ్డు వద్దకు రాగానే ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు సోదరుడు, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు మధుసూదన్‌రెడ్డిలను భుజాలపెకైత్తుకుని ఊరేగించారు.
అనంతరం విశ్వేశ్వరరెడ్డి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, మండల, పట్టణ కన్వీనర్లు సుంకన్న, బసవరాజు, జెడ్పీటీసీ సభ్యులు మీనుగ లలిత, సింగాడి తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు.