
పద్మావతిపై ప్రత్యేక ప్రేమ
ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే. కొంతమంది మాత్రం కొంచెం ఎక్కువ సమానం. ఈ మాట కాంగ్రెస్ పార్టీకి అక్షరాలా వర్తిస్తుంది. 'సింగిల్ టికెట్' నిబంధనను హస్తం పార్టీ కొందరి విషయంలో పక్కన పెట్టింది. ఒక కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నా ఒక్కరికి మాత్రమే సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ బజాయించింది. దీన్ని నూరు శాతం అమలు చేయడంలో మాత్రం విఫలమైంది.
తెలంగాణలో ప్రకటించిన జాబితాలో ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విషయంలో మాత్రం మాట నిలబెట్టుకోలేకపోయింది. 'ఏక స్థానం' విధానంలో భాగంగా సబితా ఇంద్రారెడ్డి లాంటి సీనియర్ నేతలను కూడా హైకమాండ్ పక్కన పెట్టింది. ఆశ్చర్యకరంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతికి కేటాయించి కాంగ్రెస్ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించింది.
జానారెడ్డి, షబ్బీర్ అలీ, డి శ్రీనివాస్ లాంటి ఉద్దండులు తమ వారసుల కోసం పైరవీలు చేసినా పట్టించుకోని అధిష్టానమ్మ పద్మావతిని మాత్రం అనూహ్యంగా కటాక్షించింది. సీపీఐ ఇచ్చిన కోదాడ సీటుకు వెనక్కి లాగేసుకుని పద్మావతి చేతుల్లో పెట్టారు. హైకమాండ్ చూపించిన ప్రేమతో చివరి నిమిషంలో నామినేషన్ వేసి కోదాడ అసెంబ్లీ బరిలో నిలిచారు పద్మావతి.
దీంతో తమ వారి కోసం టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చూసి బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఉత్తమ్ ఏ మంత్రం వేసి అధిష్టానాన్ని బుట్టలో పడేశాడని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి తెలిసిన వాళ్లను ఈ పరిణామంతో పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. హస్తం పార్టీలో ఎవరెప్పుడు ఎందుకు అందలం ఎక్కుతారో చెప్పడం కష్టమని నిట్టూరుస్తున్నారు.