కారులో కాలిన క్యాష్ - ఉత్తమ్ కి నోటీసు
కాలిన కారులో బూడిద క్యాష్ రాష్ట్రమంతా సంచలనం సృష్టించి 24 గంటలైన తరువాత పోలీసులు కాంగ్రెస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆయనకు చెందిన ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్స్ కి నోటీసులు జారీ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా.
బుధవారం పోలింగ్ జరుగుతూండగా నల్గొండ జిల్లా సూర్యాపేట వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టికర్ ఉన్న కారు తనంతట తానుగా తగలబడింది.కారు బోనెట్ లో అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు తగలబడిపోతూ కనిపించాయి. కాస్త బాగున్న నోట్లను తీసుకుని కారు లో ఉన్న వ్యక్తులు పరారీ అయ్యారు.
నోటీసులు పంపించిన విషయాన్ని నల్గొండ ఎస్ పి టీ ప్రభాకర రావు ధ్రువీకరించారు. డ్రైవర్ ను పట్టుకునేందకు ప్రయత్నిస్తున్నామని, డ్రైవర్ దొరికితే ఇంకా సమాచారం దొరుకుతుందని ఆయన అన్నారు.