టీచర్ టు ఎమ్మెల్యే!
సాక్షి, విశాఖపట్నం : బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తి వారిది. తమ పరిధిలో రేపటి పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఇతోదికంగా కృషి చేశారు. తమ సేవా పరిధిని మరింత పెంచుకోవాలనుకున్నారు. జీతంపై భరోసా ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కాదనుకున్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయాల్లో రాటుదేలిన ఉద్దండ నాయకులకు ఎదురొడ్డారు. విజయంతో రాజకీయ యవనికపై తమదైన ముద్రవేశారు. వారే పాడేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి, పాయకరావుపేటలో విజయం సాధించిన వంగలపూడి అనిత.
మాజీ మంత్రిని మట్టి కరిపించారు
గిడ్డి ఈశ్వరి ఏజెన్సీలోని పాడేరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఏజెన్సీలో కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావంతో జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, టీడీపీ/బీజేపీ ఉమ్మడి అభ్యర్థి లోకుల గాంధీతో గిడ్డి ఈశ్వరి ఢీకొట్టారు. ఇక్కడ వామపక్ష పార్టీ సీపీఐ అభ్యర్థి దేముడుబలమైన వ్యక్తే. వీరందరి మధ్య ఆడ సింహంలా ఓట్లు కోసం వేటాడారు. సీపీఐ మినహా, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల అభ్యర్థులెవరికీ డిపాజిట్లు కూడా దక్కనీయలేదు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి గొడ్డేటి దేముడుపై ఏకంగా 25,948 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈశ్వరికి దక్కిన మెజార్టీ ఓట్లు కూడా మాజీ మంత్రి బాలరాజుకు రాని పరిస్థితి.
అసాధ్యురాలు అనిత
వంగలపూడి అనిత.. నర్సీపట్నం జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా కంటే.. జిల్లా విద్యాశాఖలో ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్‌గా సుపరిచితురాలు. ఆమె బాధ్యతలు చేపట్టిన ఏడాదే.. ఓపెన్ స్కూల్లో అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. పట్టువీడకుండా.. టీడీపీ తరఫున పాయకరావుపేట నుంచి బరిలో నిలిచేందుకు ప్రయత్నించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థి, వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావు టీడీపీలో ఉన్నంత వరకు ఆమెకు ఆశల్లేకపోయినా.. ఆయన పార్టీ మారాక తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చివరికి రాజకీయ భవిష్యత్ కోసం తన ప్రభుత్వ ఉద్యోగాన్నీ వదులుకున్నారు. తుదిపోరులో ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థి చెంగలపై 2,819 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.