సాక్షి, హైదరాబాద్: 1969లో తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) తరఫున ఎంపీలుగా గెలిచిన వారంతా ఆ తరువాత కాంగ్రెస్‌లో ఎందుకు చేరారనే దానిపై కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి సోమవారం ఇక్కడ గుట్టువిప్పారు. నాటి ఎన్నికల్లో పోటీచేసి గెలిచేందుకు ఇందిరాగాంధే తమకు ఆర్థిక సాయం చేశారని చెప్పారు. ‘‘తెలంగాణ కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేదని చాలా మంది అంటున్నా రు. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నా. 1969లో తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా ఉంది. నేను, చెన్నారెడ్డిసహా 25 మందిమి బయటకొచ్చి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) పార్టీ పెట్టినం. ఎన్నికల్లో ఆ పార్టీ తరఫునే పోటీ చేసినం. కానీ మా దగ్గర డబ్బుల్లేవు.
అప్పుడు నేను ఇందిరాగాంధీ వద్దకు పోయిన. ‘పోటీ చేస్తున్న వాళ్లమంతా కాంగ్రెస్ వాళ్లమేనమ్మా.. ఎన్నికలయ్యాక వాళ్లందరినీ మీ దగ్గరకు తీసుకొస్తా. తెలంగాణలో విప్లవాన్ని ఆపాలంటే మాకు డబ్బులు కావాలి. ఎన్నికల్లో గెలిచినంక మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తం’అని చెప్పిన. వెంటనే ఇందిరమ్మ ‘నిజంగా తెస్తావా’అని అడిగి నిర్ధారించుకుని నన్ను ఉమాశంకర్ దీక్షిత్ (గవర్నర్ షిలాదీక్షిత్ మామ) వద్దకు పంపింది. చెన్నారెడ్డి డబ్బుల విషయంలో నన్ను నమ్మలేదు. నాతోపాటు మెల్కొటేను కూడా పంపిండు. మేమిద్దం వెళ్లగా అక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ఉన్నడు. అప్పుడే ఆయనకు దీక్షిత్ డబ్బుల సూట్‌కేసు ఇచ్చి పంపిండు. ఆ తరువాత మాకు సూట్‌కేసు ఇచ్చిండు. ఆ డబ్బును చెన్నారెడ్డికి ఇచ్చినం. ఆ డబ్బుతోనే ఎన్నికల్లో కొట్లాడి గెలిచినం’’ అని నాడు జరిగిన విషయాలన్నీ వెల్లడించారు. ఆనాడు తాము తెలంగాణకు ద్రోహం చేశామని చెబుతూ ప్రజలను క్షమాపణ కోరారు.
ఇందిరమ్మ మూటలిచ్చింది: కాకా
Published Tue, Apr 1 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM
Advertisement