ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేయండి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందనరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపుపై అధికారులతో చర్చించారు. జిల్లాలోని రెండు పార్లమెంటు, 16 అసెంబ్లీ (ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం లోని కైకలూరు, నూజివీడు) నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు.
ఈ నెల 16వ తేదీన కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్నాయి. శుక్రవారం రాత్రి వర్షం కురిసిన నేపథ్యంలో శనివారం ఉదయం స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పరి శీలించారు. అవసరమైన చోట్ల స్ట్రాంగ్ రూమ్‌లకు వెలుపలి భాగంలో టార్పాలిన్ పట్టాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కాలేజీ లోపలకు ప్రవేశించడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి, ఏబ్లాక్ నుంచి ఏ బ్లాక్‌కు చేరుకోవచ్చు, భోజన ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు.
పరిశీలకులకు కేటాయించిన రూమ్‌లు, మీడియా సెంటర్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. కళాశాల ఆవరణలో వాహనాల కదలికలను నియంత్రించటానికి కొత్తగా వేస్తున్న రోడ్డు మార్గాన్ని కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ జె.మురళి తదితర అధికారులు కలెక్టర్‌తో పాటు ఏర్పాట్లను పరిశీలించారు.