సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల వార్ వన్‌సైడ్‌గా సాగింది. బుధవారం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన పోలింగ్ సరళి చూసి తెలుగుదేశం పార్టీ ఆశలు వదులుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు భారీ క్యూలైన్లలో కనిపించడం, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడలు, మధ్య తరగతి జనం నివసించే ప్రాంతాల్లో అంచనాలకు అందని విధంగా జనం పోలింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ సరళిని లోతుగా అంచనా వేస్తే జిల్లా అంతటా ఫ్యాన్ గాలి వీచి టీడీపీతో పాటు మరే ఇతర పార్టీలు జిల్లాలో బోణీ కొట్టే పరిస్థితే కనిపించడం లేదు. చెదురు ముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగి 75 శాతం వరకు పోలింగ్ నమోదైంది.
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందనే పరిస్థితి ఎప్పటి నుంచో కనిపించింది. ఇందుకు దీటుగా ఆర్థికంగా బలమైన అభ్యర్థులను పోటీకి దించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చాలా ప్రయాస పడ్డారు. ఆయన చేసిన ఈ ప్రయోగం పార్టీలో తీవ్ర అసంతృప్తులకు దారి తీసి ఒకరి నొకరు వెన్నుపోటు పొడుచుకునే విధంగా మారింది. ఎన్నికల్లో రూ 500, రూ 1000 నోట్లు, మద్యం భారీ ఎత్తున పారించి వైఎస్సార్‌సీపీ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో టీడీపీ నేతలకు కంటికి కనిపించింది.
ఆ పార్టీ చేయించిన సొంత సర్వేలో సైతం ఒకటి, లేదా రెండు స్థానాలు గెలిస్తే గొప్ప అనే నివేదికలు అందడం పార్టీ అభ్యర్థులు, నేతలను హతాశులను చేసింది. దీంతో దింపుడు కళ్లం ఆశతో ఆ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి వైఎస్సార్‌సీపీ ఓట్లను కొంత మేరకైనా చీల్చుకునే వ్యూహం అమలు చేశారు. ఎంపీ అభ్యర్థులు తమకు మాత్రమే ఓటు వేయాలనీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తమకు ఒక్క ఓటు వేసి ఎంపీకి మీ ఇష్టం అనే సూత్రంతో జనాన్ని బతిమలాడే ప్రచారం చేశారు. ఈ ప్రచారం కొంత మేరకు ప్రభావం చూపిందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇది నామమాత్రమేననే విషయం పోలింగ్ సరళిని పరిశీలిస్తే అర్థమవుతుంది. ధన బలంతో కావలి, కోవూరు, గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు సిటీ స్థానాల్లో గెలుపు సాధించాలనుకున్న టీడీపీ ఆశలను ఓటర్లు నీర్చు గార్చే తీర్పు ఇచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. టీడీపీ ఆశ పడిన ఈ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరడం ఖాయమైంది. దీంతో జిల్లాలో టీడీపీ బోణీ కొట్టే పరిస్థితే కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలే ఆఫ్‌ది రికార్డ్‌లో అంగీకరిస్తున్నాయి. నెల్లూరు ఎంపీ ఓట్లను క్రాస్ చేయించడానికి టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి చివరి దాకా తీవ్రంగానే ప్రయత్నించినా, ఆశించిన స్థాయిలో ఫలితం మాత్రం కనిపించలేదు.
ఈ సీటు కూడా భారీ మెజారిటీతో వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడం ఖాయమని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా ఏకపక్ష పోలింగ్ జరుగుతుందని తాము అసలు ఊహించలేక పోయామని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మహిళలు, ముస్లింలు, క్రిస్టియన్లు తమ పార్టీకి పూర్తిగా దూరమయ్యారని పోలింగ్ అనంతరం జరిగిన పోస్టుమార్టంలో టీడీపీ నాయకులు మధనపడుతున్నారని సమాచారం. టీడీపీకి సంప్రదాయంగా ఓటుపడే సామాజిక వర్గాల్లో సైతం ఈ సారి భారీ మార్పు కనిపించిందని, దీని వల్ల తాము ఓటమిని అంగీకరించక తప్పదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈవీఎంలో ఓటరు తీర్పు
గత రెండు నెలలుగా రాజకీయ పార్టీలు అనేక రూపాల్లో ఓటు కోసం చేసిన అభ్యర్థనలకు ఓటరు బుధవారం తీర్పు చెప్పారు. జిల్లాలోని 10 శాసనసభ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఓటరు నిర్ణయం ఈవీఎంల్లో భద్రమైంది. ఓట్ల జాతర ముగియడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో పాటు, జిల్లాలో వరుస ఎన్నికల నిర్వహణలో క్షణం తీరిక లేకుండా గడిపిన జిల్లా అధికార యంత్రాంగం కూడా బుధవారం సాయంత్రానికి ఊపిరితీసుకుంది.
వార్ వన్‌సైడ్
Published Thu, May 8 2014 3:09 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement