కబ్జాలకు మారు పేరు | Government land occupying | Sakshi
Sakshi News home page

కబ్జాలకు మారు పేరు

Published Sun, May 4 2014 2:01 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

Government land occupying

తెలుగుదేశం పార్టీ కదిరి అసెంబ్లీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ క్రైస్తవుల కోసం కమ్యూనిటీ హాల్ కట్టించారని ఆయన అనుచరులు కొందరు పదే పదే చెప్పి క్రైస్తవుల ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో కందికుంట డబ్బు ఒక్క రూపాయి కూడా లేదని తెలిసింది. క్రైస్తవుల విరాళాలతోనే నిర్మించి అక్కడ కందికుంట అనుచరులు ఎమ్మెల్యే కందికుంట నిధులు రూ 2 లక్షలు, ఎంపీ నిమ్మల నిధులు రూ 3 లక్షలు దీనికి తోడు కందికుంట సొంత నిధులు మరో రూ.10 లక్షలు అని శిలాఫలకం చెక్కించారు. కానీ అక్కడ కనీసం సీఅండ్‌ఐజీ చర్చి బోర్డు కూడా పెట్టలేదు. కందికుంట చర్చి ఆస్తులు మింగేసిన విషయం వెలుగులోకి రాకూడదన్న ఉద్దేశ్యంతోనే కమ్యూనిటీ హాల్ నిర్మించినట్లు తెలుస్తోంది.
 
 కదిరి పట్టణంలోని ఆర్‌టీసీ బస్టాండ్ సమీపంలో సీఅండ్‌ఐజీ మిషన్ చర్చికి సంబంధించిన సర్వే నెం.660-3లోని రూ. కోట్ల విలువ చేసే క్రైస్తవ విద్యార్థుల ఆశ్రమ పాఠశాల ఉన్న 15 సెంట్ల స్థలాన్ని కందికుంట తన బినామీల పేరు మీద రాయించుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుత ం దీనిపై కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తన మెడపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించి తన చేత రాయించుకున్నారని సీఅండ్‌ఐసీ మిషన్ చర్చి ఫాదర్‌గా ఉన్న ఎం.జేమ్స్ జిల్లా కోర్టులో కూడా చెప్పినట్లు తెలిసింది. వాస్తవంగా ప్రభువు ఆస్తులు అమ్మడానికి తనకు ఏ మాత్రం అధికారాలు లేవని, వారి బలవంతం.. బెదిరింపులకు భయపడే రాయించానని కూడ కోర్టు ఎదుట చెప్పినట్లు సమాచారం. తర్వాత కొద్ది రోజులకే ఆయన ఈ మనోవేదనతోనే చనిపోయాడని కొందరు క్రైస్తవ పెద్దలు చెప్పుకుంటున్నారు.  
 
 అప్పులోళ్ల గోడు వినేదెవరు?
 కందికుంట తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇంకా పలుచోట్ల రూ కోట్ల అప్పులు తీసుకున్నారు. ఈ మధ్యే ఒకరు తన అప్పు ఇస్తావా? లేదా అంటూ ఆయన ఇంటి పైకి రాళ్లు కూడా రువ్వి నానా హంగామా చేసిన విషయం చర్చనీయాంశమైంది. నల్లచెరువు, గాండ్లపెంట మండలానికి చెందిన ఆ పార్టీకే చెందిన మండల నాయకులు ఇద్దరు కందికుంటతో వారికున్న డబ్బు లేవాదేవీల కారణంగానే ఆ పార్టీని వీడలేకున్నారని, లేదంటే వారు ఎప్పుడో వైఎస్సార్‌సీపీలో చేరిపోయే వారని టీడీపీ నాయకులే చెబుతున్నారు. కందికుంట అప్పుల బాధితులకు చివరికి ఆత్యహత్యే శరణ్యమని వారంటున్నారు.    
 
 మైనార్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తులు హాంఫట్!
 కదిరి-అనంతపురం జాతీయ రహదారి పక్కనే రూ కోట్ల రూపాయలు విలువ చేసే ముస్లిం మైనార్టీల వక్ఫ్ బోర్డు స్థలం ఉంది. ఆ స్థలాన్ని కూడా కందికుంటతో పాటు ఆయన అనుచరులు కబ్జా చేశారన్న విమర్శలు పట్టణంలో వినబడుతున్నాయి. దీనిపై గతంలోఎంఐఎం నాయకులు, కొందరు మైనార్టీ సోదరులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు కూడా చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్థులను రక్షించి కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు అప్పట్లో డిమాండ్ చేశారు.  
 
 డీడీల స్కాం
 కందికుంటపై నకిలీ డీడీల స్కాం కేసు ఇప్పటికీ నాంపల్లి సీబీఐ కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ విషయం ఆయనే స్వయంగా తన అఫిడవిట్‌లో కూడా పేర్కొన్నారు. తనపై 9 కేసులున్నాయని అందులో ఇది కూడా ఒక్కటని ఆయనే ఒప్పుకున్నారు. ఇంకా ఇతనిపై ఐపీసీ సెక్షన్ 420, 302, 307, 324, 375, 471, 147, 148, 149 ఇలా పలు సెక్షన్ల కింద కేసులున్నట్లు ఆయన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ బట్టబయలు చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement