ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేతలకు నీటి గండం పొంచి ఉంది. పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ప్రస్తుతం అవకాశం రావడంతో నేతలను నిలదీసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న నీటి సమస్య మున్సిపల్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలను నేతలు చవిచూస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత జఠిలం కానుంది.
పేరుకే స్పెషల్ గ్రేడ్...
పేరుకు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయినా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో 1,62,719 మంది ప్రజలు నివశిస్తున్నారు. 1,23,487 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఇంత వరకు తాగునీటి కోసం శాశ్వత పరిష్కారం చేయలేదు.
ట మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పాతికేళ్లు, ఎమ్మెల్యే లింగారెడ్డి ఐదేళ్లు పరిపాలన చేశారు. కాగా ముందుచూపుతో నీటి సమస్యను పరిష్కరించలేదు. ఈ కారణంగా ప్రస్తుతం ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. పక్కనే పెన్నానది ఉన్నా అందులో భూగర్భ జలమట్టం పడిపోవడంతో నీటి సమస్య తీవ్రత పెరిగింది.
ట ప్రతి ఏడాది వేసవిలో ఒకటో, రెండు టీఎంసీల నీటిని మైలవరం జలాశయం నుంచి విడుదల చేయించుకోవడం, ఎలాగోలా గండం గట్టెక్కించడం జరుగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న హయాంలో నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం కుందూ -పెన్నా వరద కాలువ నిర్మాణాన్ని రూ.70 కోట్లతో 2007లోనే మంజూరు చేశారు. అయితే అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఈ పథకం నలిగిపోయింది. తద్వారా మధ్యలోనే నిర్మాణం ఆగడంతో నీటి సమస్య జఠిలమైంది.
గత ఏడాది మరింత జఠిలం..
ఎన్నడూ లేని రీతిలో గత ఏడాది నుంచి నీటి సమస్య మరింత తీవ్రమైంది. పెన్నానదిలో అక్రమ ఇసుక తవ్వకాల ప్రభావం కారణంగా భూగర్భ జల మట్టం పడిపోవడమే ఇందుకు ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో మైలవరం జలాశయం నుంచి నీరు విడుదల చేసినా ఆశించిన ఫలితం కనిపించలేదు. మున్సిపాలిటీ లక్షల రూపాయలు డబ్బు వెచ్చించినా ప్రజలకు మాత్రం నీటి సమస్య తప్పడం లేదు. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీరు సరిపోకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి రెండు నెలలకుపైగా 6 ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజలకు నీటిని అందించారు. ఇందు కోసం రూ.25లక్షలకుపైగా వ్యయం చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాలకు నాలుగు ట్యాంకర్ల ద్వారా మున్సిపల్ అధికారులు నీరు సరఫరా చేస్తుండటం గమనార్హం.
ట గోకుల్ నగర్, స్వరాజ్య నగర్, సంజీవనగర్, వాజ్‌పేయ్‌నగర్, ఎర్రన్న కొట్టాల, హనుమాన్‌నగర్, బుర్రసాధుమఠం, దొరసానిపల్లె రోడ్డు, సూపర్‌బజార్, శ్రీనివాసనగర్, శ్రీరామ్‌నగర్, బాక్రాపేట తదితర ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు మున్సిపల్ అధికారులు టెండర్లు పిలిచారు. ఎన్ని ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసినా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు రావడంతో ప్రజలు నేతలను ప్రశ్నించే పరిస్థితి ఎదురవుతోంది.
గోకుల్ నగర్‌లో ఇంటింటా డ్రమ్‌ల ఏర్పాటు..
నీటి సమస్య తీవ్రత కారణంగా గోకుల్ నగర్‌లో ఇంటింటా డ్రమ్‌లను ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజులకోమారు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా వీరికి నీరు సరఫరా చేస్తున్నారు. ఏడాదికిపై నుంచి గోకుల్ నగర్‌కు పైపులైన్ ద్వారా నీరు అందకపోవడంతో ఈ నీటిపైనే ఆధారపడుతున్నారు. ఈ సమస్య కారణంగా ప్రజలు ఇతర అన్ని పనులను వదిలిపెట్టుకోవాల్సి వస్తోంది.
నేతలను నిలదీస్తాం...
ప్రచారానికి వచ్చే నేతలను నీటి సమస్యపై నిలదీస్తాం. నెలలు తరబడి మాకు నీరు అందడం లేదు. ట్యాంకర్ల ద్వారా తీసుకోవాల్సి వస్తోంది. ఇంత దయనీయ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు.
- జొల్లు పెద్ద ఓబయ్య, గోకుల్ నగర్
నానా అవస్థలు పడుతున్నా ..
నీటి సమస్య కారణంగా మేము నానా అవస్థలు పడుతున్నాం. ఉపాధి కూడా ఈ సమస్యతో లభించడం లేదు. ఇంటి వద్ద కాపలా ఉండి నీరు పట్టుకోవాల్సి వస్తోంది. మిట్ట మధ్యాహ్నం ఎండలో నిల్చొని నీరు తెచ్చుకుంటున్నాం.
- లక్ష్మిదేవి, గోకుల్ నగర్
నిత్యం.. నీటి కష్టం
Published Wed, Mar 19 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
Advertisement
Advertisement