టిక్కెట్లు.. ఇక్కట్లు
స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకునే కొద్దీ గ్రామాల్లో నాయకులకు టెన్షన్ తప్పడం లేదు. ఆశావహులందరినీ సంతృప్తి పరచడం అసాధ్యం కావడంతో బుజ్జగింపుల పర్వం ప్రారంభించారు. బెట్టు చేసేవారికి రాజకీయ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ శాంతింపజేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ఆ పార్టీ నేతలంతా పక్కపార్టీల వైపు చూస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ ఉంది.
సాక్షి,కడప: స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో మండల, గ్రామ స్థాయి నాయకుల పోటీ విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకు నాయకులు జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఓటమి పాలైతే ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా వెళ్లాలనే భావనతో నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ముఖ్యనేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రతి మండలంలో నలుగురైదుగురు ముఖ్య నాయకులంతా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులపై కన్నేయడంతో ఎలా సర్దుబాటు చేయాలి? ఎవరిని ఎలా సంతృప్తి పరచాలి? అనే దానిపై నేతలు కసరత్తు చేస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికలు తలకు మించిన భారంగా మారాయి.
నామినేషన్లు వేసేందుకు గడువు రెండు రోజులు మాత్రమే ఉండటంతో అభ్యర్థుల ఎంపికలపైనే నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తున్న తరుణంలో గెలుపు గుర్రాలకోసం వడపోత ప్రారంభించారు. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆశావహులు మొగ్గు చూపుతుండటంతో టిక్కెట్లకు పోటీ నెలకొంది. వైఎస్సార్‌సీపీలో అవకాశం లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడంతో విధిలేక ప్రత్యామ్నాయంగా కొంత మంది టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీల్లో ప్రధానంగా అసంతృప్తులు తలెత్తకుండా బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నియోజక వర్గ బాధ్యులు పూర్తి స్థాయిలో నియోజక వర్గ కేంద్రాల్లో ఉంటూ స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకొని ఎంపికలు చేస్తున్నారు.
వేగంగా మారుతున్న సమీకరణలు
నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఈ రెండు రోజుల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గ్రామాల్లో రాత్రి వేళల్లో నేతలు సమావేశమై రాయబారాలు చేస్తున్నారు. పదవుల పంపకాలతో పాటు ఆర్థిక అంశాలపైనా చర్చలు మొదలయ్యాయి. మొత్తం మీద పోటీ తీవ్రంగా ఉండటంతో రాజకీయలు ఆసక్తిగా మారాయి.
రగులుకున్న రాజకీయ వేడి
జిల్లాలో ఎండలు మండుతున్నాయి. అలానే స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. గ్రామాల్లో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా భవిష్యత్తున్నపార్టీలోకి వెళ్లడానికి నేతలు వెదుకులాట ప్రారంభించారు. నిన్న, మొన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న చోటామోటా నాయకులు ప్రత్యర్ది పార్టీ తరపున అవకాశం వస్తే కండువాలు మార్చుతున్నారు. ఎనిమిదేళ్ల తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో గ్రామ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నియోజకవర్గ నేతలు సైతం ఇప్పుడు పట్టు సడలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో డీలా పడతామనే ఉద్దేశంతో గెలుపు మార్గాలను అన్వేషిస్తున్నారు. గ్రామ స్థాయి నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఉనికి కాపాడుకొనేందుకు
పార్టీ టిక్కెట్లు ఎవరికి వస్తాయో రావో తెలీదు. ఇంకా పూర్తి స్థాయిలో పార్టీల తరపున అభ్యర్థుల ఖరారు పూర్తి కాలేదు. అయితే నియోజకవర్గంలో స్థానిక నేతల కప్పదాట్లు ప్రారంభ మయ్యాయి. ఉనికి కాపాడుకునేందుకు కొందరైతే, పబ్బం గడుపుకునేందుకు మరి కొందరు పార్టీ మార్చే పనిలో పడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులకు తమ పార్టీ టిక్కెట్ దక్కకుంటే మరో పార్టీలోకి మారేందుకు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో స్థానిక రాజకీయాలు మరింత వేడెక్కాయి.