సాక్షి, కడప: పురపోరు బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. జిల్లా వ్యాప్తంగా కడప కార్పొరేషన్‌తో పాటు ఎన్నికలు జరిగే ఏడు మునిసిపాలిటీలలో 236 వార్డులకు 1183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చివరి రోజు 671 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పులివెందులలో 11వ వార్డుకు చెందిన సుజాత వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మైదుకూరు 10వ వార్డులో చవ్వా సుజాత, రాయచోటి 2వ వార్డులో నారాయణమ్మ, 24వ వార్డులో సుగవాసి సుశీల స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహణ గడువు ముగియడంతో ఇక ప్రచార పర్వానికి తెరలేచింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండటంతో అభ్యర్థులకు ప్రచారానికి మరో పదిరోజులు గడువు మాత్రమే ఉంది. దీంతో అన్నిపార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
మొత్తం వార్డులు 236...పోలింగ్ 232 వార్డులకు:
జిల్లాలో కడప కార్పొరేషన్ తోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, పులివెందుల, మైదుకూరు, బద్వేలు, ఎర్రగుంట్ల మునిసిపాలిటీల్లో 236 వార్డులు ఉన్నాయి. వీటిలో రాయచోటిలో రెండు, మైదుకూరు, పులివెందులలో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవం కావడంతో 232 వార్డులకు ఓటింగ్ జరగనుంది. ప్రధానపార్టీలలో జిల్లాలో అత్యధికంగా వైఎస్సార్‌సీపీ నుంచి 232 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి 225 మంది బరిలో ఉన్నారు. అత్యల్పంగా సీపీఐ నుంచి 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే అందరి కంటే స్వతంత్ర అభ్యర్థులు అధికంగా 629 మంది పోటీ చేస్తున్నారు.
459 నామినేషన్లు ఉపసంహరణ:
మంగళవారం జిల్లా వ్యాప్తంగా 671 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా కడపలో 182 నామినేషన్లు, అత్యల్పంగా జమ్మలమడుగులో 24 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
రేసు గుర్రాలు 1183
Published Wed, Mar 19 2014 2:28 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement