లీడర్‌కు కే‘డర్‌’ | Own army in the name of zone wise in charges | Sakshi
Sakshi News home page

లీడర్‌కు కే‘డర్‌’

Published Thu, Nov 16 2023 3:56 AM | Last Updated on Thu, Nov 16 2023 10:29 AM

Own army in the name of zone wise in charges - Sakshi

అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి రాజకీయ వలసలు అన్ని పార్టీల్లోనూ నిత్యకృత్యంగా మారాయి. దిగ్గజ నేతలు మొదలుకొని క్షేత్రస్థాయి కార్యకర్త వరకు  పార్టీని వీడటం అన్ని పార్టీల్లోనూ రివాజుగా మారింది. టికెట్ల కేటాయింపుపర్వం అన్ని రాజకీయ పక్షాల్లోనూ ప్రకంపనలు సృష్టించగా,  భంగపడిన ఆశావహులు సొంతపార్టీని వీడి ప్రత్యర్థి పార్టీలోకి చేరిపోయారు. తమ టికెట్‌ ఎగురేసుకు వెళ్లిన అభ్యర్థులను ఓడిస్తామంటూ శపథం చేస్తూ ఎదుటి పార్టీ కండువాలు కప్పుకున్నారు.

ఇక టికెట్‌ దక్కించుకున్న నేతలు ఎదుటి శిబిరాలపై కన్నేసి క్షేత్రస్థాయి కేడర్‌ను లాక్కునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా తాయిలాలు ఎర వేస్తూ తమవైపు లాక్కునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇక మరోవైపు ఉన్న సొంతకేడర్‌ను కాపాడుకునేందుకూ తంటాలు పడుతున్నారు. స్థానికంగా జనంలో కాస్త పలుకుబడి ఉన్న నేతలకు సైతం పార్టీ మారాల్సిందిగా వివిధ పక్షాల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఎటూ తేల్చుకోలేని కిందిస్థాయి నేతలు కొందరు ఫోన్లు బంద్‌ పెట్టుకొని అందుబాటులో లేకుండా పోతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. 

స్థానిక సంస్థల ప్రతినిధులకు గిరాకీ... 
ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు క్షేత్రస్థాయి కేడర్‌ చేరికలపై అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. వలసలను ప్రోత్సహించే క్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన వార్డు మెంబర్లు మొదలు ఉప సర్పంచ్‌లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు, చైర్మన్లు, స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు గిరాకీ ఏర్పడింది. పార్టీ నిర్ణయానికి కంకణబద్ధులైన స్థానిక సంస్థల ప్రతినిధులు కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారు.  

మరికొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతోనూ బేరసారాలు సాగిస్తున్నారు. వలసలను అరికట్టే క్రమంలో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే అడ్వాన్సు రూపంలో కొంత మేర చెల్లింపులు పూర్తి చేశారు. అయినా సంతృప్తి చెందని కొందరు క్షేత్ర స్థాయి నేతలు, కేడర్‌ ఎదుటి పార్టీ అభ్యర్థులతో మంతనాలు జరుపుతుండటం సొంత పార్టీ అభ్యర్థులకు తలనొప్పులు తెచ్చి పెడుతోంది.

కొందరు కిందిస్థాయి నాయకులు అడ్వాన్సులు పుచ్చుకుని కూడా పార్టీలు మారుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొత్త కేడర్‌ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో కింది స్థాయిలో వీరిదే ప్రధాన పాత్ర కావడంతో తమకు విధేయతతో పనిచేసే కేడర్‌ కోసం నేతలు వెతుకులాట ముమ్మరం చేస్తున్నారు.  

సొంత సైన్యం మోహరింపు 
క్షేత్రస్థాయిలో కేడర్‌ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందు కు ఎమ్మెల్యే అభ్యర్థులు తమ సొంత సైన్యాన్ని మండలాల వారీగా మోహరింపజేశారు. ఓవైపు పార్టీ నేతలకు మండలాలు, కీలక గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగిస్తూనే తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ లాంటి పార్టీలు కీలక నియోజకవర్గాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాయి.

వారు తమ అనుచరగణంతో కేటాయించిన మండలాల్లో మకాం వేసి కేడర్‌ సమన్వయం, ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాల్లో అభ్యర్థులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో అత్యంత కీలకమైన డబ్బు, మద్యం పంపిణీ బాధ్యతలను అభ్యర్థులు తమ సొంత సైన్యానికే అప్పగిస్తున్నారు.

ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమకు నమ్మకస్తులైన వారి ఇళ్లు, ఇతర ప్రదేశాల్లో మద్యం డంప్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నగదు తరలింపులో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కీలక స్థావరాలకు చేర్చినట్లు సమాచారం. అయితే కొన్ని చోట్ల పార్టీ ఇన్‌చార్జ్‌లు, అభ్యర్థుల నడుమ కూడా సమన్వయ లోపం తలెత్తుతోంది.  

-కల్వల మల్లికార్జున్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement