సోనియా సభ.. ఖర్చు ఎవరిదబ్బా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేపట్టిన ఎన్నికల ప్రచారం పార్టీ అభ్యర్థులను ఇరకాటంలో పడేసింది. సోనియావస్తే ఓట్లు రాలుతాయని భావించిన అభ్యర్థులకు ఓట్లు దేవుడెరుగు సభ నిర్వహణా వ్యయం తమ ఖాతాలో జమ చే యాలనే ఈసీ నిర్ణయం ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల 27న చేవెళ్లలో జరిగిన భారీ బహిరంగసభలో సోనియా పాల్గొన్నారు. అధినేత్రి సభను ప్రతిష్టాత్మంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం భారీగా జనసమీకరణ చేపట్టింది. సభను విజయవంతం చేయడం ద్వారా ఎన్నికల్లో మైలేజ్ పొందాలనే లక్ష్యంతో పెద్దఎత్తున జనాలను తరలించింది.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చేవెళ్లకు ప్రజలను తరలించేందుకు 700పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. అద్దెకు తీసుకున్న ఈ బస్సులకు సుమారు రూ.85 లక్షలను చెల్లించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే రూ.28 లక్షలు, ఎంపీ రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయడానికి లేదు. అయితే జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొనే సభల వ్యయం విషయంలో కొన్ని సడలింపులున్నాయి. వ్యయ పరిమితిపై కొన్ని మినహాయింపులను వర్తింపజేస్తోంది. ఈ భరోసాతోనే బస్సుల అద్దెలను టీపీసీసీయే చెల్లించింది. అయితే, స్టార్ క్యాంపెయినర్లు ప్రసంగించే సభల్లో అభ్యర్థులు పాలుపంచుకుంటే మాత్రం ఎన్నికల వ్యయంలో కొంత నిష్పత్తి సదరు అభ్యర్థుల ఖాతాలో కూడా జమచేయాలనే నిబంధన కూడా ఉంది.
ఈ నేపథ్యంలోనే ఈ సభ నిర్వహణా వ్యయాన్ని రూ.కోటిగా తేల్చిన వ్యయపరిశీలకుడు.. ఈ మొత్తాన్ని అభ్యర్థుల పద్దులో చేర్చే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే వీడియో ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల అధికారులు.. సోనియా సభలో వేదికనెక్కిన అభ్యర్థులను గుర్తించే పనిలో పడ్డారు. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఏకంగా వేదిక మీద ఆశీనులు కాగా, లోక్‌సభ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి సోనియాను సన్మానించారు. మరికొంద రు అభ్యర్థులు పరిచయంలో భాగంగా వేదిక పైకొచ్చినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ వ్యయాన్ని సమపాళ్లలో వడ్డించాలని వ్యయపరిశీలకులు స్పష్టం చేశారు.
కాగా, అధినేత్రి పాల్గొన్న సభ ఖర్చును తమ ఖాతాల్లో చూపాలనే ఈసీ నిర్ణయాన్ని అభ్యర్థులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. జాతీయ నేతలు పాల్గొనే సభలకు వ్యయపరిమితి వర్తించదని, ఈ విషయంలో వ్యయ పరిశీలకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అంటున్నారు. తలనొప్పిగా మారిన ఈ వ్యవహారంపై స్పష్టత కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రిటర్నింగ్ అధికారి లేఖ రాసినట్లు తెలిసింది. ఈసీ ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా సభ ఖర్చును ఎవరి పద్దులో చేర్చాలనే అంశాన్ని నిర్ణయించాలని జిల్లా యంత్రాంగాం నిర్ణయించింది.