సోనియా రుణం తీర్చుకుందాం: కోమటిరెడ్డి
నల్లగొండ సభలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి పిలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు 60 ఏళ్లలో ఎన్నో పోరాటాలు జరిగాయి. వేలాది మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేశారు. ఈ ఆరు దశాబ్దాల్లో ఎందరో ప్రధానమంత్రులు వచ్చారు, పోయారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మాత్రం సోనియాగాంధీయే. ఇచ్చిన హామీని ఆమె నిలబెట్టుకున్నారు. ఈ ప్రాంత ప్రజల కలలను నిజం చేసిన దేవత సోనియమ్మ. ఆమె రుణాన్ని ఈ ఎన్నికల ద్వారా తీర్చుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం’ అని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.
బుధవారం నల్లగొండ అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , భువనగిరి లోక్‌సభా స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం కోమటిరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రె స్ జయభేరి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాకారమవుతుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరిగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీలది అనైతిక పొత్తు అని అన్న ఆయన, టీడీపీకి ఓటేస్తే.. మూసీ నదిలో వేసినట్టేనని వ్యాఖ్యానించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, రాహుల్‌ను ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.