ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వం: కోదండరాం | will not support to any political party in elections, says Kodanda ram | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వం: కోదండరాం

Published Tue, Apr 15 2014 1:43 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

will not support to any political party in elections, says Kodanda ram

* తటస్థంగా ఉండి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటాం: టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
* ఎన్నికల్లో జేఏసీ వైఖరి, నిర్మాణం, పునర్నిర్మాణ ఎజెండాపై స్టీరింగ్ కమిటీ భేటీ
* ఏ రాజకీయ పార్టీకి మద్దతిచ్చినా జేఏసీ ఉనికికి ప్రమాదమని నేతల అభిప్రాయం
* కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డికి టీఆర్‌ఎస్ టికెట్లపై అభ్యంతరం
* 18న మరోసారి భేటీ.. నిర్దిష్టంగా వైఖరి ప్రకటించాలని నిర్ణయం
* జేఏసీ కన్వీనరుగా దేవీప్రసాద్.. కో-చైర్మన్‌గా విఠల్ నియామకం

 

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకూడదని.. తటస్థంగానే ఉంటూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో జేఏసీ పాలుపంచుకోవాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. అంతేగాకుండా సోనియా సహా ఏ పార్టీకి సంబంధించిన ఎన్నికల సభల్లోనైనా జేఏసీ నేతలు పాల్గొనవద్దని నిర్ణయించింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో సోమవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరి, జేఏసీ నిర్మాణం, పునర్నిర్మాణ ఎజెండా, తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ పాత్ర తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
 
 జేఏసీలో రాజకీయపార్టీలు ఉండాలా? ప్రజా సంఘాలతోనే జేఏసీని కొనసాగించాలా? జేఏసీ నిర్మాణం, రాజకీయ పార్టీల పట్ల అనుసరించాల్సిన వైఖరి వంటివాటిపై ఈ నెల 18న మరోసారి సమావేశమై నిర్ణయాన్ని ప్రకటించాలని .. జేఏసీ వైఖరిని స్పష్టంగా, నిర్దిష్టంగా, మార్గదర్శకాలను రాతపూర్వకంగా ప్రకటించాలని నిర్ణయించారు. జేఏసీ ఎజెండాను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు ఈ సందర్భంగా జేఏసీ కృతజ్ఞతలు తెలియజేసింది. జేఏసీ ముఖ్యనేతలు దేవీప్రసాద్, మల్లేపల్లి లక్ష్మయ్య, సి.విఠల్, ఎం.నారాయణ, కారెం రవీందర్‌రెడ్డి, రఘు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
 
 సమైక్యవాదులకు టీఆర్‌ఎస్ టికెట్లా..?

 ఇప్పటిదాకా ఉద్యమంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తే బాగుంటుందని సమావేశంలో కొందరు పేర్కొనగా... సీమాంధ్రలో రాజకీయంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన పి.మహేందర్‌రెడ్డి, కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్ వంటివారికి టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చిందని... తెలంగాణ ఉద్యమకారులపై దాడులకు దిగిన ఇలాంటి నేతలకు తెలంగాణవాదులు ఎలా మద్దతిస్తారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తే.. జేఏసీ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. ఏదైనా ఒక రాజకీయపార్టీకి మద్దతు ఇస్తే జేఏసీ పునర్నిర్మాణ ఎజెండాను అమలుచేయడంలో ఇబ్బందులు వస్తాయని... జేఏసీ మద్దతిచ్చిన పార్టీ అధికారంలోకి రాకుంటే ఎజెండాను అమలుచేయించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. మొత్తంగా... ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని అభిప్రాయానికి వచ్చారు.
 
 ఇక గతంలో జేఏసీలో పనిచేసి.. ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున పోటీ పడుతున్న అభ్యర్థుల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపైనా చర్చ జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు ఏ పార్టీలో ఉన్నా.. వారిని గెలిపించాలని పిలుపు ఇవ్వాలని సమావేశంలో భావించారు. జేఏసీలో కీలకంగా పనిచేసిన నాయకులకు మద్దతుగా కొన్ని సంఘాలు వ్యవహరించే అవకాశముందని.. అయితే, జేఏసీగా బహిరంగ ప్రచారం ఉండకూడదని నిర్ణయించారు. టీడీపీ, బీజేపీ పొత్తు విషయంపైనా చర్చించారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన టీడీపీ, వైఎస్సార్‌సీపీలను ఓడించాలని పిలుపు ఇవ్వాలని... టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల విషయంలో ఒకే విధంగా వ్యవహరించాలని అభిప్రాయం వ్యక్తమైంది.
 
 రాజకీయ సభలకు దూరంగానే..

 రాజకీయపార్టీల ఎన్నికల సభకు దూరంగా ఉంటామని సమావేశం అనంతరం కోదండరాం ప్రకటించారు. గతంలో కొన్ని ఎన్నికల సభల్లో పాల్గొన్నా... అది పొరపాటుగా జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. సోనియా సహా ఎన్నికల సభలకు ఎవరు ఆహ్వానించినా పాల్గొనబోమన్నారు. అయితే సోనియా హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా గౌరవపూర్వకంగా కలిసే అవకాశముందని జేఏసీ నేతలు వెల్లడించారు.
 
 ఆదివాసీలను ముంచొద్దు..: మల్లేపల్లి
 పోలవరం ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆదివాసీల జీవితాలు ఛిద్రం అవుతాయని మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర విభజన సందర్భంగా ఆప్షన్లు తప్పనిసరి కాదని... అది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని కన్వీనర్ దేవీప్రసాద్, కో-చైర్మన్ సి.విఠల్ అన్నారు. తెలంగాణ సచివాలయం, ఉద్యోగులు, ప్రభుత్వ శాఖల కొనసాగింపు వంటి అధికారాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలన్నారు. అపాయింటెడ్ తేదీ వచ్చే వరకూ ముఖ్యమైన నిర్ణయాలేమీ తీసుకోవద్దని డిమాండ్ చేశారు.  
 
 జేఏసీ కన్వీనర్‌గా దేవీప్రసాద్..
 తెలంగాణ జేఏసీ కన్వీనర్‌గా టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్‌ను నియమించినట్టు జేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడించారు. కో-చైర్మన్‌గా సి.విఠల్, అధికార ప్రతినిధులుగా రఘు, హమీద్ అహ్మద్‌ఖాన్, కో-కన్వీనర్లుగా వెంకటేశం, ప్రహ్లాద్, జ్ఞానేశ్వర్, వెంకటరెడ్డిలను నియమించినట్లు తెలి పారు. జేఏసీ నిర్మాణంలో కొన్ని అంతర్గత ఖాళీలు ఉన్నాయని.. వాటిని పూరించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, జేఏసీ కన్వీనర్‌గా ఉన్న స్వామిగౌడ్ పదవీ విరమణ చేయడం, తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో... కన్వీనర్ పదవి ఖాళీ అయింది. అప్పటికి కో-చైర్మన్‌గా ఉన్న వి.శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవో అధ్యక్షుడిగా ఎన్నికైన దేవీప్రసాద్ జేఏసీ కన్వీనర్ పదవికోసం పోటీపడ్డారు. ఈ పోటీ రచ్చకెక్కడంతో కొంతకాలం దానిని ఎవరికీ ప్రకటించకుండా ఖాళీగా ఉంచారు. శ్రీనివాస్‌గౌడ్ ఉద్యోగానికి రాజీ నామా చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతుండడంతో... కన్వీనర్ పదవిని దేవీప్రసాద్‌కు అప్పగించారు. అయితే ఈ స్టీరింగ్ కమిటీ సమావేశానికి టీజీవోల సంఘం నుండి ప్రతినిధిని పంపాలని జేఏసీ ఆహ్వానించినా ఎవరూ రాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement