వైఎస్ సువర్ణయుగం జగన్‌తోనే సాధ్యం
- అభివృద్ధి, సంక్షేమమే గెలిపిస్తాయ్
- అవకాశం ఇస్తే బందరు భవితను బంగారం చేస్తాం
- ఐదేళ్లలో బందరు ఎంపీ చేసింది ఏమీ లేదు
- సాక్షితో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి ముఖాముఖీ
తండ్రి కె.పి.రెడ్డియ్య రాజకీయ వారసత్వాన్ని అందుకున్న కొలుసు పార్థసారథి జిల్లా రాయకీయాల్లో తనదైన ముద్రవేశారు. మహానేత వైఎస్సార్ స్ఫూర్తితో కాంగ్రెస్‌లో రాణించిన ఆయన జగన్‌మోహన్‌రెడ్డిపై విశ్వాసంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఈ సారి బందరు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. దివంగత మహానేత వైఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్నారు. గత ఎంపీ బందరుకు చేసింది ఏమీలేదని, తనకు అవకాశం ఇస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో బందరు భవితను బంగారం చేస్తానని స్పష్టంచేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాక్షి : తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఎలా ఫీలవుతుంటారు?
సారథి : నా తండ్రి కొలుసు పెద్ద రెడ్డియ్య ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. బీసీ వర్గానికి చెందిన సామాన్య కుటుంబానికి చెందిన మేము జిల్లా ప్రజల ఆశీస్సలతో రాజకీయాల్లో రాణించాం. పునర్విభజనలో రద్దయిన ఉయ్యూరు, ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంతోపాటు, బందరు లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాం. దివంగత మహానేత వైఎస్ స్ఫూర్తితో 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. జిల్లాలో ఎంతో మంది సీనియర్లు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఏకైక మంత్రిగా నన్ను నియమించిన వైఎస్‌కు ఎప్పటికీ రుణపడివుంటా.
సాక్షి : జిల్లా రాజకీయాల్లో మీ పాత్ర?
సారథి : మంత్రిగా ఉన్నా ఎప్పుడూ వర్గాలు, గ్రూపులు కట్టలేదు. అందుకే జిల్లాలో అందరివాడిగా అభిమానం పొందగలిగా.
సాక్షి : జిల్లా అభివృద్ధిలో మీ పాత్ర?
సారథి : ఒకవైపు జిల్లాలో ముఖ్యమైన అభివృద్ధి సాధిస్తూనే మరోవైపు నన్ను ఎమ్మెల్యేని చేసిన పెనమలూరు నియోజ కవర్గం ప్రజల రుణం తీర్చుకునేందుకు ఐదేళ్లలో సుమారు రూ.350 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టా. విజయవాడలో రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేయించా. గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధులు పట్టుబట్టినా దాన్ని మన జిల్లాకే సాధించగలిగా. అయితే నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయస్థాయి ప్రమాణాలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన 400 ఎకరాల స్థల సేకరణకు నిధులు మంజూరు చేయించా. కేబినెట్ ఆమోదం కూడా సాధించా. వైఎస్ చేపట్టిన పులిచింతల ప్రొజెక్టును పూర్తి చేసేందుకు సుమారు రూ.800 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టాం. విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలోని కృష్ణా నది ఒడ్డున నివసించే వారి రక్షణ కోసం ఆర్సీసీసీ వాల్ నిర్మాణానికి రూ.150 కోట్లు మంజూరు చేయించా. జిల్లా నలుమూలలా పేదల సమస్యలు పరిష్కారానికి, వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశా.
సాక్షి : మీ గెలుపు ధీమా ఏమిటీ?
సారథి : వైఎస్ సువర్ణయుగాన్ని తెస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలకు తొమ్మిదేళ్ల చీకటి పాలన అందించిన చంద్రబాబుకు మళ్లీ తన పాలన తెస్తానని చెప్పే సత్తా లేదు. అధికారం కోసం అమలు కాని హామీలు ఇస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరు. గతంలో మతతత్వ బీజేపీతో పొత్తుపెట్టుకుని చారిత్రక తప్పిదం చేశానని చెప్పిన ఆయన ఇప్పుడు అధికార దాహంతో మళ్లీ అదేపార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ముస్లిం మైనార్టీలు నమ్మడంలేదు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు తన పదవీకాలంలో కనీస అభివృద్ధి పనులు చేయలేదు. మళ్లీ పోటీ చేస్తున్న ఆయన్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వైఎస్ సాధించిన విజయాలు, టీడీపీ వైఫల్యాలే నన్ను గెలిపిస్తాయి. సమైక్యాంధ్ర చాంపియన్‌గా నిలిచిన వైఎస్సార్ సీపీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ చాంపియన్‌గా నిలుస్తుంది.
సాక్షి : సొంత అజెండా ఏమైనా ఉందా?
సారథి : పేదల అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోకు సానుకూల స్పందన వస్తోంది. ఆ మేనిఫెస్టోతోనే ప్రజల్లోకి వెళ్తున్నా. నాకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. బందరు పోర్టు నిర్మాణం తక్షణం చేపట్టి ఐదేళ్లలో పూర్తిచేయడం, విజయవాడ-మచిలీపట్నం ప్రధాన రహదారిని నాలుగు లైన్ల విస్తరణ పనులు పూర్తి చేయడం, 216 కోస్తా జాతీయ రహదారి అభివృద్ధిని వేగవంతం చేయడం, బ్రహ్మయ్యలింగం చెరువును రిజర్వాయర్‌గా మార్చడం, బందరుకు రెండో రైల్వేలైను, మచిలీపట్నం-రేపల్లె రైలు మార్గం ఏర్పాటు, గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు, దివిసీమ, కూచిపూడి, మంగినపూడి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, వ్యవసాయ రంగానికి సాగు నీటి సమస్య తీర్చి రైతులను ఆదుకునేలా కృషి, ఆక్వా రంగానికి ఊతమిచ్చేలా పరిశోధన కేంద్రాల ఏర్పాటు, గుడివాడ-పామర్రు ప్లై ఓవర్ నిర్మాణం తదితర ప్రధాన రంగాలపై దృష్టి సారించి ప్రత్యేక విజన్‌తో ఐదేళ్లపాటు ప్రజలకు సేవకుడిగా పనిచేస్తాను.