గుంటూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ కుమ్మక్కై న చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరించాడని విమర్శించారు. జిల్లాలోని మంగళగిరి ఎన్నికల రోడ్ షోకు హాజరైన వైఎస్ జగన్.. చంద్రబాబు -కాంగ్రెస్ కలిసి ఆడిన డ్రామాలను ఎండగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కాపాడితే.. ఆయన కేసులపై విచారణ జరగకుండా కాంగ్రెస్ కాపాడిందని జగన్ మరోమారు పునరుద్ఘాటించారు. ఆయన కేసులపై కనీసం సీబీఐ విచారణ జరపదని, విచారణ చేపట్టడానికి తగిన సిబ్బందే లేరని సీబీఐ ఏవో కారణాలు చూపుతుందన్నారు. తన ఎంపీలతో ఓటు వేయించి రాష్ట్ర విభజనకు బాబు సహకరించిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఓట్లు - సీట్లు కోసం దొంగ కేసులు పెట్టించి జైల్లో పెట్టడానికి వారి మనస్సాక్షి అడ్డు రావడం లేదన్నారు. ఇలాంటి రాజకీయ చదరంగం నేడు జరుగుతోందన్నారు.'ఆయనలా అబద్ధాలు ఆడటం తనకు చేతకాదు. ఆయన మాదిరి నిజాయితీలేని రాజకీయాలు చేయలేను.ఆయన మాదిరి విశ్వసనీయతలేని రాజకీయాలు చేయలేను. నాకు వారసత్వంగా వచ్చింది వైఎస్సార్ నుంచి వచ్చిన విశ్వసనీయతే'అని జగన్ తెలిపారు. ఓటుతో మన తలరాతను మనమే మార్చుకుందామని జగన్ ప్రజలకు సూచించారు. ఏ నాయకుడు అయితే ప్రతి పేదవాడి మనసు ఎరుగుతాడో అటువంటి వారికే ఎన్నికల్లో గెలిపించాలన్నారు. ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు ముందు బాబు పాలన భయానకంగా సాగిందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో విశ్వసనీయత కల్గిన వైఎస్సార్ సీపీ పట్టం కట్టాలని ప్రజలకు విజ్క్షప్తి చేశారు.