పవన్ కు పిచ్చోడికి తేడా లేదు
వైఎస్సార్ జనభేరి సభల్లో విరుచుకుపడ్డ షర్మిల
కాకినాడ: ‘‘మీ ఊరికి పిచ్చోడు వచ్చి ఒక సెంటర్‌లో నిలబడి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఆ పిచ్చిమనిషి చెప్పినట్టు వింటారా? ఆ పిచ్చిమనిషి చెప్పినవారికి ఓట్లు వేస్తారా? ఆ పిచ్చోడికి పవన్ కల్యాణ్‌కు తేడా లేదు. పేరుకు తగ్గట్టుగా పవన్‌వి అన్నీ గాలిమాటలే.. అన్నీ సొల్లు మాటలే. ఆయన మొదట ఒక ఆడిటోరియం తీసుకొని పెద్ద సభ పెట్టాడు. జనసేన అనే పార్టీ పెట్టానని ఆర్భాటంగా ప్రకటించాడు. ప్రస్తుతం పోటీ చేయడం లేదు, మీ ఇష్టమొచ్చినవారికి ఆత్మసాక్షిగా ఓట్లు వేసుకోండని చెప్పాడు. వారం రోజులు కూడా తిరక్కుండానే... లేదు, లేదు నేను మోడీని కలిసొచ్చాను... మీరంతా మోడీకి ఓట్లేయండని చెప్పాడు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకు ఓట్లేయమని చెబుతున్నాడు. పూటకో మాట మార్చే ఈ పవన్ కల్యాణ్‌కు విలువల్లేవు.. విశ్వసనీయత లేదు. ఆయనకు ఉన్నదంతా ఒకటే... లెక్కలేనంత తిక్క. ఆ తిక్కంతా ఆయన మాటలు, చేతలు, చేష్టల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విరుచుకుపడ్డారు.
తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజైన ఆదివారం కోరుకొండ, రంపచోడవరం, కరపల్లో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘‘అధికారం కోసం చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తాడు... ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడు. ఆనాడు రాజశేఖరరెడ్డిగారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక రాష్ర్టంలోని మిగిలిన పార్టీలతో కలసి మహాకూటమి పెట్టుకున్నాడు. కానీ తెలుగు ప్రజలు తెలివైనవారు... చంద్రబాబు మహాకూటమిని నమ్మలేదు. మాట తప్పని, మడమ తిప్పని మహానేతకే పట్టం కట్టారు. ఇప్పుడు ఆ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీని, మోడీని, వెంకయ్య నాయుడిని తీసుకొచ్చాడు. ఇవే ఆఖరి ఎన్నికలు కదా... పాపం తెచ్చుకున్నాడులే అనుకోవచ్చు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కాళ్లు కూడా పట్టుకున్నాడంటే చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా వెనకాడడని అర్థమవుతోంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంతే’’ అంటూ దుయ్యబట్టారు.
వైఎస్సార్ పాలన సుభిక్షం
‘‘రాజశేఖరరెడ్డి మన రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు రాష్ర్టం ఎంత సుభిక్షంగా ఉండేదో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రైతులు, చేనేతలు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు... ఇలా ప్రతి వర్గానికీ భరోసా కల్పించిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. కులాలకు.. మతాలకు.. ప్రాంతాలకు.. పార్టీలకు కూడా అతీతంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కృషి చేసిన మహానేత మన రాజన్న. దురదృష్టంకొద్దీ వైఎస్సార్ మరణం తర్వాత అధికారం చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి అని పథకాలకు తూట్లు పొడిచారు’’ అని షర్మిల వివరించారు.