‘స్కాం’ల బాబూ.. విచారణకు సిద్ధమేనా?
చంద్రబాబుకు వైఎస్ విజయమ్మ సవాల్
శ్రీకాకుళం, ‘‘చంద్రబాబూ... నీ తొమ్మిదిన్నరేళ్ల రాక్షస పాలన ప్రజలందరికీ తెలుసు. నీ దుష్ట పరిపాలనలో అన్నీ కుంభకోణాలే కదా.. మద్యం, ఏలేరు, తెల్గీ, నీరు-మీరు, ఐఎంజీ, ఎమ్మార్ ఇలా వరుస కుంభకోణాలతో పాలన సాగించావ్.. వీటిపై విచారణల నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాల నుంచి సుమారు 18 స్టేలు తెచ్చుకుని బతుకుతున్నావ్.. ఇది నిజం కాదా?.. వీటిపై విచారణకు నువ్వు సిద్ధమేనా..?’’ అని వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సవాల్ విసిరారు. నువ్వు ఏ, తప్పూ చేయకపోతే, నాయకత్వ లక్షణాలుంటే కోర్టుల్లో స్టేలు తొలగింపజేసుకొని నేరుగా విచారణను స్వీకరించాల ని డిమాండ్ చేశారు. ‘‘బాబు హయాంలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనుషులకు తిండి లేదు. ఆఖరికి పశువులకు కూడా మేత లేదు.
వలసలు, ఆత్మహత్యలు, అప్పులు.. ఇలా అన్నీ అవస్థలే. ఇక టీడీపీ వ్యవస్థాపకుడు, సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకుడయ్యాడు. ఎన్టీఆర్ పెట్టిన 2 రూపాయలకే కిలోబియ్యం, మద్య నిషేధం, రైతులకు 50 రూపాయలకే ఒక హార్స్ పవర్ విద్యుత్ పథకాలను ఎత్తేశాడు’’ అని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఆల్‌ఫ్రీ అంటూ ఇస్తున్న అడ్డగోలు వాగ్దానాలను నమ్మవద్దన్నారు. ఐదేళ్లపాలనలో రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమరాజ్యం మళ్లీ రావాలంటే ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. జగన్ సీఎం కాగానే ఐదు సంతకాలతో రాష్ట్రం దశదిశ మారుస్తాడని భరోసానిచ్చారు. ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పోలాకి, వడ్డితాండ్ర, శ్రీకూర్మం, శ్రీకాకుళం, చిలకపాలెంలో నిర్వహించిన సభల్లో ఆమె మాట్లాడారు.