
ఆగని టీడీపీ దాష్టీకం
ఆమదాలవలస, ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆమదాలవలస మండల కన్వీనర్ సువ్వారి అనీల్‌కుమార్, జెడ్పీటీసీ అభ్యర్థి బొడ్డేపల్లి సరోజనమ్మ తనయుడు బొడ్డేపల్లి అనిల్‌లపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో అనీల్‌కుమార్ తలకు తీవ్ర గాయమైంది. చేయి విరిగిపోయింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని.. నిందితులను అరెస్ట్ చేసేవరకు చికిత్స పొందేది లేదని సంఘటన స్థలిలోనే అనీల్‌కుమార్ బైఠాయించటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆమదాలవలస అసెంబ్లీ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం నచ్చచెప్పడంతో పరిస్థితి అదుపులోకి రాగా.. అనీల్‌కుమార్‌ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
ఇదీ జరిగింది..
ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన సువ్వారి అనీల్‌కుమార్, కనుగులవలస గ్రామానికి చెందిన బొడ్డేపల్లి అనిల్‌లు గురువారం మధ్యాహ్నం క లివరం పంచాయతీ పరిధి తమ్మయ్యపేటలో జరిగిన పెళ్లి విందుకు హాజరయ్యారు. భోజనం చేసి కారులో తిరిగి వస్తుండగా కనుగులవలస సమీపంలోని రైల్వేగేటు వద్ద టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ అనుచరులైన కొర్లకోటకు చెందిన చిగురుపల్లి శ్యామలరావు, కోటిపాత్రుని నారాయణరావు, మరికొంతమంది బైకులు అడ్డంగా పెట్టి అడ్డుకున్నారు. తొలుత అనీల్‌కుమార్ తలపై ఇనుప రాడ్లతో కొట్టారు. చేయి విరగ్గొట్టారు. తల నుంచి రక్తస్రావం ఎక్కువగా కావటంతో అనీల్‌కుమార్ స్పృహతప్పి పడిపోయారు. దాడిని అడ్డుకోవటానికి యత్నించిన అనీల్‌ను కూడా టీడీపీ వర్గీయులు కొట్టారు. ఆయన పెద్దగా కేకలు వేయటంతో సమీపంలోని గ్రామస్తులు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. పారిపోతున్న టీడీపీ వర్గీయులను వెంటాడారు. ఇద్దరిని పట్టుకుని పోలీసులు వచ్చాక వారికి అప్పగించారు. ఈలోగా 108కు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం సంఘటన స్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
పోలీసుల తీరుపై నిరసన
పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే తనపై టీడీపీ గూండాల దాడులు కొనసాగుతున్నాయంటూ అనీల్‌కుమార్ సంఘటన స్థలిలోనే బైఠాయించారు. నిందితులను అరెస్ట్ చేసేవరకు చికిత్స చేయించుకునేది లేదని స్పష్టం చేశారు. 108 వాహనం అక్కడికి వచ్చినా ఆయన ఎక్కలేదు. ఈ సందర్భంగా అనీల్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామస్తులు వెంటనే రాకపోతే టీడీపీ గూండాలు తనను చంపేసేవారని వాపోయారు. పథకం ప్రకారమే దాడి జరిగిందన్నారు. గతంలో త న ఇంట్లో పార్కింగ్ చేసి ఉంచిన కారును పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై హైకోర్టుకు వెళ్లి అర్డన్ తీసుకొచ్చాక కూడా పోలీసులు స్పందించలేదన్నారు. వరుస ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి గట్టిగా కృషి చేశానన్న కక్షతోనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్, కొర్లకోటకు చెందిన పీఎసీఎస్ అధ్యక్షుడు సనపల లక్ష్మునాయుడు, ఆయన కుమారులు ఢిల్లేశ్వరరావు, అప్పలనాయుడు, అల్లుడు కోట గోవిందరావులు పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు.
నిందితులను అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని.. దీనిపై హామీ ఇచ్చేందుకు ఎస్పీ రావాలని.. అప్పటివరకు చికిత్స పొందబోనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎస్‌ఐలు సునీల్, గోవిందరావు సీఐ విజయానంద్‌కు చెప్పారు. వెంటనే సీఐ అక్కడకు చేరుకొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం సీఐతో మాట్లాడుతూ దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సబబుకాదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో అనీల్‌కుమార్‌కు తమ్మినేని నచ్చజెప్పి 108 వాహనం ఎక్కించారు. అప్పటికీ శాంతించని కనుగులవలస గ్రామస్తులు 108 వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని పక్కకు తొలగించాక అనీల్‌కుమార్‌ను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. తమ్మినేని అక్కడికి కూడా వెళ్లి అనీల్‌కుమార్‌ను పరామర్శించారు. దాడి ఘటనతో కనుగులవలస, కొర్లకోట గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆ గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.
టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు
తమ్మయ్యపేటలో పెళ్లికి వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో కనుగులవలస రైల్వే గేటు సమీపంలో తనపై దాడి జరిగిందని కొర్లకోట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సువ్వారి అనీల్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు కోట గోవిందరావు ప్రోద్భలంతో ఆ పార్టీ కార్యకర్తలు సనపల అప్పలనాయుడు, చిగురుపల్లి శ్యామలరావు, చిగురుపల్లి పాపారావు, కోటిపాత్రుని నారాయణరావు, పేడాడ ఈశ్వరరావు, చిగురుపల్లి అన్నాజీ, సువ్వారి జోగినాయుడు, తమ్మినేని వాసుదేవరావులు దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనీల్‌కుమార్ నుంచి వివరాలు తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎన్.సునీల్ తెలిపారు.
టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు
కనుగులవలస సమీపంలో 28 మంది తనపై గురువారం దాడి చేశారని కొర్లకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సీహెచ్. శ్యామలరావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సునీల్ తెలిపారు. అలాగే కనుగువలస సమీపంలో తమ్మినేని వాణీసీతారాం ప్రోత్సాహంతో తొగరాం గ్రామానికి చెందిన సనపల సురేష్, తమ్మినేని శ్రీరామ్మూర్తిలు దాడిచేసి కొట్టడంతో క ంటిపై గాయమైందని తొగరాం గ్రామానికి చెందిన తమ్మినేని వాసుదేవరావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎసై్స పేర్కొన్నారు.
ఓటమి భయంతోనే దాడులు: తమ్మినేని
ఆమదాలవలస,న్యూస్‌లైన్: శాసనసభ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలుసుకున్న టీడీపీ నాయకులు గూండాల్లా బరితెగించి దాడులకు తెగబడుతున్నారని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ కనుగులవలస రైల్వేగేటు వద్ద వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సువ్వారి అనీల్‌కుమార్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన తరువాత ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల సమయంలో చెదురు మదురు సంఘటనలు కార్యకర్తల వల్ల జరుగుతాయని, అనంతరం కక్షలకు దారితీస్తాయన్నారు. జిల్లా ఎస్పీ దీన్ని గమనించి టీడీపీ రౌడీలపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. పొందూరులోని పోలింగ్ బూత్ వద్ద టీడీ పీ ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన రౌడీయిజంపై ఇంతవరకూ దర్యాప్తు చేపట్టకపోవడానికి కారణం ఏమిటని తమ్మినేని ప్రశ్నించారు. ఎటువంటి వివాదాలకు పోవద్దని, పోలీసులే అన్నీ చూసుకుంటారని కొర్లకోట, కనుగులవలస గ్రామస్తులకు తమ్మినేని విజ్ఞప్తి చేశారు. కాగా టీడీపీ కార్యకర్తలు దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సువ్వారి అనీల్‌కుమార్‌ను తమ్మినేని సీతారాం, చిరంజీవి నాగు(నాని)లు పరామర్శించారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు కిల్లి లక్ష్మణరావు, బొడ్డేపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.