హైకోర్టు స్టే | High Court Stay | Sakshi
Sakshi News home page

హైకోర్టు స్టే

Published Wed, Aug 27 2014 3:51 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

హైకోర్టు స్టే - Sakshi

హైకోర్టు స్టే

ఆమదాలవలస:అధికార మదానికి చెంపపెట్టులా.. రాజకీయ కుట్రలను తిప్పికొట్టేలా.. చిరువ్యాపారులు బతుకులు నిలిపేలా ఉన్నత న్యాయస్థానం సకాలంలో స్పందించింది. ఆమదాలవలస కూరగాయల మార్కెట్ జోలికి వెళ్లవద్దని అధికారులను ఆదేశించింది. సోమవారం రాత్రి అధికారులు పోలీసు బలగాల సాయంతో మార్కెట్‌లోని షాపులను కూలగొట్టినందుకు నిరసనగా బాధిత వర్తకులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మంగళవారం ఉదయమే ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్ద వర్తకులు ఆందోళన చేపట్టగా వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం తదితరులు కార్యాలయంలోకి వెళ్లి కమిషనర్ నూకేశ్వరరావును నిలదీశారు. ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇంతలోనే మార్కెట్ తొలగింపు చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చినట్లు సమాచారం అందడంతో అందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. మార్కెట్‌లో మళ్లీ షాపుల ఏర్పాటుకు పూనుకున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలోని కూరగాయల మార్కెట్‌ను కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతి రేకంగా కూరగాయల వర్తక సంఘం తరఫున దుప్పల సింహాచలం, మరికొందరు సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.  ఈ నెల 25(సోమవారం)న వారు కోర్టులో పిటిషన్ వేయగా అదే రోజు రాత్రి మార్కెట్‌ను బలవంతంగా కూలగొట్టడం విశేషం.
 
 దశాబ్దాలుగా మార్కెట్‌లో వ్యాపారాలు చేసుకుంటున్న తమకు ప్రత్యామ్నాయం కల్పించకుండా అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఏకపక్షంగా మార్కెట్ కూలదోసేందకు చేస్తున్న ప్రయత్నాల ను అడ్డుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతం లో హైకోర్టు విచారణకు స్వీకరించింది. వివరాలు పరిశీలించి మార్కెట్‌లో యథాతథ స్థితి కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశిస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తూ.. కూరగాయల మార్కెట్‌లో కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశించింది. వ్యాపారులు యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చని పేర్కొంది. మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనపర్వంలో ఉన్న వర్తకులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఈ సమాచారం తెలుసుకొని ఆనందంతో కేరింతలు కొట్టారు. వైఎస్‌ఆర్‌సీపీకి జై.. తమ్మినేనికి జై.. అని నినాదాలు చేస్తూ కార్యాలయం బయటకు వచ్చి తమ్మినేని సీతారాంను పూల మాలతో సత్కరించారు.
 
 ఉదయం ఆందోళనకు శ్రీకారం
 అంతకుముందు వర్తకులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మంగళవారం ఉదయం పెద్దసంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బయట వర్తకులు ఆందోళనకు దిగగా.. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కౌన్సిలర్లు కమిషనర్ చాంబర్‌లోకి వెళ్లి ఆయన్ను నిలదీశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, కౌన్సిల్ తీర్మానం లేకుండా మార్కెట్‌ను ఎలా కూలదోశారని నిలదీశారు. అధికార బలంతో చట్ట వ్యతిరేక చర్యలకు తెగిస్తే.. పేదలకు అన్యాయం చేస్తే వైఎస్‌ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదని, ఎదురుదాడి తప్పదని హెచ్చరించారు. ఇది మున్సిపాలిటీ సమస్య.. ఇందులోకి ఇతర ప్రాంతాల నాయకులు చొరబడి మున్సిపల్ చైర్‌పర్సన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
 
 స్టే వస్తుందని తెలిసే హడావుడిగా కూల్చివేత
 సోమవారమే వర్తకులు హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం దాన్ని కోర్టు పరిశీలించి స్టే మంజూరు చేసే అవకాశముందని తెలిసే పక్కా ప్రణాళికతో పోలీసు బలగాలను మోహరించి పేద వర్తకుల పొట్ట కొట్టారని ఆరోపించారు. చట్టప్రకారం 30 ఏళ్లుపాటు ఒక ఆస్తిని అనుభవిస్తున్నవారికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, అది వారికే చెందుతుందన్న విషయం మీకు తెలియదా అని కమిషనర్‌ను ప్రశ్నించారు.
 
 సాధారణ వెండర్లు         అయినందునే నోటీసులు ఇవ్వలేదు:కమిషనర్
 దీనికి కమిషనర్ స్పందిస్తూ కూరగాయల వర్తకులు సాధారణ వెండర్లేనని, అందువల్ల వారికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరంలేదని చెప్పా రు. దీనిపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తోపుడుబళ్ల వ్యాపారులను మాత్రమే వెండర్లు అంటారని, మార్కెట్లో వ్యాపారాలు చేసే వారిని వర్తకులు అంటారని.. పైగా వారంతా ఒకే చోట 80 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నారని స్పష్టం చేయగా.. వారు ప్రభుత్వ స్థలాన్ని అక్రమించారని కమిషనర్ ఆరోపించారు. అలా అనుకున్నా ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలి కదా అని నేతలు నిలదీయడంతో కమిషనర్ సమాధానం దాట వేశారు.
 
 భారీ బందోబస్తు
 ఈ సందర్భంగా మున్సిపల్ కార్యలయం ఆవరణలో సీఐ విజయానంద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు గోవిందరావు, లక్ష్మణరావు, శ్రీనివాసరావులతోపాటు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన సరుబుజ్జలి ఎంపీపీ కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, జెడ్‌పీటీసీ ప్రతినిధి ఎస్ నాగేశ్వరరావు, ఆమదాలవలస జెడ్‌పీటీసీ ప్రతినిధి బొడ్డేపల్లి నారాయణరావు, బూర్జ జెడ్‌పీటీసీ సభ్యుడు ఆన్నెపు రామకృష్ణ, ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు, పొందూరు ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ, ఎంపీటీసీ  కోరుకొండ సాయిరాం, పార్టీ నాయకులు కిల్లి లక్ష్మణరావు, జె.జె.మోహన్‌రావు, కుసుమంచి శ్యా మ్‌ప్రసాద్, తమ్మినేని చిరంజీవినాగ్, దన్నాన సత్యానారాయణ, పి.చిన్నారావు, ఎస్.దాసునాయుడు, ఖండాపు గోవిందరావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement