హత్యా రాజకీయాలు హతం కావాలి
ఆమదాలవలస:అధికారమదంతో హత్యారాజకీయాలు చేస్తే సహించేది లేదని, ఎదురుదాడి తప్పదని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీమంత్రి తమ్మినేని సీతారాం హెచ్చరించారు. శనివారం అసెం బ్లీలో చోటుచేసుకున్న పరిణామాలకు వ్యతిరేకంగా ఆమదాలవలస గేటు వద్ద శనివారం రాత్రి కార్యకర్తలతో కలిసి నోటికి నల్ల రిబ్బన్లు ధరించి, కొవ్వొత్తులతో సుమారు గంటసేపు మౌన నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు గూండాల్లా చెలరేగిపోయి శాసనసభ గౌరవాన్ని మంటగలిపారని విమర్శించారు.
దివంగతులైన ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మూడు నెలల్లో 14 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను హత్య చేశారని అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించడాన్ని తప్పుపట్టడం సమంజసం కాదన్నారు. ఫ్యాక్షనిస్టు అయిన పరిటాల రవీంద్ర దేశ నాయకుడన్నట్లు ఆయన హత్యను పదేపదే అసెంబ్లీలో చర్చించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అలాంటి హంతకుల గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు నేరస్తులు కారా అని ప్రశ్నించారు. పరిటాల రవిది రాజకీయ హత్య కాదని, దాదాగిరీ చేసే వారికి అలాంటి దుస్థితి తప్పదన్నారు.
అసెంభ్లీలో నర హంతకులు, ద్రోహులు, దోచుకునేవారు అనే పదాలు వాడిన వారిని బఫూన్ అనడంలో తమ్పేముందని ప్రశ్నిస్తూ అది అన్‌పార్లమెంటరీ పదం అని అనడంలో అర్థం లేదని దుయ్యబట్టారు. ఈ మాత్రం దానికే ప్రధాన ప్రతిపక్ష నేతను బహిష్కరిస్తామనిడంలో ఆంత్యర్యమేమిటని నిలదీశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు బొడ్డేపల్లి అజంతాకుమారి, పొన్నాడ కృష్టవేణి, ఎస్.మురళీధరరావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల చిరంజీవిరావు, దుంపల శ్యామలరావు, పార్టీ నాయకులు జెజె మోహన్‌రావు, జె.వెంకటేశ్వరరావు, బలగ అప్పారావు, బి.విజయలక్ష్మి, జి.శ్రీనివాసరావు, పి.చిన్నారావులతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా?
శ్రీకాకుళం అర్బన్: పత్రికా స్వేఛ్చను హరించే హక్కు ఎవరికీ లేదని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు అన్ని పత్రికలనూ ఆహ్వానించి సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టువంటిదన్నారు. మీడియా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కని అన్నారు. దాన్ని కాలరాయవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసేదిగా ఉందన్నారు. రైతు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని రైతులు ఆశించారని, వారి ఆశలు అడియాసలయ్యాయన్నారు.
ప్రత్యేక బడ్జెట్ అని చెప్పి రూ.13వేల కోట్లు కేటాయించారన్నారు. ఇది వ్యవసాయ శాఖ పద్దుల మాదిరిగా ఉందన్నారు. ఈ బడ్జెట్‌కు రాజ్యాంగబద్ధత లేదన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఎన్నికల హామీలకు, బడ్జెట్‌కు పొంతన లేదన్నారు. రైతాంగానికి, తీరప్రాంత ప్రజలకు సోలార్ విద్యుత్ పరికరాలు సబ్సిడీపై అందిస్తామన్న హామీ కూడా కాగితాలకే పరిమితమైందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం వ్యవసాయరంగానికి కచ్చితమైన భరోసా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు, రైతులు తిర గబడే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు మొదలవలస లీలామోహన్ తదితరులు పాల్గొన్నారు.