వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం విడుదల చేసిన మేనిఫెస్టోకు జనంనుంచి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర నాయకుడు,
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ :వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం విడుదల చేసిన మేనిఫెస్టోకు జనంనుంచి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర నాయకుడు, సినీనటుడు విజయచందర్ తెలిపారు. హైదరాబాద్‌నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఆయన మంగళవారం సాయంత్రం కాసేపు పిడుగురాళ్లలో విలేకరులతో మాట్లాడారు. ప్రధానంగా గ్యాస్‌పై వందరూపాయల సబ్సిడీపై ఇచ్చిన హామీని ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయనీ, ఇప్పుడు ఆ రుణం తీర్చుకునేందుకు వారంతా ఉవ్విళ్లూరుతున్నారని చెప్పారు.
లబ్ధిపొందినవారిలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కూడా ఉన్నారని తెలిపారు. గడచిన 35రోజులుగా తాను రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించినపుడు అక్కడ ఫ్యాన్‌కు లభిస్తున్న ఆదరణే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న 50 ఏళ్ల తర్వాత రాష్ర్టం ఎలా ఉండాలో వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోలో స్పష్టం చేశారనీ, ప్రత్యర్థి పార్టీల్లో ఈ మేనిఫెస్టో కలవరం కలిగిస్తోందన్నారు. రూ.100కే 2 బల్బులు, 2 ఫ్యాన్లు, టీవీకి కరెంటు ఇస్తానని, పగటివేళ 7 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయిస్తానని చెప్పటంవల్ల పేదలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. దొంగమాటలతో ప్రజలను మాయచేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికో ఉద్యోగమంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, అది అమలుకు సాధ్యంకానిదని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసపుచ్చేందుకు వస్తున్న బాబును తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.