
పిడుగురాళ్ల రూరల్: ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తను సజీవంగా దహనం చేసేందుకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాదెండ్ల లింగారావు ఎన్నికల సమయంలో చురుగ్గా వ్యవహరించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు సమయం కోసం ఎదురుచూడసాగారు.ఆదివారం సాయంత్రం లింగారావు తన పొలంలో చెత్త కుప్పలను దహనం చేసేందుకు ఒంటరిగా వెళ్లాడు. దీన్ని గమనించిన టీడీపీ నాయకులు షేక్ సైదా, షేక్ గండేలు, ముళ్లపూడి వెంకటేశ్వర్లు.. పొలంలోకి వెళ్లి లింగారావు చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను లాక్కుని అతనిపై పోసి నిప్పు అంటించారు.
నువ్వు బతికి ఉంటే గ్రామంలోకి రారా అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయారు. పక్క పొలాల్లో పనిచేస్తున్న కొందరు వెంటనే వచ్చి మంటలు ఆర్పి లింగారావును కాపాడారు. అనంతరం నిందితులు వెంకటేశ్వర్లు, సైదాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గండేలు పరారీలో ఉన్నాడు. లింగారావు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment