తొలి ఎన్నికల్లోనే ఫ్యాన్ స్పీడ్
వైఎస్‌ఆర్‌సీపీ సత్తా చూపింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీలను ఢీకొని తన జోరును రుచి చూపించింది. నాలుగు మున్సిపాలిటీల్లో రెండింటిని కైవసం చేసుకుంది. అత్యంత బలంగా ఉన్నానని చెప్పుకొన్న టీడీపీ మిగిలిన రెండింటిని దక్కించుకోగా. కాంగ్రెస్ ఆనవాలు లేకుండా పోయింది. కొత్తగా ఏర్పాటైన వైఎస్‌ఆర్‌సీపీకి సరైన సంస్థాగత నిర్మాణం ఇంకా జరగకపోవడం.. ఊహించని రీతిలో మున్సిపల్ ఎన్నికలు వచ్చి పడినప్పటికీ రెండు ప్రధాన పార్టీలను ఎదుర్కొని సగం మున్సిపాలిటీలు సాధించడం విశేషం. పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉండే మున్సిపాలిటీల్లోనే ఢీ అంటే ఢీ అనే స్థితికి ఎదిగిన వైఎస్‌ఆర్‌సీపీ పూర్తిగా గ్రామీణ ఓటర్లపై ఆధారపడిన ప్రాదేశిక.. పట్టణ, గ్రామీణ ఓటర్లు కలగలసిన సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి ఆధిక్యం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తొలిసారి పురపోరులో తలపడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇచ్ఛాపురం, ఆమదాలవలస మున్సిపాలిటీల ను ఆ పార్టీ గెలుచుకుంది. మిగిలిన రెండిం టిలో టీడీపీ విజయం సాధించింది. పలాస మున్సిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీ ఆ పార్టీ ఖాతాలో చేరాయి. వెరసి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ చెరి రెండు గెలుచుకొని భవి ష్యత్ రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ పెంచాయి. జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. మరోవైపు ఈ నెల 16న కీలకమైన అసెం బ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజల దృష్టి ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియపైనే కేంద్రీకృతమైంది.
ఏ మున్సిపాలిటీలో ఎలా..?
ఇచ్ఛాపురం మున్సిపాలిటీని వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టమైన ఆధిక్యంతో గెలుచుకోవడం భవి ష్యత్ రాజకీయ పరిణామాలకు సూచికగా నిలిచింది. ఇక్క మొత్తం 23 వార్డులకు గానూ వైఎస్‌ఆర్‌సీపీ 13 వార్డుల్లో ఘనవిజయం సాధించింది. దాంతో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని దక్కించుకునేందుకు మార్గం సుగమమైంది. టీడీపీ ఎనిమిది వార్డులు దక్కించుకుంది. ఇండిపెండింట్లు రెండు వార్డుల్లో విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో రాజకీయ సమీకరణాలతో సంబం ధం లేకుండా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పార్టీ ఖాతాలో చేరింది. మున్సిపాలిటీలో మొత్తం 18,089 ఓట్లు పోలు కాగా... వైఎస్‌ఆర్‌సీపీకి 8,078 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 7,294 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 947 ఓట్లు పడ్డాయి. ఇండిపెండింట్లు 1770 ఓట్లు దక్కించుకున్నారు.
తీవ్ర ఉత్కంఠ భరితమైన త్రిముఖపోరులో ఆమదాలవలస మున్సిపాలిటీలో వైఎస్‌ఆర్‌సీపీ విజయకేతనం ఎగురవేసిం ది. మొత్తం 23 వార్డులకు ఎన్నికలు జరగ్గా...వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 10 వార్డుల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ ఎనిమిది వార్డులు దక్కించుకుంది. కాగా కాంగ్రెస్ మూడు వార్డుల్లో గెలిచింది. స్వతంత్రులు రెండు వార్డులను కైవసం చేసుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్ధి బొడ్డేపల్లి అజంతాకుమారి 11వ వార్డులో విజయం సాధించడంతో ఆమె మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమైంది. మున్సిపాలిటీలో మొత్తం 24,075 ఓట్లు పోలు కాగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 10,625 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 8,272 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 3,381ఓట్లు, ఇండిపెండింట్లకు 1,809 ఓట్లు వచ్చాయి.
పాలకొండ, పలాసల్లో టీడీపీ
కొత్తగా ఆవిర్భవించిన పాలకొండ నగర పంచాయతీని టీడీపీ దకి ్కంచుకుంది. మొత్తం 20 వార్డులకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 12వార్డుల్లో విజయం సాధించింది. వైఎస్‌ఆర్‌సీపీ మూడు వార్డులను గెలుచుకోగా, స్వతంత్రులు ఐదు వార్డుల్లో విజయం సాధించారు. ఈ నగర పంచాయతీలో అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ వైఎస్‌ఆర్‌సీపీ, స్వతంత్రులకు వచ్చిన ఓట్లు కలిపితే టీడీపీకి వచ్చిన ఓట్ల కంటే చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం. మొత్తం 14,215 ఓట్లు పోలు కాగా.. టీడీపీకి 5,605 ఓట్లు వచ్చాయి.
వైఎస్‌ఆర్‌సీపీకి 3,784 ఓట్లు పోలయ్యాయి. కాగా ఇండిపెండిండెంట్లు ఏకంగా 4,742 ఓట్లు దక్కించుకోవడం గమనార్హం. ఈ ఓట్లన్నీ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీకి దక్కాయన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇండిపెండింట్లు అత్యధిక ఓట్లు చీల్చడం వల్లే టీడీపీ విజయం సాధించినట్టు స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రుల ప్రభావం నియోజకవర్గంలో లేనందువల్ల ఓట్లు ఏ పార్టీ వైపు పడ్డాయన్నది తేలాల్సి ఉంది. కాబట్టి పాలకొండ నగర పంచాయతీలో టీడీపీ గెలుపుతో ఆ పార్టీ బలంగా ఉందని చెప్పలేని పరిస్థితి నెలకొంది.పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కూడా టీడీపీ ఖాతాలో చేరింది. మొత్తం 25 వార్డులకు గానూ...టీడీపీ 17 వార్డుల్లో విజయం సాధించింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎనిమిది వార్డులను గెలుచుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 30,240 ఓట్లు పోలు కాగా టీడీపీకి 15,885 ఓట్లు వచ్చాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 13,478 ఓట్లు దక్కించుకుంది. కాంగ్రెస్‌కు 480 ఓట్లు రాగా, స్వతంత్రులు 933 ఓట్లు దక్కించుకున్నాయి.
ప్రాదేశిక ఫలితాలపై ఆసక్తి
మున్సిపల్ ఫలితాల సరళితో ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలపై పడింది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ బలంగా ఉన్న నేపథ్యంలో ఈ ఓట్ల లెక్కింపుపై పార్టీ వర్గాలు ఆసక్తితో ఉన్నాయి. జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించి జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని వైఎస్‌ఆర్‌సీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రజల మనోభీష్టాన్ని వెల్లడించే ఈ ఓట్ల లెక్కింపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కూడా సూచికగా నిలుస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించినందున ఓట్ల లెక్కింపునకు బాగా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.సాయంత్రం నాలుగు గంటల తరువాతే గంటల తరువాతే తుది ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నారు. ఈ ఫలితాల కోసం అటు రాజకీయ పార్టీలు ఇటు జిల్లా ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
మున్సిపాలిటీల్లో బలాబలాలు
మున్సిపాలిటీ మొత్తం సీట్లు వైఎస్‌ఆర్‌సీపీ టీడీపీ కాంగ్రెస్ ఇతరులు
ఆమదాలవలస 23 10 8 3 2
పలాస-కాశీబుగ్గ 25 8 17 -- --
ఇచ్ఛాపురం 23 13 8 -- 2
పాలకొండ 20 3 12 -- 5