నాటి పరాభవానికి..నేడు ప్రతీకారం!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్:సార్వత్రిక ఎన్నికల్లో రాజాం అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడం ద్వారా వైఎస్‌ఆర్‌సీపీ నేత కంబాల జోగులు గతంలో తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గతంలో జోగులుపై ఎవరు దాడి చేశారు?.. ఆ దాడికి ఇప్పటి ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవడం ఏమిటని అనుకుంటున్నారా??.. అయితే ఒక్కసారి గతంలోకి వెళ్లాల్సిందే.. 2004 ఎన్నికల్లో కంబాల జోగులు పాలకొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో తాజా మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్ ఎచ్చెర్ల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006 ప్రాంతంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఒక సమావేశంలో జోగులుపై కోండ్రు దాడికి పాల్పడ్డారు.
అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఆ శాఖ సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణాలకు సంబంధించి జోగులు పలు ప్రశ్నలు సంధించారు. దాంతో రెచ్చిపోయిన కోండ్రు.. మంత్రినే ప్రశ్నించేంత వాడివయ్యావా? అంటూ జోగులుపైకి దూసుకెళ్లి ఆయన మెడలోని కండువా పట్టుకొని దాడి చేశారు. ఈ సంఘటనలో జోగులు చొక్కా కూడా చిరిగిపోయింది. సౌమ్యునిగా పేరున్న జోగులుపై దాడి చేయడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. తోటి దళిత శాసనసభ్యుడిని కోండ్రు దాడి చేసి, అవమానించడం పట్ల ఆ వర్గంలోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. తనపై జరిగిన దాడితో మనస్తాపానికి గురైన జోగులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినా..
తర్వాత ఎందుకులే.. అనుకొని వదిలేశారు. అక్కడి నుంచి ప్రస్తుతానికి వస్తే.. ఈ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి కోండ్రు, జోగులు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు. వైఎస్‌ఆర్‌సీపీ తరపున పోటీ చేసిన జోగులుకు 69,192 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ మంత్రి హోదాలో పోటీ చేసిన కోండ్రు మురళీకి 4790 ఓట్లు మాత్రమే వచ్చాయి. జోగులు విజయం సాధించగా.. కోండ్రు డిపాజిట్ కూడా గల్లంతై తీవ్ర పరాభవానికి గురయ్యారు. ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటన్న పలువురు గతంలో తనపై జరిగిన దాడికి జోగులు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.