సైకిలెక్కిన సిక్కోలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లాలో ఉత్కంఠభరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం సాధిం చింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అనుకూలంగా ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలోనూ టీడీపీ విజయ కేతనం ఎగురవేసింది. కాగా తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ దీటైన పోటీ ఇచ్చింది. తొలి ఎన్నికల్లోనే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు పీడకలగా మిగిలిపోయా యి. అన్ని నియోజకవర్గాల్లోనూ ఘోర పరాజ యాన్ని మూటగట్టుకుని కాంగ్రెస్ పూర్తి గా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం. ఇక కొత్తగా ఆవిర్భవించిన జైసమైక్యాంధ్ర పార్టీగానీ ఇతర పార్టీలు, స్వతంత్రులుగానీ ఎలాంటి ప్రభావం చూపలేక పూర్తిగా చతికిలపడిపోయారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల చిత్రం ఇలా ఉంది..
తిరుగులేని ఆధిక్యత..
జిల్లాలో టీడీపీ తిరుగులేని ఆధిక్యత కనబరిచింది. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నెగ్గారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌పై విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన వీరిద్దరి పోరులో చివరికి విజయం కళానే వరించింది. ఆయన 4,951 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి గెలుపొందారు. ఆమె తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై 24,065 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమదాలవలసలో తొలిసారిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంపై 5,501 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నరసన్నపేటలో మొదటిసారిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌పై 5,869 ఓట్ల మెజార్టీతో గెలుపొం దారు. మొదట్లో రమణమూర్తి ఆధిక్యత సాధించగా ఆ తర్వాత కృష్ణదాస్ ముందంజ వేశారు. కానీ 18 రౌండ్ల తర్వాత రమణమూర్తి మళ్లీ ఆధిక్యం సాధించి చివరివరకు కొనసాగించారు.
టెక్కలిలో టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 8,387 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దాదాపు సగం రౌండ్ల వరకు దువ్వాడ శ్రీనివాస్ ఆధిక్యంలో కొనసాగారు. నందిగాం, టెక్కలి మండలాల ఓట్ల లెక్కింపులో శ్రీనివాస్ మెజార్టీ సా ధించారు. కానీ సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల ఓట్ల లెక్కింపులో అచ్చెన్న పైచేయి సాధించారు. అదే ఆధిక్యతను చివరివరకు కొనసాగించి గెలుపొందారు. పలాసలో టీడీపీ అభ్యర్థి గౌతు శ్యామసుందర శివాజీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వజ్జ బాబూరావుపై 17,495 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇచ్ఛాపురంలో తొలిసారిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్తు రామారావు ను 25,038 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో కింజరాపు ఎర్రన్నాయుడి వారసుడినే విజయం వరించింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి శాంతిపై 1,27,094 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మూడు చోట్ల ‘ఫ్యాన్’ విజయం
తొలిసారి సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావవంతమైన రీతిలో ప్రజా మద్దతు సాధించింది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పాలకొండలో పార్టీ అభ్యర్థి విశ్వసరాయి కళావతి టీడీపీ అభ్యర్థి నిమ్మక జయక ృష్ణపై 1,620 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గిరిజన ప్రాంతాల్లో ఫ్యాన్ గాలి వీచింది. గిరిజనులు అత్యధికంగా కళావతికి మద్దతు ప్రకటించడం విశేషం. తీవ్ర ప్రతిబంధకాలను ఎదురొడ్డీమరీ కళావతి గెలుపొందడం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది. పాతపట్నంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కలమట వెంకటరమణ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును మట్టి కరిపించారు. ఆయనపై 3,812 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజాంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వైఎస్సార్‌సీపీ విజయ పతాకం ఎగుర వేసింది. పార్టీ అభ్యర్థి కంబాల జోగులు టీడీపీ అభ్యర్థి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతిపై విజయం సాధించడం ద్వారా అందరి ద ృష్టిని ఆకర్షించారు. విజయం చివరివరకు దోబూచులాడిన ఈ పోరులో కంబాల జోగులు 512 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కాంగ్రెస్ పని సరి
కేంద్ర, రాష్ట్రాల్లో పదేళ్లపాటు అధికారం చలాయించిన కాంగ్రెస్‌ను జిల్లా ప్రజలు పూర్తిగా తుడిచిపెట్టేశారు. పోటీచేసిన అన్నిచోట్లా ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులతోసహా పార్టీ అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం. కేంద్ర మంత్రి క ృపారాణి కూడా డిపాజిట్టు దక్కించుకోలేకపోయారు. ఆమె కేవలం 24,104 ఓట్లను మాత్రమే తెచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీ దుస్థితికి అద్దం పట్టింది. పదేళ్లు ఎమ్మెల్యేగా, మూడేళ్లు మంత్రిగా చేసిన కోండ్రు మురళి, 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న బొడ్డేపల్లి సత్యవతి, గత ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మక సుగ్రీవులు, మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్ అగర్వాలాతోసహా పార్టీ అభ్యర్థులెవరికీ డిపాజిట్లు దక్కలేదు. తద్వారా జిల్లా రాజకీయ చిత్రపటం నుంచి కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.