సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:తీవ్ర ఉత్కంఠ మధ్య ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్య హోరాహోరీ పోరుకు తగ్గట్లుగానే ఫలితాలు వచ్చాయి. జెడ్పీటీసీ స్థానాల్లో రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. మంగళవారం రాత్రి ఒంటిగంట వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 38 జెడ్పీటీసీలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ 15 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. కాగా టీడీపీ 22 జెడ్పీటీసీ(నరసన్నపేట ఏకగ్రీవ స్థానంతోసహా) స్థానాల్లో విజయం సాధించింది. రణస్థలం కౌంటింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఎంపీటీసీ స్థానాల్లో కూడా రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ మొత్తం 15 మండల పరిషత్తులను గెలుచుకుంది. టీడీపీ 22 ఎంపీపీలను దక్కించుకుంది. మరో రెండు మండల పరిషత్తుల్లో హంగ్ ఏర్పడింది. వాటిలో ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా ఆమదాలవలస నియోజకవర్గంలోని నాలుగు మండల పరిషత్తులు, 3 జెడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జెడ్పీపీఠం కోసం నువ్వా... నేనా!
ప్రతిష్టాత్మకమైన జెడ్పీ పీఠం కోసం వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్యపోరు కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 12 గంటలకు ఓట్ల లెక్కింపు వివరాలు అందేసరికి వైఎస్సార్ కాంగ్రెస్ 15 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. కంచిలి, పలాస రూరల్, నందిగాం, టెక్కలి, కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి, సారవకోట, జలుమూరు, శ్రీకాకుళం రూరల్, ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, సీతంపేట, రాజాం జెడ్పీటీసీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. కాగా టీడీపీ 22 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. ఇచ్ఛాపురం, కవిటి, సోం పేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, పాతపట్నం, ఎల్.ఎన్.పేట, నరసన్నపేట, గార, పాలకొండ, వీరఘట్టం, భామిని, సంతకవిటి, వంగర, జి.సిగడాం, లావేరు, ఎచ్చెర్ల జెడ్పీటీసీ స్థానాలు టీడీపీ పరమయ్యాయి. పొందూరు, పోలాకి, రేగిడి, రణస్థలం జెడ్పీటీసీల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి పేడాడ భార్గవి పలాస రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యురాలిగా విజయం సాధిం చారు. కాగా టీడీపీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా భావిస్తున్న చౌదరి ధనలక్ష్మి ఎచ్చెర్ల మండలం నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలో జెడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠభరితంగా మారింది.
ఎంపీపీల్లోనూ తీవ్రపోటీ
మండల పరిషత్తుల పోరులోనూ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. ఎంపీటీసీ స్థానాల్లో కొంతవరకు టీడీపీ ఆధిక్యత సాధించింది. కాగా ఎంపీపీ స్థానాల్లో రెండు పార్టీల మధ్య స్వల్ప తేడాయే ఉండటం గమనార్హం. మొత్తం 675 ఎంపీటీసీ స్థానాలకుగాను... వైఎస్సార్ కాంగ్రెస్ 273 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 361 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ 15 మండల పరిషత్తులను చేజిక్కించుకుంది. ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు, రాజాం, కొత్తూరు, మెళియాపుట్టి, హిరమండలం, సీతంపేట, వీరఘట్టం, నందిగాం, జలుమూరు, సారవకోట, కంచిలి, జి.సిగడాం మండల పరిషత్తులు వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకుంది.
టీడీపీ 21 మండల పరిషత్తులను గెలుచుకుంది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, టెక్కలి, నరసన్నపేట, పోలాకి, శ్రీకాకుళం రూరల్, గార, పాతపట్నం, ఎల్.ఎన్.పేట, పాలకొండ, భామిని, వంగర, రేగిడి, సంతకవిటి, లావేరు, రణస్థలం మండల పరిషత్తులు టీడీపీ సాధించింది. కాగా రెండు మండల పరిషత్తులలో హంగ్ ఏర్పడింది. పలాస, ఎచ్చెర్ల మండలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. పలాస ఎంపీపీని వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎచ్చెర్ల మండల పరిషత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది.
పల్లె పోరులో హోరాహోరీ
Published Wed, May 14 2014 3:11 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement