
సామ్యాజిక్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పార్టీ అధ్యక్షుడు సంధించిన ఐదు సంతకాల అస్త్రం.. మున్సిపల్ ఎన్నికల సరళిపై సానుకూల సంకేతాలు.. ప్రజల్లో ఉన్న విశేషాదరాభిమానాలు వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల రథాన్ని టాప్‌గేర్‌లో పరుగులు తీయిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యత... కొన్ని ప్రధాన సామాజికవర్గాలకు తొలిసారి కీలక పదవులు పొందే అవకాశం కల్పించడం ... పకడ్బందీ ఎన్నికల కార్యాచరణ... పార్టీ నాయకత్వానికి ఉన్న చరిష్మా ... వెరసి జిల్లా రాజకీయ సమీకరణలు వైఎస్‌ఆర్‌సీపీకి పూర్తి అనుకూలంగా మారాయి.
ఇప్పటికే ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ సరళి అనుకూలంగా ఉండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అదే ఊపుతో ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ శ్రేణులు దూసుకుపోతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడమే అంతిమ లక్ష్యంగా కదనోత్సాహంతో ఎన్నికల రణక్షేత్రాన్ని ఏకపక్షం చేస్తున్నాయి. సామాజిక సమతుల్యతకు కొత్త అర్థం జిల్లాలో సామాజికవర్గ సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త రాజకీయ అస్త్రం సంధించారు.
ఇంతవరకు రాజకీయ అవకాశం లభించని వర్గాలను కీలక పదవులకు ఎంపిక చేస్తూ వినూత్న రాజకీయ ప్రయోగానికి తెరతీశారు. ప్రధాన సామాజిక వర్గాలైన తూర్పు కాపు, కాళింగ, వెలమ వర్గాలకు అవకాశం కల్పించడం ద్వారా సమతుల్యత సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన సన్నిహిత నేతకు చెందిన సామాజికవర్గానికే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అందుకు భిన్నంగా బలమైన మూడు సామాజిక వర్గాలకు సమప్రాధాన్యం కల్పించారు. ఇతర వెనుకబడిన వర్గాలనూ సముచిత రీతిలో గుర్తించారు.
కాళింగ వర్గానికి అగ్ర ప్రాధాన్యం
జిల్లాలో కాళింగ సామాజిక వర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ అగ్రప్రాధాన్యం కల్పిం చింది. ఆ వర్గానికి చెందిన నేతలను మూడు నియోజకవర్గాల(ఆమదాలవలస, టెక్కలి, పలాస) సమన్వయకర్తలుగా ఖరారు చేశారు. టీడీపీతో పోలిస్తే కాళింగ వర్గానికి వైఎస్సార్‌సీపీ అత్యధిక ప్రాధాన్యం కల్పించింది. ఈ వర్గానికి టీడీపీ కేవలం రెండు నియోజకవర్గాల్లోనే(ఆమదాలవలస, ఇచ్ఛాఫురం) అవకాశం కల్పించింది.
కాళింగ సామాజిక వర్గీయులు అత్యధికంగా ఉన్న టెక్కలి నియోజకవర్గంలో కూడా ఆ వర్గాన్ని టీడీపీ పట్టించుకోకపోవడం గమనార్హం. జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ సామాజికవర్గపరం గా వినూత్న ప్రయోగం చేసింది. కాళింగ సామాజికవర్గానికి చెందిన మహిళా నేత పేరాడ భార్గవిని జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా నిర్ణయించింది. 1952 తరువాత ఈ సామాజికవర్గానికి జెడ్పీ పీఠం దక్కకపోవడం గమనా ర్హం. అందుకే కాళింగ వర్గానికి ఆ పదవి ఇవ్వాలని జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.
తూర్పుకాపులకు తొలిసారి కీలక పదవులు
కాగా తూర్పుకాపు సామాజికవర్గ నేతలను రెండు నియోజకవర్గాల(ఎచ్చెర్ల, పాతపట్నం) సమన్వయకర్తలుగా వైఎస్‌ఆర్‌సీపీ నియమిం చింది. ఇదే సామాజికవర్గానికి పార్టీ అధినేత మరో అరుదైన గౌరవం కల్పించారు. అత్యధిక జనాభా ఉన్నప్పటికీ తూర్పుకాపు సామాజికవర్గానికి శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో ఇంతవరకు అవకాశం రాలేదు. కానీ తొలిసారి సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతిని శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ నిర్ణయం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు రాజ కీయంగా మరింత సానుకూలంగా మారింది.
వెలమ సామాజికవర్గానికి పెద్దరికం
వెలమ సామాజికవర్గానికి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ సుముచిత స్థానం కల్పించింది. నరసన్నపేట, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ఆ వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించింది. జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఆ వర్గానికి చెందిన వివాదరహితుడు ధర్మాన కృష్ణదాస్‌ను ఎంపిక చేసి జిల్లా పెద్దరికం అప్పగించారు.
ఇతర వర్గాలకు సముచిత స్థానం
జిల్లాలో ఇతర సామాజికవర్గాలకు కూడా వైఎస్సార్‌సీపీ సముచిత స్థానం కల్పించింది. ఇచ్ఛాఫురం నియోజకవర్గ సమన్వయకర్తలుగా వెనుకబడిన వర్గాలైన రెడ్డిక, యాదవ వర్గాల నేతలను నిర్ణయించారు. ఈ రెండు వర్గాలను టీడీపీ అసలు పట్టించుకోనే లేదు. రిజర్వేషన్ ప్రకారం రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించారు. ఈ విధంగా జిల్లాలో సామాజికవర్గ సమతూల్యాన్ని పాటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ సరికొత్త రాజకీయానికి తెరతీసింది.
రెట్టించిన ఉత్సాహంతో సమరనాదం
మున్సిపల్ ఎన్నికలు జిల్లాలో పార్టీ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఓటింగ్ సరళి సానుకూలంగా ఉండటంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నాయి. విశ్వసనీయత కలిగిన నేతగా అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ప్రజాదారణ పార్టీకి జీవనాడిగా నిలుస్తోంది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ఆయన ప్రకటించిన సంక్షేమ అజెండాను అన్ని వర్గాల ప్రజ లు స్వాగతిస్తున్నారు. ఈ సానుకూల సంకేతాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.
జిల్లా లో ఎన్నికలు జరగనున్న 37 జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికం వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకోనుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. కనీసం 24 జెడ్పీటీసీ స్థానాల్లో పార్టీ కచ్చితంగా విజయం సాధించనుందని స్పష్టమవుతోంది. మరో 8 చోట్ల టీడీపీతో తీవ్ర పోటీ నెలకొంది. వాటిలో వైఎస్సార్‌సీపీ కనీసం 4 నుంచి 5 స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.
అంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ సిం గిల్ డిజిట్ మార్క్ దాటితే గొప్ప అనే పరిస్థితి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వెలువడుతున్న ఈ విజయసంకేతాలతో జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడంతోపాటు అంతి మంగా వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకోవడానికి కదం తొక్కుతోంది.