వైఎస్సార్‌సీపీకే జెడ్పీ పీఠం | YSRCP party won huge majority in nellore district | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకే జెడ్పీ పీఠం

Published Wed, May 14 2014 3:09 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

వైఎస్సార్‌సీపీకే జెడ్పీ పీఠం - Sakshi

వైఎస్సార్‌సీపీకే జెడ్పీ పీఠం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పట్టణాల్లో వైఎస్సార్ సీపీకి ఆధిక్యత ఇచ్చిన జిల్లా ప్రజలు పల్లెల్లోనూ జై జగన్ నినాదం చేశారు. కడపటి వార్తలు అందేసరికి జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన 24 మ్యాజిక్ ఫిగర్‌ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 26 మండలాల్లో  వైఎస్సార్‌సీపీ పూర్తి మెజారిటీ సాధించింది.  వైఎస్సార్‌సీపీ నుంచి జెడ్‌పీ చైర్మన్ అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి పోటీచేసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి 2395 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
 
 టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా సూళ్లూరుపేట నుంచి బరిలోకి దిగిన వేనాటి రామచంద్రారెడ్డి 2205 ఓట్లతో గెలుపొందారు. ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో  వైఎస్సార్‌సీపీకి ఏకపక్ష ఓటింగ్ జరిగి మండలాలు, జెడ్‌పీటీసీలను స్వీప్ చేసింది. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలో 10 ఎంపీటీసీలకు 10 స్థానాలు గెలిచి వైఎస్సార్‌సీపీ స్వీప్ చేసింది. కావలి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సు ల్లో చెదలు చేరడంతో ఏర్పడిన వివాదం కారణంగా ఈ కేంద్రంలో ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. మిగిలిన కేంద్రాల్లో కూడా ఉదయం 8 గంటల నుంచే బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకుని వచ్చినా పార్టీల వారీగా బ్యాలెట్లు వేరు చేసి కట్టలు కట్టడంలో తీవ్ర ఆలస్యం జరిగి ఉదయం 11 గంటలకు కానీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్క మండలం కానీ, ఒక్క జెడ్‌పీటీసీ స్థానం కానీ గెలవలేకపోవడం గమనార్హం.
 
 చైర్మన్ పీఠం వైఎస్సార్‌సీపీదే
 జిల్లాలో 46 జెడ్‌పీటీసీ స్థానాల్లో  24 మ్యాజిక్ ఫిగర్ గెలుచుకుని వేనాటి రామచంద్రారెడ్డిని జెడ్‌పీ చైర్మన్ చేయడానికి టీడీపీ రంగంలోకి దించింది. ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బులు ఖర్చుచేసి ఎక్కడి కక్కడ వైఎస్సార్‌సీపీని కట్టడి చేయడానికి తీవ్రంగా కష్టపడింది. అయితే ఆ పార్టీని పల్లె జనం ఆదరించలేదు. వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్సీ, పార్టీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని బరిలోకి దించింది. ఓట్ల లెక్కింపునకు ముందే టీడీపీ జెడ్పీ చైర్మన్ పదవి మీద ఆశలు వదులుకుంది. అయితే దింపుడు కల్లం ఆశతో ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. జెడ్‌పీటీసీ ఫలితాల వెల్లడి ప్రారంభం అవుతూనే జెడ్‌పీ ఇక తమది కాదని టీడీపీ నిర్ణయించుకుంది.
 
 వైఎస్సార్‌సీపీ గెలిచిన జెడ్‌పీటీసీలు
  1. బాలాయపల్లి 2.చిల్లకూరు 3. ఆత్మకూరు 4. సంగం 5. మనుబోలు 6. డి.వి.సత్రం 7. సీతారాంపురం 8. మర్రిపాడు 9. వాకాడు 10.పెళ్లకూరు 11. ఏఎస్ పేట 12. చిట్టమూరు 13 ఉదయగిరి 14. వెంకటాచలం 15. కోట 16. చేజర్ల 17. టీపీ గూడూరు 18 అనంతసాగరం 19 చిట్టమూరు, 20. కావలి రూరల్, 21 ముత్తుకూరు, 22 వింజమూరు
 టీడీపీ గెలిచిన జెడ్‌పీటీసీలు
 1. వరికుంటపాడు 2. వెంకటగిరి 3.సూళ్లూరుపేట 4.దుత్తలూరు 5.డక్కిలి 6.నెల్లూరు రూరల్ 7.నాయుడుపేట 8. ఓజిలి 9.తడ 10.విడవలూరు
  వైఎస్సార్‌సీపీ గెలిచిన మండలాలు
 1. నెల్లూరు రూరల్ 2. ఆత్మకూరు 3. సంగం 4. బాలాయపల్లి 5. మర్రిపాడు 6. వాకాడు 7. వింజమూరు 8. సీతారాంపురం 9. ఉదయగిరి 10. అల్లూరు 11. కొడవలూరు 12. ముత్తుకూరు 13. వెంకటాచలం 14. టీపీ గూడూరు 15.మనుబోలు 16. పెళ్లకూరు 17. కలువాయి 18. కోట 19. గూడూరు రూరల్ 20. డివిసత్రం 21. సూళ్లూరుపేట 22.  జలదంకి 23.తడ 24. అనంతసాగరం 25. సైదాపురం, 26 బోగోలు
 టీడీపీకి దక్కిన మండలాలు
 1. వరికుంటపాడు 2. డక్కిలి  3. నాయుడుపేట  4.చిట్టమూరు 5.కొండాపురం 6. విడవలూరు 7. చిట్టమూరు 8. కోవూరు 9. దుత్తలూరు 10. కలిగిరి 11. ఓజిలి  12. ఏఎస్ పేట 13. కావలి రూరల్
 వెంకటగిరిలో చెరో 4
 వెంకటగిరి మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాల్లో  4 వైఎస్సార్‌సీపీ  4 టీడీపీ గెలిచింది. దీంతో ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేకి మండల పరిషత్‌లో ఓటు హక్కు కల్పిస్తే ఈ ఫలితం ఎటు ఉంటుందో చెప్పలేని పరిస్థితి.
 
 చిల్లకూరు, బుచ్చి వైఎస్సార్‌సీపీవైపే
 చిల్లకూరు మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాల్లో  వైఎస్సార్‌సీపీ 6 గెలుచుకుంది. టీడీపీ 5 దక్కించుకోగా  కాంగ్రెస్ 2, స్వతంత్రులు 2 స్థానాలు గెలుపొందారు. అయితే ఇందులో ఒక స్వతంత్ర అభ్యర్థి వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రానుండటంతో ఈ మండలం కూడా వైఎస్సార్ సీపీ ఖాతాలో పడనుంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో  22 ఎంపీసీటీ స్థానాలకు గాను వైఎస్సార్ సీపీ 11, టీడీపీ 8  సీపీఎం 2 బీజేపీ 1 స్థానం గెలుపొందాయి. ఇక్కడ సీపీఎం లే దా బీజేపీ అభ్యర్థి ఒకరు వైఎస్సార్‌సీపీ వైపు నడిస్తే ఆ పార్టీ ఈ మండలాన్ని కూడా దక్కించుకుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement