జెడ్పీ ‘పీఠ’ముడి! | Zilla Parishad chairman post? | Sakshi
Sakshi News home page

జెడ్పీ ‘పీఠ’ముడి!

Published Thu, May 8 2014 12:32 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

జిల్లా పరిషత్ - Sakshi

జిల్లా పరిషత్

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ చైర్మన్‌గిరీ దక్కించుకోవాలంటే విందులు.. వినోదాలు, ప్యాకేజీలు.. నజరానాలు తప్పనిసరి. కుర్చీకి అవసరమైన మేజిక్ ఫిగర్ ఉన్నా, వారిని కాపాడుకునేందుకు ఇవి సర్వసాధారణం. మర్యాదలో ఏ మాత్రం తేడా వచ్చినా కుర్చీకి ఎసరు వచ్చినట్లే. సొంత పార్టీ సభ్యులను సంతృప్తిపరచడమేకాదు. సంఖ్యాబలం తక్కువైతే ప్రత్యర్థులను ఆకర్షించేందుకు తాయిలాలు తప్పవు. ఈ ఫార్ములాను పాటించినవారిదే జెడ్పీ పీఠం.

ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో ‘స్థానిక’ ఎన్నికలు జరగడం.. సార్వత్రిక ఎన్నికల వేళ వీటి ఫలితాలు వెలువడ నున్న నేపథ్యంలో రాజకీయపార్టీలు జిల్లా పరిషత్‌పై అంతగా ఆసక్తి కనబర్చలేదు. సుదీర్ఘ విరామం తర్వాత రిజర్వేషన్ జనరల్ కావడంతో చైర్మన్ కుర్చీ కోసం పోటీ తీవ్రంగా ఉంటుందని అంతా భావించారు. అయితే, అదే సమయంలో శాసనసభ ఎన్నికలు తరుముకురావడంతో ఆశావహులు వెనక్కి తగ్గారు.

ఈ సీటు రేసులో నిలిస్తే అసెంబ్లీ టికెట్లు రాకుండా పోతుందనే అనుమానంతో కూడా చాలామంది జెడ్పీటీసీగా రంగంలో దిగేందుకు ముందుకురాలేదు. 33 జెడ్పీటీసీలు ఉన్న జిల్లా పరిషత్‌లో హంగ్ తప్పదని భావిస్తున్న పార్టీలు చైర్మన్ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

కాంగ్రెస్‌లో వైరాగ్యం
అన్ని పార్టీలకంటే ముందే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం చేతులెత్తేసింది. నవాబుపేట జెడ్పీటీసీగా పోటీ చేసిన ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అధిష్టానం కూడా ఆయన అభ్యర్థిత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ మొదట్లో సొంత పార్టీలోనే ఏకాభిప్రాయం రాలేదు. సాధారణ ఎన్నికలు ముంచుకురావడంతో అప్పటికప్పుడు ఈ వివాదం సమసిపోయినా... ఇప్పుడు అది తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చైర్మన్ రేసులో ఉన్న యాదవరెడ్డి ఇతర మండలాల్లోని అభ్యర్థులకు ఆర్థిక సాయం చేయకపోవడాన్ని కూడా వైరివర్గం తప్పుబడుతోంది.

ఎమ్మెల్యే అభ్యర్థులే ఈ ఎన్నికల ఖర్చును కూడా భరించారని, ఎన్నికల వేళ రాద్ధాంతం చేయకూడదనే మిన్నకుండిపోయామని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు శిబిరాల నిర్వహణ తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నారు. తాజా ఎన్నికలతో తలప్రాణం తోకకు వచ్చిందని... క్యాంపులను పట్టించుకునే పరిస్థితుల్లో లేమని తేల్చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో చైర్మన్ ఎన్నిక జరుగుతుందని, అప్పటివరకు జెడ్పీటీసీలను శిబిరాలకు తరలించడం ఆర్థికంగా తమకు భారమని, ఇది చైర్మన్ అభ్యర్థి భరించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు మొన్నటి వరకు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో జెడ్పీ చైర్మన్ గెలుపు బాధ్యతలు నెత్తినెత్తుకునేందుకు ఇష్టపడడంలేదని తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత జెడ్పీని గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నా.. పార్టీల్లో సమన్వయలేమి తలెత్తింది. మేజిక్ ఫిగర్ రానప్పటికీ అర్ధ బలంతో జెడ్పీని కైవసం చేసుకునే వాతావరణం ఉన్నప్పటికీ, నేతల మధ్య అనైక్యతను కాంగ్రెస్‌ను వెంటాడుతోంది.

క్యాంపులకు రెడీ!
ప్రత్యేక రాష్ట్రంలో తొలి ప్రభుత్వం మాదేనని అత్మవిశ్వాసంతో ఉన్న టీఆర్‌ఎస్... శిబిరాల నిర్వహణకు సన్నాహాలు చేసుకుంటోంది. నిర్దేశిత సంఖ్యలో జెడ్పీటీసీలను గెలుచుకునే అవకాశంలేదనే అంచనాకొచ్చిన ఆ పార్టీ.. ఇప్పటికే ఇతర పార్టీలకు వల వేసే పనిలో నిమగ్నమైంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి మరోసారి తన సతీమణి సునీతను చైర్‌పర్సన్ రేసులో నిలిపారు. యాలాల నుంచి బరిలో దింపడం ద్వారా టీఆర్‌ఎస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో మేజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు సర్వశక్తులొడ్డారు. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల సెగ్మెంట్లలో ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో పీఠాన్ని దక్కించుకుంటామనే గట్టి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ లుకలుకలు తమకు కలిసివస్తాయని,ప్యాకేజీల ద్వారా మరికొందరు తమ గూటికి చేరుకుంటారనే విశ్వాసంతో ఉన్నారు. క్యాంపుల నిర్వహణలో దిట్టగా పేరున్న మహేందర్.. జెడ్పీ గద్దె చేజారకుండా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.
 
దేశంలో నిట్టూర్పు!
మూడు దశాబ్దాలుగా జిల్లా పరిషత్‌ను నిలబెట్టుకున్న టీడీపీ ఈసారి ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. ముగ్గురు కీలక నేతలు కారెక్కడం, రాష్ట్ర విభజన నేపథ్యంలో టీఆర్‌ఎస్ బలపడడంతో ఆ పార్టీ డీలా పడింది. గట్టి పట్టున్న గ్రామీణ నియోజకవర్గాల్లో కనీసం ఐదారు జెడ్పీటీసీలు గెలిచే అవకాశంలేదని విశ్లేషించుకున్న ఆ పార్టీ.. తూర్పు ప్రాంతంపైనే ఆశలు పెట్టుకుంది.

సుమారు 13 జెడ్పీటీసీలు తమవేననే ధీమాతో ఉన్న టీడీపీ... మిగతా సంఖ్యను సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది. చైర్మన్ రేసులో ఉన్న జిల్లెల నరేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలు ఇప్పటికే ఈ మేరకు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల్లో ఉన్న అనైక్యత తమకు కలిసివస్తుందని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది. ఈ క్రమంలోనే గెలుపొందిన జెడ్పీటీసీలను ఈ నెల 13వ తేదీనే క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement