
నేడు తుది విడతస్థానిక సమరం
* అసెంబ్లీ ఫలితాలకు రెండు మూడు రోజుల ముందే స్థానిక ఫలితాలు
* పరోక్ష పద్ధతిలో మేయర్, చైర్‌పర్సన్‌ల ఎన్నికలు
* 536 జెడ్పీటీసీలకు 2,469 మంది, 7,975 ఎంపీటీసీలకు 25,621 మంది పోటీ
* ఓటర్ల జాబితాలో పేరు లేనివారు పోలింగ్ కేంద్రాలకు రావద్దు: రమాకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల తుది సమరానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని సగం పల్లెల్లో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది విడతలో 536 జడ్పీటీసీ స్థానాలకు 2,469 మంది, 7,975 ఎంపీటీసీ స్థానాలకు 25,621 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను శాసనసభ ఎన్నికల ఫలితాల కంటే రెండు మూడు రోజుల ముందుగా ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి. రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు.
ముందుగా మున్సిపల్ ఫలితాలు, ఆ తరువాత ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. స్థానిక ఫలితాల తరువాత పరోక్ష పద్ధతిలో మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు చైర్‌పర్సన్‌లు, వైస్-చైర్‌పర్సన్‌ల ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై గడువేమీ లేదని తెలిపారు. పరోక్ష ఎన్నికల నిర్వహణకు మూడు రోజుల ముందు ఎన్నికైన సభ్యులకు నోటీసు ఇస్తే సరిపోతుందన్నారు. ఆయన గురువారం ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్‌మిట్టల్, సంయుక్త కార్యదర్శి సత్య రమేష్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయనేం చెప్పారంటే...
* ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసే నాటికి ఓటర్ల జాబితాలో పేర్లున్న వారు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. మార్చి 10 తరువాత ఓటర్ల జాబితాలో చేరిన వారు ఓటు వేయడానికి అనర్హులు. వారి పేరు స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉండదు. ఓటర్ల జాబితాలో పేరు లేని వారు అనవసరంగా పోలింగ్ కేంద్రాలకు రావద్దు. పోలింగ్ సిబ్బందితో ఘర్షణ పడవద్దు.
* ఓటరు స్లిప్పులు లేకపోయినా.. తాము ఇది వరకు జారీ చేసిన 21 ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని తీసుకుని వచ్చినా ఓటు వేయవచ్చు.
* ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్లను ఆదేశించాం.
* తుది విడత ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా భారీ బందోబస్తు ఏర్పాటుచేశాం. మొదటి విడతకు వినియోగించిన 95,031 సిబ్బందితోపాటు, అదనంగా 45 ప్లాటూన్ల ఎపీఎస్పీ, ఏసీబీ, విజిలెన్స్, జైలు, ట్రాన్స్‌కో పోలీసులు, అటవీ, ఎక్సైజ్ అధికారులను వినియోగిస్తున్నాం.
* 25,758 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం 1.31 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 3,089 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తాం. 3,206 కేంద్రాల్లో వీడియో రికార్డింగ్, 5,078 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించాం.
* సున్నిత పోలింగ్ కేంద్రాలు 6057 ఉంటే, 6463 అతిసున్నిత, నక్సల్స్ ప్రభావిత కేంద్రాలు 558గా గుర్తించాం. నక్సల్స్ ప్రభావిత కేంద్రాల్లో సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ కొనసాగుతుంది.
* స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు రూ. 84.47 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3.48 లక్షల కిలోల నల్లబెల్లం కూడా స్వాధీనం చేసుకున్నారు.