తారస్థాయిలో ప్రచారాలు
Published Wed, Apr 9 2014 2:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల ప్రచారాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనున్న మలివిడత మండలాల్లో బుధవారం సాయంత్రంతో ప్రచారపర్వం ముగియనుంది. దాంతో చివరి అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు ప్రచారాలతో గ్రామాలను హోరెత్తిస్తున్నాయి. ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఓట ర్లకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తొలివిడతలో 18 మండలాల్లో ఎన్నికలు జరగ్గా.. మిగిలిన 20 మండలాల్లో మలివిడత పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ మండలాల్లోని 20 జెడ్పీటీసీ, 346 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వాస్తవానికి 358 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ 12 స్థానాలు ఏకగ్రీవం కావడంతో 346 ఎంపీటీసీ స్ధానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. జెడ్పీటీసీ స్థానాలకు 68 మంది, ఎంపీటీసీ స్థానాలకు 815 మంది పోటీ పడుతున్నారు. గత పది రోజులుగా వీరంతా ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. మరికొద్ది గంటల్లో బహిరంగ ప్రచారానికి తెర పడనుండటంతో తెరచాటు ప్రచారానికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభపరిచే ప్రక్రియకు తెరలేపనున్నారు. మొదటి విడత పోలింగ్ సరళి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నట్లు తేలడంతో ఆ పార్టీ తరపున రెండో విడతలో బరిలో ఉన్న అభ్యర్ధులు మరింత ఉత్సాహంతో ప్రచారం చేసుకు వెళ్తున్నారు.
కాగా రెండు విడతలోనైనా కోలుకోవాలన్న ఆశతో తెలుగుదేశం అభ్యర్ధులు అన్ని రకాల ఎత్తులు వేస్తున్నారు. ప్రజలు మాత్రం వైఎస్సార్‌సీపీకే బహిరంగ మద్దతు తెలుపుతుండడంతో ప్రలోభాలతోనైనా వారిని తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనలో తెలుగుదేశం నేతలు ఉన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ సహకారం అందిపుచ్చుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం రాత్రి నుంచే మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందునుంచే భారీగా మద్యం కొనుగోలు చేసి రహస్య ప్రదేశాల్లో నిల్వ చేసుకున్నారు. ఇప్పుడు వాటిని బయటకు తీస్తున్నారు. పొందూరు మండలంలో సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతకు చెందిన మద్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకోవడమే దీనికి నిదర్శనం. కాగా కొన్ని మండలాల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలను సిద్ధం చేసినట్లు భోగట్టా.
Advertisement
Advertisement