తొలి పరీక్ష
తొలి పరీక్ష
Published Sun, Apr 6 2014 3:57 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: తొలిదశ ప్రాదేశిక తుదిపోరుకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఓటరు మారాజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాడు. అటు అధికార యంత్రాంగం.. ఇటు అభ్యర్థులు అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. గత పది రోజులుగా ఓటర్ల మనసు చురగొని ఓట్లు కొల్లగొట్టేందుకు పోటీలో ఉన్న పార్టీలు, అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశారు. తొలివిడతలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు.. శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస, రాజాం, పాతపట్నం పరిధిలోని 18 మండలాల్లో జిల్లా పరిషత్, మండలపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పార్టీ గుర్తులపై జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది.
ఈ ఎన్నికల్లో 7,95,214 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,98,927 మంది పురుషులు కాగా 3,96,280 మంది మహిళలతో పాటు ఏడుగురు ఇతరులు ఉన్నారు. ప్రశాంతంగా, పకడ్బందీగా పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేసి, శనివారం సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 18 మండలాల్లో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల పోలింగుకు 1042 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5807 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో వీరందరికీ పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. రూట్లు వారీగా విభజించి బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలతోపాటు సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు పంపించారు. సిబ్బంది, సామగ్రి రవాణా కోసం ఆర్టీసీతోపాటు ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల మధ్యే పోటీ
ఈ ఎన్నికల్లో పలు పార్టీలు, ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సగానిఇకపైగా స్థానాల్లో అభ్యర్థులనే నిలబెట్టలేని దీనస్థితిలో ఉండగా.. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ జరుగుతోంది. ప్రచారంలో వైఎస్‌ఆర్‌సీపీ అధిక్యం స్పష్టంగా కనిపించడంతో అనేక చోట్ల కాంగ్రెస్, టీడీపీలు లోపాయికారి ఒప్పందాలతో పరస్పరం సహకరించుకోవడంతో పాటు డబ్బు, మద్యం పంపిణీ వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. తొలివిడతలో 18 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా..
నరసన్నపేట జెడ్పీటీసీ ఏకగ్రీవమైంది. దాంతో మిగిలిన 17 జెడ్పీటీసీలకు 53 మంది పోటీ పడుతున్నారు. అలాగే ఎంపీటీసీ స్థానాల్లో 12 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 303 ఎమ్పీటీసీ స్థానాల్లో 680 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలి విడత లో శ్రీకాకుళం, గార, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి, పాతపట్నం, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, మెళియాపుట్టి, కొత్తూరు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 18 మండలాల్లో 572 సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఆయా ప్రాంతాలతో పాటు మిగిలి ఉన్న గ్రామాల్లో 4023 మంది పోలీసులను బందోబస్తు విధులకు నియమించారు. ఎస్పీ నవీన్‌గులాఠీ ఆధ్వర్యంలో ఎనిమిది మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 80 మంది ఎసై ్సలు, 400 మంది ఏఎసై ్సలు, 1500 మంది కానిస్టేబుళ్లు, 60 మంది హోంగార్డులు, 1000 మంది ఏఆర్ పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
పోలింగ్ సిబ్బందికి అరకొర ఏర్పాట్లు
కాగా ఎన్నికల సామగ్రి తీసుకెళ్లేందుకు వచ్చిన పోలింగ్ సిబ్బందికి వసతి, భోజన ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసేందుకు సిబ్బందిని మండల కేంద్రాలకు రప్పించారు. చాలా చోట్ల మధ్యాహ్నం సరైన ఆహారం సరఫరా చేయక పోవడంతో వీరు పస్తులు ఉండాల్సి వచ్చింది. మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో మహిళా సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకెన్ని అవస్థలు ఎదుర్కోవలసి ఉంటుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
అంకెల్లో అభ్యర్థులు..
ఏర్పాట్లు
ఎన్నిక జరిగే జెడ్పీటీసీలు..
17
రంగంలో ఉన్న అభ్యర్థులు...
53
ఎన్నిక జరిగే ఎంపీటీసీలు ...
303
పోటీలో ఉన్న అభ్యర్థులు...
680
పోలింగ్ కేంద్రాలు...
1,042
ఎన్నికల సిబ్బంది సంఖ్య...
5,807
సమస్యాత్మక గ్రామాలు..
572
పోలీస్ సిబ్బంది...
4,023
Advertisement