‘పద్మావతి..థియేటర్ల ఆహుతి’ | Padmavati: Jai Rajputana Sangh threatens to burn cinema halls | Sakshi
Sakshi News home page

‘పద్మావతి..థియేటర్ల ఆహుతి’

Published Mon, Oct 16 2017 9:51 AM | Last Updated on Mon, Oct 16 2017 1:48 PM

Padmavati: Jai Rajputana Sangh threatens to burn cinema halls

సాక్షి,ముంబయి: బాలీవుడ్‌ దర్శక దిగ్గజం సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన చారిత్రక దృశ్య కావ్యం పద్మావతిని వివాదాలు వీడలేదు. గతంలో రెండు సందర్భాల్లో మూవీ సెట్లను దగ్ధం చేయడం, దర్శకుడిపై రాజ్‌పుత్‌ కర్ని సేన కార్యకర్తలు దాడులకు తెగబడటం తెలిసిందే. తాజాగా రాణి పద్మిని ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను ముందుగా తమకు ప్రదర్శించిన తర్వాతే విడుదల చేయాలని జై రాజ్‌పుట్‌ సంఘ్‌ అల్టిమేటం జారీ చేసింది. తమకు సినిమాను చూపించకుండా రిలీజ్‌ చేస్తే థియేటర్లను ధగ్థం చేస్తామని హెచ్చరించింది.

మూవీలో చరిత్రను వక్రీకరించారా అనే కోణంలో తాము పరిశీలించిన తర్వాతే విడుదలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. చరిత్రను వక్రీకరించడం లేదా రాణీ పద్మావతి, అల్లాద్దీన్‌ ఖిల్జీ మధ్య రొమాంటిక్‌ అనుబంధం చూపినా తాము సహించమని హెచ్చరించింది. ఇలాంటి సన్నివేశాలుంటే సినిమా ప్రదర్శించే థియేటర్లను దగ్ధం చేసేందుకు వెనుకాడమని పేర్కొంది. పద్మావతిని అగౌరవపరిచేలా చూపి రాజస్థానీలను అవమానిస్తే చూస్తూ ఉండబోమని జై రాజపుట్‌ సంఘ్‌ వ్యవస్థాపకులు భన్వర్‌ సింగ్‌ రెటా హెచ్చరించినట్టు ఓ వెబ్‌సైట్‌ పేర్కొంది.

పద్మావతి మూవీని రాజ్‌పుట్‌ సంఘాల ప్రతినిధులకు చూపాలని, రాణీ పద్మావతిని అవమానించేలా ఎలాంటి సన్నివేశాలు లేకుంటే చిత్ర విడుదలకు తాము గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్‌ 1న పద్మావతి మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement