నడక  ఇక బస్‌! | 17-year-old Sindhu desperate for the bus | Sakshi
Sakshi News home page

నడక  ఇక బస్‌!

Published Fri, Feb 2 2018 12:06 AM | Last Updated on Sat, Feb 10 2018 4:04 PM

 17-year-old Sindhu desperate for the bus - Sakshi

దీక్ష పట్టి తన ఊరికి ఆర్టీసీ బస్‌ను సాధించుకున్న ఇంటర్‌ విద్యార్థిని సింధు 

బాల్యం నుంచి నడిచి, నడిచి విసుగెత్తి... ఊరికి బస్సు కోసం 17 ఏళ్ల సింధు పడిన ఆరాటం, చేసిన పోరాటం చివరికి ఫలించింది. ఎంత కష్టపడితే ఫలించిందన్నది ఆమె మాటల్లోనే...

చిమ్నాపూర్‌. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరం. మండల కేంద్రానికి సమీప గ్రామం. ఎటు వెళ్లాలన్నా నాలుగైదేళ్ల క్రితం వరకూ కాలి నడకే. ఇప్పుడు తారు రోడ్డు ఉంది. కానీ షేరింగ్‌ ఆటో కోసం రెండు కిలోమీటర్లు.. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు  వెళ్లాలంటే మూడున్నర కిలోమీటర్లు.. రోగమొచ్చినా.. నొప్పొచ్చినా.. అత్యవసరమైనా.. ఆటో కిరాయికి రెండొందలు! ఆ చిన్నారి పాదాలకు ఈ దూరాలు, లెక్కలు ఏవీ తెలియవు. ఊహ తెలిసినప్పటి నుంచి అనుభవంలోకి వచ్చింది ఒక్కటే.. బడికి వెళ్లాలంటే నడవాలి... కాలేజీకి వెళ్లాలన్నా నడవాల్సిందే. ఒంటరి నడకలో బాల్యంలో భయపెట్టే దెయ్యాలు, భూతాలు.. టీనేజ్‌కి వచ్చాక.. ఎవరు వెంట పడతారో.. వేధిస్తారోనని.. అనునిత్యం భయాలు. బస్సు ఉంటే భయం లేకుండా వెళ్లొచ్చు. గతంలో రోడ్డు లేదు కాబట్టి బస్సు రావడం లేదన్నారు. ఇప్పుడు రోడ్డున్నా బస్సు రావడం కుదరదంటున్నారు.. తెగించింది.. మొండికేసింది.. తిండి మానేసింది.. చివరకు ఒక్కొక్కరు కదలివచ్చారు. చివరకు బస్సు కూడా!! 

మాది సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రానికి అనుబంధ గ్రామం చిమ్నాపూర్‌. నాన్న నారాయణరెడ్డిగారి శ్రీనివాస్‌రెడ్డి, అమ్మ సునీత. ఊర్లో కొద్దిపాటి భూమి ఉన్నా పంట పండదు. నాన్న పొద్దునే ప్రైవేటు కంపెనీకి పనికి వెళ్తాడు. అమ్మ గృహిణి, చెల్లి సంగారెడ్డిలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ‘కంది’ శిశు మందిర్‌లో ఒకటి నుంచి ఐదో తరగతి దాకా చదువుకున్నా. బడికి వెళ్లాలంటే ఊరు చివర ఉన్న పెద్ద చెరువు కట్ట మీదుగా నడవాల్సిందే. వీలైతే నాన్న వచ్చేవాడు. లేదంటే  అటు వైపు వెళ్లేవారితోనో.. కొన్నిసార్లు ఒంటరిగానో నడవాల్సి వచ్చేది. దార్లో ఎదురయ్యే కుక్కలు, పశువులంటే విపరీతమైన భయం. ఐదో తరగతి దాటింది. మళ్లీ ఆరు నుంచి సంగారెడ్డి శిశు మందిర్‌.. నడక రెండు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్లు. కుక్కలు కరిస్తే.. రెండుమార్లు ఆసుపత్రిలో బెడ్‌ మీద ఉన్నాను. చావు తప్పిందన్నారు. 

కల్వకుంట మీదుగా నడక
తొమ్మిది, పదిలో సాయంత్రం పొద్దుపోయే వరకూ స్పెషల్‌ క్లాస్‌లు. బస్సు ఉంటే బాగుండు.. నడక తప్పేది.. సమయం కలిసి వచ్చేది.. రోజంతా ఇవే ఆలోచనలు. ఎవరికైనా చెపితే నవ్వుతారేమో.. అమ్మా, నాన్నకు చెపితే చదవలేక సాకులు వెతుకుతుందంటారేమో. గతంలో రోడ్డు లేదు.. ఇప్పుడు తారు రోడ్డు.. అయినా ఆటో అంకుల్‌ ఊరికి రానంటాడు. రెండు కిలోమీటర్లు నడిచి కందికి వెళ్తే.. మళ్లీ సంగారెడ్డికి రాను పోను 20 రూపాయలు. పోనీ కల్వకుంట మీదుగా సంగారెడ్డికి నేరుగా నడిచి వెళ్తే  నాలుగు కిలోమీటర్లు. ఎవరైనా వెంటబడతారని భయం! చిన్నప్పుడు ఒక ఆంటీని చంపి.. ఆ కాల్వలోనే పడేశారు. ఇప్పుడు ఇంటర్‌ ఫస్టియర్‌.. కొద్దిగా పెద్దదాన్నయిన ఫీలింగ్‌.

కలెక్టర్‌ ఆఫీస్‌కి నడక
తొమ్మిది నెలల క్రితం.. అమ్మా నాన్నలకు కూడా తెలియదు.. ఓ సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లా. గవర్నమెంట్‌ కాలేజీలో పాములు, తేళ్లు వస్తున్నాయి. పక్కనే స్మశానం ఉంది.. అంటూ ఓ విజ్ఞాపన. దాంతో పాటే మా ఊరికీ బస్సు వేయమని మరో అర్జీ. కాలేజీ ఆవరణ శుభ్రం చేశారు. బిల్డింగ్‌కు రంగులు వేశారు. స్మశానం కనబడకుండా గోడ కట్టారు. కానీ ఊరికి బస్సు వేస్తామని చెప్పరేం? అసహనం.. దుఃఖం. అర కిలోమీటరు నడక తప్పుతుందని.. సెకండ్‌ ఇయర్‌లో ప్రైవేటు కాలేజీకి. ఇప్పుడు నాతో పాటు చెల్లి కూడా సంగారెడ్డి కాలేజీకి.. ఒకరికి ఒకరం తోడు.. అయితే కంది.. అక్కడ నుంచి ఆటో.. లేదంటే కల్వకుంట మీదుగా నడక.

బస్సు కోసం నడక
జనవరి 2. కాలేజీకి వెళ్లలేదు. అమ్మ సంగారెడ్డి హాస్పిటల్‌లో చెకప్‌ కోసం వెళ్లింది. బాల్యం గుర్తొస్తోంది.. నడక.. దాని చుట్టూ ముడిపడ్డ అనుభవాలు, జ్ఞాపకాలు, భయాలు. ఇంట్లో ఉండాలనిపించడం లేదు. సంగారెడ్డి కొత్త బస్టాండు వద్దకు వెళ్లా. వెంట తీసుకెళ్లిన బ్లేడుతో చేయి కోసుకున్నా. రక్తం కారుతోంది.. ట్రాఫిక్‌ పోలీసులు.. ఆ తర్వాత అసలు పోలీసులు..  ఎందుకు చేశావని గదమాయిస్తున్నారు. అందరూ చుట్టూ నిలబడి చూస్తున్నారు. ఊరికి బస్సు కావాలి అన్నాను.  పిచ్చిది.. మెంటల్‌.. అని కామెంట్లు. అయితే స్టేషన్‌కు నడువు.. హుంకరింపు. నా మొండితనం చూసి సంగారెడ్డి డీఎం ఉమా మహేశ్వర్‌ స్టేషన్‌కు వచ్చిండు. ఐదు రోజుల్లో బస్సు వస్తుందని హామీ. నాన్న వచ్చిండు.. కట్టు కట్టించి ఇంటికి తీసుకుపోయిండు. ఐదు రోజులు.. అన్నం సహించదు.. నీళ్లు తాగబుద్ది కాదు.. ఊర్లో ఎవరికీ పట్టనిది.. నీకెందుకు? చదువుకో.. బాగుపడు.. కన్నందుకు మమ్మల్ని గోస పెట్టకు.. అమ్మా నాన్న హితబోధ, వేడుకోలు.. ఒక రకంగా నిర్బంధం.. వాళ్లకేం.. తెలుసు నడకంటే నాకెంత నరకమో!

బస్సు వేయలేదని నడక
ఐదు రోజులైనా హామీ ఇచ్చినోళ్లు అడ్రస్‌ లేరు. అవమానం అనిపించింది. అమ్మా నాన్న వద్దన్నా.. ఊర్లో హనుమాండ్ల గుడికాడ కూర్చున్నా. ఐదు రోజులు.. పది రోజులు.. ఊర్లో వాళ్లు వస్తున్నరు.. మంచి పని చేస్తున్నవన్నరు. నాకు ఇవేమీ పట్టడం లేదు. బస్సు ఎందుకు వేయరు.. ఇదే నా ఆలోచన.. ఆవేదన. పేపర్లలో అప్పుడప్పుడూ నా గురించిన చిన్న వార్తలు. ఆరోగ్యం దెబ్బతింది. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తీసుకుపోయిండ్రు. ఈమె బతకదు.. గాంధీకి తీసుకెళ్లమన్నరు.. బస్సు వస్తేనే ఏదైనా అని తెగేసి చెప్పిన. ఐసీయూలో పెట్టిన్రు.

బస్సును చూసేందుకు నడక
జనవరి 24. మా ఊరికి ఎంపీటీసీ కృష్ణగౌడ్‌ వచ్చిండు. డీఎం వచ్చిండు.. ఇంకెవరెవరో ఉన్నరు.. ‘రేపు మీ ఊరికి బస్సు వస్తుంది.. ఎమ్మెల్యే చెప్పమన్నడు’ అన్నరు. నాకు నమ్మకం లేదు.. అయినా ఏదో మూలన సంతోషం. రాత్రికి ఇంటికి వెళ్లిన. తెల్లారేసరికి ఊర్లో నా ఫొటోతో ఫ్లెక్సీ! బస్సు వచ్చింది. ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ వచ్చిండు. దండ వేసి.. నాతోనే రిబ్బన్‌ కట్‌ చేయించిండు. అందరం సంగారెడ్డికి వచ్చి.. మళ్లా బస్సులోనే వెనక్కి వచ్చినం. ఇప్పుడు బస్సు వస్తోంది... కానీ టైం ఇదని చెప్పలేం. పరీక్షలు దగ్గరకు వస్తున్నయి. పోయినేడు నడక టెన్షన్‌తో ఇంగ్లీషులో ఫెయిలైన. ఇప్పుడు చదువుకోవాలే.. పాస్‌ కావాలే.. వాళ్లు మాట నిలబెట్టుకుంటరనే అనుకుంటున్న. ఊరికి రోజూ బస్సు వస్తే.. ఇంకా బాగా చదువుకుంట. 
– కల్వల మల్లికార్జున్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement